👉 తమ అధికారిపై దాడి చేసినవారికే సలాం కొడుతున్న కొందరు ఉద్యోగులు !
👉 అటవీ శాఖ అవినీతి అక్రమాలపై ప్రశ్నించిన వారిని పరేషాన్ చేస్తున్న కొందరు !
👉 గిరిజనులు, బలహీన వర్గాలే వారి టార్గెట్ ?
J.SURENDER KUMAR,
అటవీశాఖ ఉద్యోగులు తమ విధి నిర్వహణలో అక్రమాలను అడ్డుకుంటే అభినందించాల్సిన ఆ శాఖ కీలక అధికారులే, అక్రమాలకు పాల్పడే వారికే అండదండలు అందిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి..
బీర్పూర్ గుట్ట కింది అటవీ శాఖ అధికారి పై ఫిబ్రవరి లో ఆయన ప్రభుత్వ క్వార్టర్ లో అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన, దాడికి పాల్పడిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సంబంధిత శాఖ కీలక అధికారులు ఆలస్యం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బదులు తమతోటి అధికారినే మౌనంగా ఉండాలి వారితో గొడవలు ఎందుకు ? రాజీ చేసుకోవాలి అంటూ బాధిత అధికారినే భయభ్రాంతులకు గురి చేస్తూ కొన్ని నెలలుగా దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు కాకుండా అడ్డుకుంటున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి.
👉 వివరాలు ఇలా ఉన్నాయి !
ఈ సంవత్సరం ఫిబ్రవరి రెండో వారంలో బీర్పూర్ మండలం తుంగూరు సెక్షన్ అధికారి, సిబ్బంది తో రాత్రి అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహించారు. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో అటవీ శాఖ సిబ్బంది సెక్షన్ అధికారిని తుంగూర్ అటవీ శాఖ క్యాంపు కార్యాలయం వద్ద దింపారు.. అక్కడికి కొందరు వ్యక్తులు రావడంతో సెక్షన్ అధికారి వాళ్లను గౌరవిస్తూ, కూర్చోండి అంటూ కుర్చీలు వేసినట్టు సమాచారం. తాగునీరు కోసం లోనికి వెళ్లి వారి వద్దకు నీటి బాటిల్ తేగానే అధికారిపై పిడి గుద్దులతో దాడి చేసి దారుణంగా కొట్టారు.
👉 గిరిజన అధికారికి రక్షణ కరువు ?
తమ సహచర గిరిజన తెగకు చెందిన అధికారి, గత కొన్ని సంవత్సరాలుగా ఇదే అటవీ ప్రాంతంలో సెక్షన్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. దాడి జరిగిన తీరుపై అటవీ శాఖ ఉద్యోగ సంఘాలలో కానీ, ఉన్నతాధికారులలో ఉలుకు లేదు, పలుకు లేదు, బాధితాధికారి భయంతో తన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని విధులకు సెలవు పెట్టి కొంతకాలం ఇతర జిల్లాలో తలదాచుకున్నాడు.
సంఘటన స్థలానికి సంబంధిత శాఖ కీలక అధికారి, స్థానిక ఎస్సై చేరుకొని పరిశీలించారు. ఈ ప్రాంతం అటవీ శాఖలో కొందరిలో నెలకొన్న అంతర్గత విభేదాలతో దాడి జరిగినట్టు చర్చ.
అటవీ శాఖ అధికారిక పై జరిగిన దాడి సంఘటన వెలుగు చూడకుండా అధికార యంత్రాంగం విశ్వ ప్రయత్నం చేసినట్టు తెలిసింది.
👉 ప్రభుత్వ ఆసుపత్రి రికార్డులలో MLC గా నమోదు !

గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో తీవ్రంగా గాయపడిన తుంగూర్ సెక్షన్ గిరిజన అధికారి గంగారం వైద్యం కోసం 2026 ఫిబ్రవరి 21 న జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. వైద్యులకు తనకు గాయాలు ఏ విధంగా తగిలాయి అనే విషయం వివరించారు. వైద్యులు వైద్య పరీక్ష నిర్వహించి వైద్యం చేసి ఆస్పత్రి రికార్డులలో MLC ( మెడికో లీగల్ కేసుగా) నమోదు చేశారు. నెలలు గడుస్తున్న దాడికి పాల్పడిన వారిపై చర్యలు గాని ఎలాంటి కేసులు నమోదు కానట్టు సమాచారం.

చెవిలోని కరణబేరీకి తీవ్ర గాయాలైనట్టు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఔట్ పేషెంట్ గా నమోదు చేసుకుని వైద్యం అందించారు.
👉 నేడు జర్నలిస్టు పై… నాడు సర్పంచ్ పై !
పచ్చని అడవుల్లో వన్యప్రాణలు అంతు పట్టని రీతిలోహతమైన, అక్రమ మట్టి తరలింపు, ఆక్రమణలపై మీడియాలో వార్తా కథనాలు ప్రచురితమైన అటవీ శాఖలో కొందరు ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు.

తమ పరువుకు భంగం కలిగిందని, తమను బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ జర్నలిస్టు పై పోలీస్ స్టేషన్ లో తప్పుడు ఆరోపణలతో ఫిర్యాదులు చేస్తూ భయాందోళనకు గురి చేస్తున్నారు.

గత కొన్ని నెలల క్రితం అటవీశాఖ ఉద్యోగి తీరను ప్రశ్నించిన ఓ గిరిజన సర్పంచ్ పై కేసులు నమోదు చేసి 14 రోజులపాటు రిమాండ్ తరలించారు. బెయిల్ పై వచ్చిన గిరిజన సర్పంచ్, తనపై అక్రమంగా కేసు నమోదు చేసి, ఆస్తి నష్టం చేశారు అంటూ, అటవీశాఖ అధికారులపై కేసు బీర్పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యింది.

👉 విజిలెన్స్ విచారణ చేపట్టండి !
అటవీ శాఖ విజిలెన్స్ చీఫ్ కన్జర్వేటర్ స్పందించి విచారణ జరిపితే పోడు వ్యవసాయం పేరిట అటవీ భూములు కబ్జా, కొందరు అధికారుల, ఉద్యోగుల, అండదండలతో మట్టి, కలప, ఇసుక అక్రమ రవాణా, తదితర అవినీతి అక్రమాలు వెలుగు చూస్తాయని గుట్ట కింద గ్రామస్తులు ముక్తకంఠంతో కోరుతున్నారు..
