👉 అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి!
J . SURENDER KUMAR,
విద్యార్థులకు అందించిన స్కూల్ యూనిఫాంలపై పిల్లల నుంచి అభిప్రాయాలు (ఫీడ్‌బ్యాక్) సేకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యార్థుల నుంచి అభిప్రాయాలు సేకరించడం వల్ల భవిష్యత్తులో ఎక్కువ మంది విద్యార్థులు కోరుకునే రంగులు, డిజైన్లకు ప్రాధాన్యమివ్వచ్చని చెప్పారు.
👉 ముఖ్యమంత్రి ఎంసీఆర్ హెచ్ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో బుధవారం వివిధ శాఖల పరిధిలోని ప్రభుత్వ వసతిగృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాంలు, కిట్ల పంపిణీపై సమీక్షించారు.
👉 గతంతో పోలిస్తే ఎంతో నాణ్యమైన యూనిఫాంలు, ఆకర్షణీయమైన రంగులు, డిజైన్లతో అందజేశామని తెలిపారు. యూనిఫాంలతో పాటు టైలు, బెల్టులు, ఐడీ కార్డులు, షూలు, సాక్సులు, ప్లేట్లు, గ్లాసులు, కటోరాలు, కార్పెట్లు, స్కూల్ బ్యాగుల పంపిణీ దాదాపు పూర్తయిందని సమావేశంలో అధికారులు తెలియజేశారు.

👉 ఒకట్రెండు సంస్థల పరిధిలో కొన్ని వస్తువుల పంపిణీ 95 శాతం వరకు పూర్తయిందని వివరించగా, ఆ వస్తువుల పంపిణీని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
👉 వచ్చే ఏడాదికి విద్యార్థులకు అందజేసే యూనిఫాంలు, ఇతర సామగ్రికి సంబంధించి విధివిధానాలను (ఎస్‌వోపీ) ఇప్పుడే రూపొందించాలని స్పష్టం చేశారు.
👉 విద్యార్థులకు అందజేసే వస్తువుల జాబితా రూపకల్పన నుంచి, టెండర్లు, సరఫరా, అందజేత వరకు ప్రతిదీ నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని చెప్పారు. పాఠశాలలు తెరిచిన రోజునే మొత్తం వస్తువులు అందేలా ఇప్పటినుంచే కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
👉 ఈ సమీక్షలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి , సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ శ్రీధర్ , సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ , రాష్ట్ర గిరిజన, వెనుకబడిన తరగతుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా , వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
