రాష్ట్ర ఉత్సవంగా సదర్ సమ్మేళనం గుర్తింపు !

👉 ఉత్సవాల కోసం ప్రభుత్వం ₹ 5 కోట్ల నిధులు విడుదల !

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !


J.SURENDER KUMAR,

తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే యాదవ సోదరుల విజ్ఞప్తి మేరకు సదర్ సమ్మేళనాన్ని రాష్ట్ర ఉత్సవంగా గుర్తిస్తూ ఆదేశాలు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో సదర్ సమ్మేళనాన్ని అధికారికంగా నిర్వహించలేదని,  ఈ ఉత్సవాల కోసం ప్రభుత్వం ₹ 5 కోట్ల నిధులు విడుదల చేసినట్టు సీఎం తెలిపారు.

👉 హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో బుధవారం పెద్దఎత్తున నిర్వహించిన శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్‌ కార్యక్రమంలో ముఖ్యమంత్రి  పాల్గొన్నారు.

👉 ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,…

హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేయడంలో ప్రభుత్వ సంకల్పానికి యాదవుల సంపూర్ణ సహకారం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  కోరారు. మూసీ పునరుజ్జీవనం, మెట్రో రైలు విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులతో మరింతగా అభివృద్ధి సాధించి, దేశంలోనే ఆదర్శనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలని అన్నారు.


👉 తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పశుసంపద వైభవానికి ప్రతీకగా నిలిచే హైదరాబాద్ సదర్ ఉత్సవాలు యాదవుల ఆత్మగౌరవానికి, ఐక్యతకు, వారసత్వ గొప్పతనానికి ప్రతిబింబమని పేర్కొన్నారు. యాదవ సోదర సోదరీమణులందరికీ హైదరాబాద్ సదర్ ఉత్సవ శుభాకాంక్షలు తెలిపారు.


👉 హైదరాబాద్ నగరాభివృద్ధిలో యాదవ సోదరుల కృషి ఎంతో ఉందన్నారు. దేశంలో ఎక్కడి నుంచి ఏ పని కోసమైనా నగరానికి వచ్చిన వారందరినీ యాదవ సోదరులు ఆదరించి అక్కున చేర్చుకున్నారని అన్నారు.


👉 ఇక్కడ శాంతి భద్రతలను కాపాడటంలో యాదవుల పాత్ర ఎంతో ఉందని ప్రశంసించారు. ఈ సదర్ ఉత్సవాలు ప్రతి యాదవ కుటుంబంలో ఆనందోత్సాహాలు నింపాలని, అందరికీ సిరిసంపదలు, ఆయురారోగ్యాలు కలగాలని, యాదవుల ఐక్యత, అభ్యున్నతి మరింత బలోపేతం కావాలని ముఖ్యమంత్రి  ఆకాంక్షించారు.


👉 హైదరాబాద్ నగరం జాతీయస్థాయిలో పేరు ప్రతిష్ఠలను సాధించి అభివృద్ధి చెందిన నగరంగా నిలబెట్టడంలో యాదవ సోదరులు కష్టపడాలని కోరారు. యాదవుల ఆత్మగౌరవం, హక్కులను కాపాడే విషయంలో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత తనదని చెప్పారు.


👉 బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ తో పాటు ఎన్నో ప్రాంతాల నుంచి ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని సదర్ ఉత్సవానికి మరింత శోభను తెచ్చారని వ్యాఖ్యానించారు.


👉 మొట్టమొదటిసారిగా కులగణన చేసి దేశానికి మార్గదర్శకంగా నిలబడ్డామని చెబుతూ, ఎవరెంత మేరకు ఉంటే అంత శాతం వాటా కల్పించాలన్న లక్ష్యంతో కులగణన చేశామని అన్నారు. యాదవులకు ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించామన్నారు.


👉 ఈశ్వరమ్మ యాదవ్ ను యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి పాలకమండలి సభ్యురాలిగా నియమించడమే కాకుండా యాదగిరిగుట్ట గోశాల బాధ్యతలను కూడా అప్పగించామని తెలిపారు.


👉 ఈ సదర్ ఉత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్ , బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ , ఎంపీలు అనిల్ కుమార్‌ యాదవ్‌ , మల్లు రవి , ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎంపీ ధర్మేంద్ర యాదవ్, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ , మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ  పలువురు ప్రజాప్రతినిధులు, శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్‌ ఉత్సవ కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ , వివిధ రాష్ట్రాలకు చెందిన యాదవ ప్రతినిధులు పాల్గొన్నారు.