ధర్మపురి విద్యా చరిత్రలో మరో మైలురాయి.!

👉 గ్రామీణ ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల ఉన్నత విద్యకు భారీ ఊతం !

👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక చొరవతో
₹ 10 కోట్ల డిగ్రీ కళాశాల భవనం !

J.SURENDER KUMAR,

ధర్మపురి నియోజకవర్గంలో ఉన్నత విద్యా అవకాశాల విస్తరణకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరో కీలక అడుగు వేశారు. ఆయన ప్రత్యేక చొరవతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధుల కింద ₹10 కోట్ల వ్యయంతో ధర్మపురిలో నూతన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి ముందుకు రావడం విశేషం.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బుధవారం HAL ప్రతినిధులు, జగిత్యాల జిల్లా యంత్రాంగం మధ్య అవగాహన ఒప్పందం (MOU) కుదిరింది. జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, HAL హైదరాబాద్ చీఫ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎ.వి. మురళీకృష్ణ, డీజీఎం (హెచ్‌ఆర్) సూర్యకాంత్ రౌత్, సీనియర్ మేనేజర్ (హెచ్‌ఆర్) ఎస్. సత్యనారాయణ సమక్షంలో ఒప్పందంపై సంతకాలు జరిగాయి.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…..

విద్యాభివృద్ధే సమాజ అభ్యున్నతికి మూలాధారమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, సంక్షేమ రంగాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల్లో విద్యా మౌలిక వసతుల కల్పన ద్వారా సామాజిక, ఆర్థిక అసమానతలను తగ్గించవచ్చని అన్నారు. ధర్మపురి, వెల్గటూరు, పెగడపల్లి, గొల్లపల్లి తదితర మండలాలకు చెందిన వేలాది మంది విద్యార్థులకు ఈ డిగ్రీ కళాశాల వరంగా మారనుందని మంత్రి పేర్కొన్నారు.

👉 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఇతర పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం గణనీయంగా తగ్గుతుందని తెలిపారు.

👉 నూతన కళాశాల భవనంలో ఆధునిక తరగతి గదులు, సైన్స్ ప్రయోగశాలలు, గ్రంథాలయం, డిజిటల్ లెర్నింగ్ సెంటర్లు వంటి సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని మంత్రి ఆదేశించారు.

👉 ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ యువతలో ఉన్నత విద్యపై ఆసక్తి పెరిగి ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. CSR నిధులను విద్యా రంగ అభివృద్ధికి వినియోగిస్తూ HAL సంస్థ అందిస్తున్న సహకారం ఆదర్శప్రాయమని మంత్రి కొనియాడారు.

👉 ధర్మపురి ప్రాంత విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సహకరించిన HAL చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ కె. రవి, యాక్సెసరీస్ కాంప్లెక్స్ సీఈవో ఎం. సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామమోహనరావు, చీఫ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎ.వి. మురళీకృష్ణతో పాటు HAL యాజమాన్యానికి మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

👉 ధర్మపురి విద్యా రంగ చరిత్రలో కీలక మలుపుగా నిలిచే ఈ ప్రాజెక్టు గ్రామీణ విద్యార్థుల ఉన్నత విద్యా కలలను సాకారం చేయడంలో ముఖ్య పాత్ర పోషించనుంది. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ధర్మపురిలో మూతపడిన తెలుగు డిగ్రీ కళాశా లను పున ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విద్యా రంగంపై చూపుతున్న ప్రత్యేక శ్రద్ధకు ఈ ప్రాజెక్టు మరో నిదర్శనంగా నిలుస్తోందని స్థానిక ప్రజలు, విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు.