👉 కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి !
J SURENDER KUMAR,
హైదరాబాద్ మెట్రో ఫేజ్-IIకు ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ కి విజ్ఞప్తి చేశారు. ఏడు కారిడార్లతో కూడిన మెట్రో ఫేజ్-II సమగ్ర ప్రణాళికను రూపొందించి డీపీఆర్‌ను ఇప్పటికే సమర్పించామని తెలిపారు.
👉 ముఖ్యమంత్రి ఢిల్లీలో కేంద్ర మంత్రి ఖట్టర్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్ -II, మెట్రో ఫేజ్ -III పై చర్చించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో ప్రయాణికుల సౌకర్యార్ధం మెట్రోను మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
👉 హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్ -II, ఫేజ్ -III విస్తరణ సజావుగా సాగాలనే ఉద్దేశ్యంతోనే మెట్రో ఫేజ్-Iను L&T MRHL ను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని వివరించారు. ప్రస్తుతం ఫేజ్-I ప్రభుత్వం పరిధిలో ఉండడంతో ఫేజ్-II, ఫేజ్-III విస్తరణ సులుభమవుతుందని చెప్పారు.

👉 మెట్రో రైలు నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్ -IIలో ఏడు కారిడార్లతో మొత్తం 122.9 కిలోమీటర్ల మేర విస్తరణకు, ₹ 38,595 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన సమగ్ర డీపీఆర్‌ను ఇప్పటికే సమర్పించిన విషయాన్ని గుర్తుచేశారు.
👉 హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్ -II ప్రాజెక్ట్‌ను భారత ప్రభుత్వం – తెలంగాణ ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా చేపట్టేందుకు త్వరగా ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రి ని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగర భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆర్జీఐ ఎయిర్‌పోర్ట్ – భారత్ ఫ్యూచర్ సిటీ కారిడార్‌ను మెట్రో ఫేజ్ -IIIగా చేపట్టాలని కోరారు. మెట్రో ఫేజ్-III కి సంబంధించిన డీపీఆర్‌ను కూడా ఇప్పటికే సమర్పించామని తెలిపారు.
👉 సమావేశంలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి కె. శ్రీనివాస్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్ రెడ్డి , హెచ్ఎంఆర్ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ , రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (పట్టణ రవాణా) ఎన్.వి.ఎస్.రెడ్డి, ఢిల్లీ తెలంగాణ భవన్ ప్రత్యేకాధికారి సంజయ్ కుమార్ , కేంద్ర ప్రభుత్వ పథకాల సమన్వయ కార్యదర్శి అద్వైత్ కుమార్ సింగ్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
