యాసంగి పంట బాయిల్డ్ రైస్ మిల్లింగ్‌కు అనుకూలం !

👉 కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తో…

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !

   J SURENDER KUMAR,

యాసంగి పంటకు సంబంధించి తెలంగాణ నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎంటీ) బాయిల్డ్ రైస్ సేకరించాల‌ని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కి ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  విజ్ఞప్తి చేశారు. ధాన్యం యాసంగి పంట బాయిల్డ్ రైస్ మిల్లింగ్‌కు తెలంగాణ అనుకూలమని వారు కేంద్ర మంత్రికి తెలియజేశారు.

👉 గత ఆరు యాసంగి సీజన్లలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సరఫరా గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని చెప్పారు. మంత్రి ఉత్తమ్ తో కలిసి ముఖ్యమంత్రి  ఢిల్లీలో కేంద్ర మంత్రి జోషి ని ఆయన నివాసంలో కలిశారు.

👉 దేశవ్యాప్తంగా బాయిల్డ్ రైస్‌కు భారీ డిమాండ్ ఉన్నందున సరఫరా పెంచాలని ఇటీవల కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ విభాగం అధికారులు సూచించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణలో ఈ యాసంగి సీజన్‌లో 90 ఎల్‌ఎంటీ ధాన్యం ఉత్పత్తి అవుతుందని వివరించారు.

👉 యాసంగి ధాన్యం బాయిల్డ్ రైస్ మిల్లింగ్‌కు అనుకూలంగా ఉంటుందని, అందువల్ల యాసంగి పంటకు సంబంధించి మొత్తం 30 ఎల్‌ఎంటీ బాయిల్డ్ రైస్ (5 శాతం నూకతో), 5 ఎల్‌ఎంటీ రా రైస్ (10 శాతం నూకతో) సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రికి చెప్పారు.

👉 బాయిల్డ్ రైస్ సరఫరాకు సంబంధించి ముఖ్యమంత్రి ప్రతిపాదనకు కేంద్ర మంత్రి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు.

👉 2014–15 వర్షాకాలం పంట అదనపు లెవీ సేకరణకు సంబంధించిన రూ. 1,468.94 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని  ప్రహ్లాద్ జోషికి విజ్ఞప్తి చేశారు. దేశంలోనే వరి ధాన్యం ఉత్పత్తి, సేకరణలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు తాము చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మీద ఉన్న ఒత్తిడిని గుర్తించి వెంటనే పాత బకాయిలు విడుదల చేయాలని కోరారు.

👉 పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపాల నివారణకు గాను పోషకాహార బియ్యాన్ని (FRK) పాఠశాలలు, వసతిగృహాలు, ఐసీడీఎస్ పరిధిలో పంపిణీ చేసేవారని, ఇటీవల దానిని నిలిపివేశారని పేర్కొంటూ వెంటనే పునఃప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రితో జరిగిన సమావేశంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి , సెక్రటరీ కో-ఆర్డినేషన్ అద్వైత్ సింగ్ తో పాటు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ అధికారులు పాల్గొన్నారు.