కెసిఆర్ చేసిన అప్పులకు వేల కోట్ల వడ్డీ చెల్లిస్తున్నాం !

👉 జగిత్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార సభలో మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమ ప్రభుత్వం నడుస్తుందని గత ప్రభుత్వంలో పెద్దగా ఉన్న పాపాల భైరవుడు కేసీఆర్ చేసిన అప్పులకు ప్రతినెల మొదటి వారంలో ₹ 6 వేల కోట్లు రూపాయల వడ్డీలు ప్రభుత్వం చెల్లిస్తున్నదని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

జగిత్యాల మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యుల ప్రమాణస్వీకారం  శనివారం  పొన్నాల గార్డెన్స్ లో జరిగింది.  ఈ కార్యక్రమానికి మంత్రి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లు పాల్గొన్నారు

.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…

ఆర్థికంగా ఇబ్బంది ఉన్న ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు.

👉 గత ప్రభుత్వ కాలంలో దాన్యం కొనుగోలులో రైతులను అనేక ఇబ్బందులు పెట్టేవారని తప్ప, తాలు పేరుతో అధిక తూకం వేసి రైతులను ఇబ్బంది పెట్టారని మంత్రి గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వంలో ఎలాంటి కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని మంత్రి వివరించారు.

👉 జగిత్యాల జిల్లాలో ధాన్యం కొనుగోలులో అధికారులను బాధ్యులను మరియు భాగస్వాములను చేస్తూ కొనుగోలు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు.

👉 జగిత్యాల జిల్లాలో మక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వంతో ప్రత్యేకంగా చర్చించి వ్యవసాయ శాఖ మంత్రి ద్వారా ప్రత్యేక అనుమతి తీసుకొని మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు క్వింటాలుకు ₹ 2400 మద్దతు ధర చెల్లిస్తున్నామని మంత్రి వివరించారు. రైతు సంక్షేమ ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని ఈ సందర్భంగా మంత్రి వివరించారు.

👉 జగిత్యాల జిల్లాలోని సమస్యలను ఇటీవల క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి కి వివరించడం జరిగిందని మే 20వ తేదీ నుండి జూన్ మొదటి వారంలో ముఖ్యమంత్రి  జగిత్యాల జిల్లా పర్యటనకు వచ్చే అవకాశాలు ఉన్నాయని మంత్రి వివరించారు.

👉 వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ…..
.

రైతులు వాణిజ్య పంటలపై దృష్టి సారించాలని అన్నారు. ప్రస్తుతం మార్కెట్ లో ఆయిల్ ఫాం పంటకు మంచి డిమాండ్ ఉందని రైతులు ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి సారించాలని కోరారు.

👉 జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ……

రాష్ట్రంలో ఎక్కడలేని  విధంగా నిధులు తీసుకోవచ్చి మార్కెట్లను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. రైతులు సంప్రదాయ పంటలతో పాటు చేస్తూ అధిక లాభాలు సాధించడానికి వాణిజ్య పంటలు సాగు చేయాలని అన్నారు. జగిత్యాల జిల్లాలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర అందించడానికి నూతన పాలకవర్గం కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

👉 జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్ మాట్లాడుతూ….

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తుందని అన్నారు. గత ప్రభుత్వ కాలంలో తరుగు తప్ప తాలు పేరుతో తూకంలో కోతలు విధించేవారని దినేష్ అన్నారు.

👉 జగిత్యాల మున్సిపల్ చైర్మన్ శ్రీమతి సమిండ్ల వాణి మాట్లాడుతూ…..

కొత్తగా ఎన్నికైన పాలకవర్గం రైతులకు మద్దతు ధర అందించడానికి కృషి చేయాలని, దళారుల నుంచి రైతులను కాపాడాలని అన్నారు.

👉 జగిత్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి మాట్లాడుతూ….

రైతుల సంక్షేమానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు మార్కెట్ లో రైతులకు సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందయ్య తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.