👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J SURENDER KUMAR,
స్థానిక ప్రజాప్రతినిధుల ఆకాంక్షలకు అనుగుణంగానే ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని, రాష్ట్రంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో వారిని భాగస్వాములను చేస్తూ ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. నక్సలైట్లను కూడా అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, మావోయిస్టు నేత గణపతి తో పాటు ఇంకా ఎవరైనా అజ్ఞాతంలో మిగిలిన వారుంటే లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు.
👉 మీర్ఖాన్‌పేట భారత్ ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమి పూజ నిర్వహించారు. ఇదే సందర్భంగా గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ భవనానికి శంకుస్థాపన చేశారు. అలాగే, మల్కాజిగిరి కమిషనరేట్ భవనం, ఆక్టోపస్ పరిపాలనా బ్లాక్, కుత్బుల్లాపూర్ డీసీపీ కార్యాలయ భవనాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు.
👉 మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు , జూపల్లి కృష్ణా రావు , రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, వేం నరేందర్ రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, డీజీపీ బి. శివధర్ రెడ్డి , ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు ఇతర పోలీసు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
👉 ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మావోయిస్టుల గురించి మాట్లాడుతూ ……
అజ్ఞాతంలో ఉన్న అగ్రనేత గణపతి లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. “గణపతి ఆరోగ్యం బాగా లేదని సమాచారం ఉంది. లొంగిపోతే వారికి అవసరమైన వైద్యం అందిస్తాం. అవసరమైన భద్రత కల్పిస్తాం. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుంది

👉 మావోయిస్టులు ఇంకెవరైనా అజ్ఞాతంలో ఉన్నా లొంగిపోవాలి. లొంగిపోయిన వారిని ఆర్థికంగా ఆదుకుంటాం. అభివృద్ధిలో వారందరినీ భాగస్వాములను చేసినప్పుడే నిజమైన అభివృద్ధి సాధించినట్టు. ప్రభుత్వం పిలుపు మేరకు 2024 నుంచి ఇప్పటివరకు 814 మంది నక్సలైట్లు ఉద్యమాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిశారు” అని సీఎం అన్నారు.
👉 అత్యంత అద్భుతమైన నగరంగా రూపుదిద్దుకోబోతున్న భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి సంబంధించి ఇక్కడి సమస్యలు పరిష్కారం కావాలంటే సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులందరినీ భాగస్వాములను చేయాలని, అప్పుడే అద్భుతమైన సిటీగా రాణించగలదని చెప్పారు.
👉 “తమ గ్రామాలను ఫ్యూచర్ సిటీ పరిధిలో కలపలేదని, వాటినీ కలపాలని కొంతమంది పరిసర ప్రాంత గ్రామాలకు చెందిన ప్రతినిధులు కొందరు నా దృష్టికి తెచ్చారు. ఆయా గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి తదనుగుణంగా తీర్మానాలు చేసి కలెక్టర్ కు పంపించాలి. అభివృద్ధి ఫలాలు అందరికీ అందించాలి. వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ప్రాంతాన్ని అధునాత నగరంగా తీర్చిదిద్దాలన్నదే మా లక్ష్యం” అని అన్నారు.
👉 “ఈ ప్రాంతం పెట్టుబడులకు అనుకూలమైన ప్రదేశమని, ఎక్కడైతే అభివృద్ధి చేసి ప్రపంచానికి చూపించాలని అనుకున్నామో అక్కడే నిర్వహించాలన్న ఉద్దేశంలో ఇక్కడ 3 రోజుల పాటు గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాం. ఇక్కడ పెట్టుబడుల కోసం ఎక్కడెక్కడో ఒప్పందాలు చేసుకోవడమేంటని, ముందుగా ఇక్కడ ఫ్యూచర్ సిటీ కార్యాలయం నిర్మిస్తున్నాం. జూన్ 2 వ తేదీ లోపే నిర్మాణం పూర్తి చేసుకుని ఆ భవనం నుంచి కార్యక్రమాలు చేపడుతాం” అని వివరించారు

👉 “హైదరాబాద్‌లో హైటెక్ సిటీ, ఓఆర్ఆర్, అంతర్జాతీయ విమానాశ్రయం లాంటి వాటిని ప్రతిపాదించినప్పుడు సాధ్యమవుతాయా అని కొందరు ఆనాడు అవహేళన చేసిండ్రు. కానీ నిజమయ్యాయి. దేశంలో ఏ నగరానికి లేని విధంగా 160 కి.మీ. మేరకు అవుటర్ రింగ్ రోడ్డు సాధ్యమైంది
👉 ఫ్యూచర్ సిటీలో భూములు కోల్పోయే వారందరినీ ప్రభుత్వం తగిన విధంగా ఆదుకుంటుంది. ఎవరికో నష్టం చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు. మీ పిల్లలు చదువుకున్న వారైతే స్కిల్స్ యూనివర్సిటీలో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. పేదల పట్ల మానవీయ కోణంలో వ్యవహరించాలి. అభివృద్ధి కోసం భూములు ఇస్తున్నారు. వారిని గౌరవించాలి. వారి బాధలు వినాలి” అని అధికారులకు చెప్పారు.
👉 “ప్రపంచంలో అద్భుతమైన నిర్మాణాలు ఇక్కడ వస్తాయి. ఇక్కడ పెట్టుబడులు పెట్టని వారు భవిష్యత్తులో ఏదో కోల్పోయామన్న బాధ పడాల్సి వస్తుంది. శంషాబాద్ బుల్లెట్ ట్రైన్స్‌కు హబ్‌గా మారనుంది. బుల్లెట్ ట్రైన్స్‌కు తోడు ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలును అనుసంధానం చేయబోతున్నాం. బుల్లెట్ ట్రైన్ హబ్‌తో పాటు మెట్రో, అతిపెద్ద బస్ టర్మినల్ కూడా నిర్మించబోతున్నాం.
👉 ఇవన్నీ పూర్తిచేయాలంటే స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం అవసరం. అభివృద్ధి పనులు వేగంగా చేయాలన్న ఆలోచనలో చిన్నచిన్న తప్పిదాలు దొర్లితే అవి ఉద్దేశపూర్వకంగా చేసినవి కాదు. ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకుని ముందుకు నడవాలి” అని ముఖ్యమంత్రి కోరారు.
