సొమ్ములు రికవరీ చేశారు కేసుల నమోదు మరిచారా?

👉 ధర్మపురి సింగిల్ విండో భూ కొనుగోలు వ్యవహారంలో బాధ్యులకు అండ ఎవరిది ?

👉 ఏసీబీకి పంపిన విచారణ నివేదికలో ఏముంది ?

👉 ఆడిట్ అభ్యంతరాలు అటకెక్కాయా.. ₹96 వేల రికవరీతో అక్రమాలకు ముగింపు పలికారా ?


J..SURENDER KUMAR ,

సొసైటీ సొమ్ముతో భూమి కొనుగోలు.. ఎకరం భూమికి తీర్మానం.. రిజిస్టర్‌ అయినది మాత్రం 27 గుంటలే.. మిగిలిన 13 గుంటల భూమి వ్యవహారంపై ఆరేళ్లుగా సమాధానం లేని ప్రశ్నలు.. ఆడిట్ అధికారుల అభ్యంతరాలు.. తాజాగా ఏసీబీ విచారణతో మరోసారి తెరపైకి వచ్చిన వ్యవహారం.. చివరకు ₹ 96 వేల రికవరీతో బాధ్యతలు ముగిసినట్లేనా? బాధ్యులపై క్రిమినల్ కేసుల నమోదు ఊసే లేదా? ధర్మపురి సింగిల్ విండో భూమి కొనుగోలు వ్యవహారంలో తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి.


జగిత్యాల జిల్లా ధర్మపురి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (సింగిల్ విండో) నిధులతో నాగారం శివారులో భూమి కొనుగోలు చేసిన వ్యవహారంలో గత ఆరేళ్లుగా పలు ప్రశ్నలు సమాధానం లేకుండా మిగిలిపోయాయి. ఎకరం భూమి కొనుగోలుకు తీర్మానం చేసినట్లు రికార్డుల్లో ఉండగా, సొసైటీ పేరిట రిజిస్టర్‌ అయినది మాత్రం 0-27 గుంటల భూమి. మిగిలిన 0-13 గుంటల భూమికి సంబంధించి స్పష్టత లేకపోవడంతో ఏసీబీకి ఫిర్యాదు అందింది.

ఈ నేపథ్యంలో గత ఏడాది డిసెంబర్‌లో ఏసీబీ డైరెక్టర్ జనరల్ కార్యాలయం సంబంధిత శాఖ నుంచి విచారణ నివేదిక కోరినట్లు సమాచారం. అయితే, గత కొన్ని నెలలుగా నివేదిక పంపడంలో జాప్యం జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో గత సెప్టెంబర్ మూడో వారంలో రిజిస్టర్‌ కాని 0-13 గుంటల భూమికి సంబంధించిన సొమ్మును సొసైటీ ఖాతాలో జమ చేయించినట్లు తెలుస్తోంది.

సుమారు ₹.96 వేల మొత్తాన్ని రికవరీ చేసి సొసైటీ ఖాతాలో జమ చేసినట్లు నివేదిక సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే, సొమ్ము రికవరీ చేయడంతోనే వ్యవహారం ముగిసినట్లా? గతంలో జరిగిన లావాదేవీలపై బాధ్యత వహించాల్సిన వారు ఎవరు? వారిపై చర్యలు తీసుకున్నారా? అన్న ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.


👉 ఒప్పంద పత్రంలో ఏముంది ?


భూమి విక్రయించిన పట్టేదారు ఎడమల రాజేశ్వర్ రెడ్డి 2020 జూలై 16న ధర్మపురి సింగిల్ విండో అధ్యక్షుడికి రాసిచ్చినట్లు పేర్కొంటున్న నాన్‌ జ్యుడీషియల్ స్టాంపు పేపర్‌పై ఒప్పంద పత్రం జిరాక్స్ ప్రతిలో కీలక వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది.

నాగారం శివారులోని సర్వే నంబర్ 84ఈలో తనకు ఒక ఎకరం భూమి పట్టా ఉందని, అందులో 0-27 గుంటల భూమికి ధర కుదుర్చుకుని ₹3,95,500 చెల్లించగా, పట్టా లేని 0-13 గుంటల భూమికి సగం ధర చొప్పున మొత్తం ₹.93,600 తీసుకుని సొసైటీకి విక్రయించినట్లు ఒప్పంద పత్రంలో పేర్కొన్నట్లు సమాచారం.


అంతేకాకుండా, భూమికి సంబంధించిన భవిష్యత్ వివాదాల బాధ్యత తమదేనని, చెల్లించిన మొత్తానికి రెట్టింపు డబ్బులు చెల్లించేందుకు అంగీకరిస్తున్నట్లు ఒప్పందంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఒప్పంద పత్రంపై పట్టేదారు ఎడమల రాజేశ్వర్ రెడ్డి సంతకం కాకుండా ఇతరులు సంతకాలు చేసినట్లు కనిపిస్తోందనే అంశం కూడా పరిశీలించాల్సి ఉంది.


👉 రిజిస్ట్రేషన్‌కు ముందే అనుమతులు వచ్చాయా ?


ధర్మపురి మండలం నాగారం గ్రామ శివారులోని సర్వే నంబర్ 84ఈలో 0-27 గుంటల భూమిని పట్టేదారు ఎడమల రాజేశ్వర్ రెడ్డి నుంచి ధర్మపురి సింగిల్ విండో పేరిట 2020 జూలై 6న జగిత్యాల సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ నంబర్ 4052/2020 ద్వారా రిజిస్టర్ చేసినట్లు రికార్డులు సూచిస్తున్నాయి.


అయితే, జిల్లా సహకార అధికారి 2020 జూలై 13న సొసైటీ భూమి కొనుగోలుకు అనుమతిస్తూ లేఖ జారీ చేసినట్లు సమాచారం. ఈ తేదీలను పరిశీలిస్తే, అనుమతి పత్రం జారీకి ముందే జూలై 6న భూమి రిజిస్ట్రేషన్ జరిగినట్లు కనిపిస్తోంది.
అసలు భూమి కొనుగోలుకు అనుమతి ఎప్పుడు లభించింది? ముందస్తు అనుమతి లేకుండానే రిజిస్ట్రేషన్ జరిగిందా? ఈ వ్యవహారంలో నిబంధనలు పాటించారా? అన్న అంశాలపై సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.


👉 పట్టా భూమి.. పట్టా లేని భూమి.. రెవెన్యూ రికార్డుల్లో ఏముంది?


2021 ఫిబ్రవరి 20న ధర్మపురి తహసీల్దార్, జాయింట్ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో భూమి మ్యూటేషన్ జరిగినట్లు సమాచారం. పట్టేదారు రాజేశ్వర్ రెడ్డి పాస్‌బుక్ నంబర్ T18030120113, ఖాతా నంబర్ 283కు సంబంధించిన రెవెన్యూ రికార్డుల్లో పలు సర్వే నంబర్లలో భూమి ఉన్నట్లు నమోదు కాగా, సొసైటీ పేరిట రిజిస్టర్ అయిన 0-27 గుంటల భూమికి సంబంధించి ప్రత్యేక పాస్‌బుక్ నంబర్ T18030120460 నమోదైనట్లు తెలుస్తోంది.


అయితే, సర్వే నంబర్ 84ఈ/1లోని 0-27 గుంటల భూమిలో కొందరు కౌలుకు సాగు చేస్తున్నట్లు, అదే భూమి రెవెన్యూ రికార్డుల్లో నాన్‌ అగ్రికల్చర్ ల్యాండ్ (నాలా)గా నమోదైనట్లు సమాచారం.
ఈ భూమి వర్గీకరణలో మార్పులు ఎలా జరిగాయి? భూమి కొనుగోలు సమయంలో సంబంధిత రికార్డులను పరిశీలించారా? అన్న అంశాలు కూడా విచారణలో తేలాల్సి ఉంది.


👉 ఎకరం కొనుగోలుకు అనుమతి.. 27 గుంటలకే ఖర్చు?


సొసైటీ పేరిట ఎకరం భూమి కొనుగోలుకు ₹4.26 లక్షలు ఖర్చు చేయడానికి ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. అయితే, సొసైటీ రికార్డుల ప్రకారం 0-27 గుంటల భూమి కొనుగోలుకు మొత్తం ₹ 5,10,662 ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.


ఇందులో భూమి పట్టేదారుకు ₹.4,85,100, సబ్‌ రిజిస్ట్రార్ చలాన్ ద్వారా ₹9,062, నాలా చార్జీలకు రూ.10,000, సర్వే ఖర్చులకు ₹6,500 చెల్లించినట్లు నమోదైనట్లు సమాచారం.
అనుమతించిన మొత్తానికి మించి ఖర్చు చేశారా? ఎకరం భూమి కొనుగోలుకు తీర్మానం చేసినప్పుడు 0-27 గుంటల భూమికే రిజిస్ట్రేషన్ ఎందుకు జరిగింది? మిగిలిన 0-13 గుంటల భూమికి సంబంధించిన చెల్లింపుల వివరాలు ఏమిటి? అన్న ప్రశ్నలకు అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం రావాల్సి ఉంది.


👉 ఆడిట్ అభ్యంతరాలు.. పాలకవర్గం నిర్లక్ష్యమా.?


ధర్మపురి సింగిల్ విండో పేరుతో నాగారం శివారులో కొనుగోలు చేసిన భూమికి సంబంధించి ఆడిట్ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే, ఈ అభ్యంతరాలపై గత కొన్ని సంవత్సరాలుగా పాలకవర్గం నిర్లక్ష్యం వహించిందనే ఆరోపణలు ఉన్నాయి.
భూమి కొనుగోలు చేసిన తర్వాత కొన్ని నెలలకు సర్వసభ్య సమావేశం నిర్వహించి, 2021 మార్చి 26న జరిగిన సమావేశం మినిట్స్ పుస్తకంలో నాగారం శివారులో ఎకరం భూమి కొనుగోలుకు తీర్మానం చేసినట్లు చివరి అంశంగా నమోదు చేసినట్లు తెలుస్తోంది.
అయితే, 2020 జూలై 6న భూమి రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత 2021 మార్చిలో తీర్మానం నమోదు కావడంపై కూడా వివరణ అవసరం.


👉 రికవరీతో సరిపెట్టుకుంటారా.. క్రిమినల్ కేసులు ఎక్కడ?


భూమి కొనుగోలు వ్యవహారంలో తలెత్తిన ఆర్థిక, రికార్డుల సంబంధిత ప్రశ్నలకు కేవలం డబ్బులు రికవరీ చేయడం మాత్రమే సమాధానం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సొసైటీ ఖాతాలో డబ్బులు జమ చేసినంత మాత్రాన గత లావాదేవీలపై తలెత్తిన ప్రశ్నలకు సమాధానం లభించినట్లు కాదు.


అసలు ఎంత మొత్తం చెల్లించారు? ఆ డబ్బు ఎవరి వద్ద ఎంతకాలం ఉంది? సొసైటీకి ఆర్థిక నష్టం జరిగిందా? నిధుల వినియోగంలో నిబంధనలు ఉల్లంఘించారా? ఒప్పంద పత్రంలో పేర్కొన్న వివరాలు వాస్తవాలేనా? బాధ్యులపై చర్యలు తీసుకున్నారా? అన్న అంశాలపై విచారణ జరగాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో ఏసీబీ డైరెక్టర్ జనరల్ కార్యాలయానికి పంపే విచారణ నివేదికలో ఏ అంశాలను ప్రస్తావిస్తారు? ఆడిట్ అభ్యంతరాలు, భూమి రిజిస్ట్రేషన్ తేదీలు, ఒప్పంద పత్రం, బ్యాంకు లావాదేవీలు, రికవరీ వివరాలను సమగ్రంగా పరిశీలిస్తారా? అన్నది వేచి చూడాల్సిందే.


👉 ప్రజాధనానికి జవాబుదారీ ఎవరు?


సహకార సంఘాల నిధులు సభ్యుల ప్రయోజనాల కోసం వినియోగించాల్సిన ప్రజాధనంతో సమానమైన బాధ్యతను కలిగి ఉంటాయి. వాటి వినియోగంలో పారదర్శకత, నిబంధనల పాటింపు అత్యంత కీలకం.
ధర్మపురి సింగిల్ విండో భూమి కొనుగోలు వ్యవహారంలో ఆరేళ్లుగా సమాధానం లేని ప్రశ్నలకు సంబంధిత అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రూ.96 వేల రికవరీతోనే వ్యవహారానికి ముగింపు పలికారా? లేక బాధ్యులపై చట్టపరమైన చర్యలకు కూడా సిద్ధమవుతున్నారా?

ఏసీబీకి పంపిన విచారణ నివేదికలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయా? అక్రమాలకు బాధ్యులుగా తేలిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తారా? అన్నది ఇప్పుడు ధర్మపురి సింగిల్ విండో భూమి కొనుగోలు వ్యవహారంలో కీలకంగా మారింది.