జలాల వినియోగానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి!

👉తుంగభద్ర నుంచి తెలంగాణకు రావాల్సిన వాటా జలాల పై!

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !


J SURENDER KUMAR,


తుంగభద్ర నుంచి తెలంగాణకు రావాల్సిన నికర వాటా జలాల వినియోగానికి, భాగస్వామ్య రాష్ట్రాలతో సమన్వయ సాధనకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రి .రేవంత్ రెడ్డి  విజ్ఞప్తి చేశారు.


👉 తుంగభద్ర డ్యామ్, నది ప్రవాహం నుంచి తెలంగాణకు హక్కుగా 15.9 టీఎంసీల నీరు రావాల్సి ఉంది. ఇప్పుడు అయిదారు టీఎంసీలకు మించి రావడం లేదని ముఖ్యమంత్రి  ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్డీఎస్‌ కింద జోగులాంబ గద్వాల జిల్లాలో దాదాపు 75 గ్రామాల్లో 83,987 ఎకరాల ఆయకట్టుకు నీరు అందాల్సి ఉంది.


👉 మూడు రాష్ట్రాల భాగస్వామ్యం ఉన్నందున కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక నీటి వాటాల సమర్థ వినియోగానికి కేంద్ర జల సంఘం (cwc) సారథ్యంలో తుంగభద్ర బోర్డును పటిష్టం చేయాలని కోరారు.


👉 తుంగ‌భ‌ద్ర ప్రాజెక్టు, ఆర్డీఎస్, అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలపైన ముఖ్యమంత్రి  జలసౌధలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి , జూపల్లి కృష్ణారావు , ఎంపీ మల్లు రవి , ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి . సలహాదారు ఆదిత్య నాథ్ దాస్ తో పాటు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


👉 ఆర్డీఎస్ ఆనకట్ట ప్రమాదకరంగా మారిందని, భద్రత దృష్ట్యా చేపట్టాల్సిన పనులను అత్యవసరంగా గుర్తించాలని ముఖ్యమంత్రి చెప్పారు. రాజోలి బండ డైవర్సన్ కెనాల్ ఆధునికీకరణకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ₹ 59 కోట్లు డిపాజిట్ చేసిందని, పనులు ఇప్పటికీ పూర్తి కాలేదన్న అంశంపై చర్చించారు.


👉 ప్యాకేజీ 1, 2 పనులు ఇప్పటికీ చేపట్టలేదని, ప్యాకేజీ 3, 4 పనులు మాత్రం పూర్తి అయ్యాయని అధికారులు ముఖ్యమంత్రి గారి దృష్టికి తెచ్చారు. నిలిచిపోయిన మొదటి రెండు ప్యాకేజీల పనులు వెంటనే చేపట్టాలని రేపు కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగే సమావేశంలో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాలని నిర్ణయించారు.


👉 ఆర్డీఎస్ వద్ద తెలంగాణ భూభాగం వైపు పూడిక నిండిపోవడం వల్ల ఆశించిన విధంగా నీటి మళ్లింపు సాధ్యం కావడం లేదని ఇంజనీర్లు తెలిపారు.


👉 2004 లో నిపుణుల కమిటీ పూడిక తొలిగించాలని సూచించింది. ఆ కమిటీ ఇచ్చిన సిఫారసులు ఇప్పటికి అమలు కాలేదని చర్చ జరిగింది. వెంటనే పూడిక తీసేందుకు చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించారు. పూడిక పేరుకున్న భూభాగం కర్ణాటకలో ఉండటంతో ఆ రాష్ట్ర సహకారం కోరాలని నిర్ణయం తీసుకున్నారు.


👉 పూడికతీతతో పాటు 2004లో నిపుణుల కమిటీ ఇచ్చిన సూచనలను అమలు చేయాలని కేంద్రానికి వినతి పత్రం అందించాలని ముఖ్యమంత్రి  సూచించారు. అప్పటి నివేదికకు ఇప్పుడున్న వాస్తవ పరిస్థితిని విశ్లేషించుకోవాలని సూచించారు. వెంటనే పూర్తి వివరాలతో నివేదికను తయారు చేయాలని ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.


👉 తుంగభద్ర ఎత్తిపోతల పథకంలో భాగంగా సాధ్యమైనంత నీటిని వినియోగించుకునే ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. తుమ్మిళ్ల నుంచి నీటిని వినియోగించుకునేందుకు కీలకమైన మల్లమ్మకుంట బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కెపాసిటీ పెంచాలని, వీలైనంత వేగంగా పనులను చేపట్టాలని చెప్పారు.