👉 దొంగలకు ముఖ్యమంత్రి కి లింకు పెడతావా..?
👉 నీ తీరు మార్చుకోకుంటే నీకు కాంగ్రెస్ కార్యకర్తలు బుద్ధి చెప్తారు !
J.SURENDER KUMAR,
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ నీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు, నీ పేరు మార్చుకోకుంటే రాష్ట్రంలోని 33 జిల్లాల కాంగ్రెస్ కార్యకర్తల నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హెచ్చరించారు.
కరీంనగర్ పీఎంజే జ్యువెల్లరీ షాప్ లో ఆదివారం జరిగిన సంఘటనలు గాయపడ్డ బాధితులను కరీంనగర్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం పరామర్శించారు.

👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు..
కరీంనగర్ జువెల్లరీ షాప్ లో జరిగిన దొంగతనం కాల్పుల
ఘటన దురాదృష్టకరమని మంత్రి అడ్లూరి అన్నారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠా రెక్కీ నిర్వహించి పక్కా ప్రణాళిక ప్రకారం దొంగతనం చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందని మంత్రి వివరించారు.
👉 కరీంనగర్ దొంగతనం కేసులో నిందితులను పట్టుకోవడానికి 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, నేరస్తులను పట్టుకోవడానికి ఇతర రాష్ట్రాల పోలీసుల సహకారం తీసుకుంటున్నామని మంత్రి వివరించారు.
👉 బాధితుల పరామర్శ పేరుతో కరీంనగర్ కు వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోటికి వచ్చిన విధంగా మాట్లాడారని మంత్రి మండిపడ్డారు. అంతర్రాష్ట్ర దొంగలను రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రితో పరిచయం ఉందని కేటీఆర్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
👉 2014 నుండి 2023 వరకు అధికారంలో ఉన్న టీఆర్ఎస్, బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో జరిగిన దోపిడీలు, దొంగతనాలు, హత్యలకు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహిస్తాడా ? అని మంత్రి అడ్లూరి ప్రశ్నించారు.
👉 అధికారంలో ఉన్న సమయంలో కేటీఆర్ అక్రమంగా సంపాదించుకొని జన్వాడాలో ఫామ్ హౌస్ నిర్మాణం చేసుకొని విలాసవంతమైన జీవితం గడుపుతున్న విషయాన్ని తెలంగాణ ప్రజలకు చూపించాలని నాటి పీసీసీ అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి గారు డ్రోన్ కెమెరా ద్వారా ఫామ్ హౌస్ చిత్రీకరణ చేస్తే నాటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిపై అక్రమ కేసు బనాయించి చెంచల్ గుడా జైలుకి పంపించారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
👉 అక్రమ కేసులో అరెస్టు చేసి జైలుకు పంపిన టీఆర్ఎస్ నాయకులు నేడు అంతర్రాష్ట్ర దొంగలకు ముఖ్యమంత్రి కి సంబంధాలు ఉన్నాయని మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి అన్నారు.
👉 జువెల్లరీ దాడి ఘటనలో గాయపడిన వారిని పరామర్శించడానికి కాంగ్రెస్ నాయకులు రాలేదని కేటీఆర్ చేసిన ఆరోపణలలో వాస్తవం లేదని మంత్రి అన్నారు. సంఘటన జరిగిన రోజు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తో పాటు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, వెలిచాల రాజేందర్ రావు తదితరులు పరామర్శించారని మంత్రి గుర్తు చేశారు.

👉 బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మంథనిలో జరిగిన జంట హత్యల ఘటనలో ఇద్దరు న్యాయవాదులు మరణిస్తే నాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఎందుకు బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదని మంత్రి ప్రశ్నించారు.
👉 చనిపోయిన వ్యక్తి మరణ వాంగ్మూలంలో సైతం బీఆర్ఎస్ నాయకులకు తమ హత్యకు సంబంధం ఉందని చెప్పినప్పటికీ నాడు ప్రభుత్వంలో ఉన్న కేటీఆర్ ఎందుకు పట్టించుకోలేదని మంత్రి అడ్లూరి ప్రశ్నించారు.
👉 సిరిసిల్ల నియోజకవర్గంలో నేరెళ్ల దళితులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తే ఎందుకు నేటికీ కేటీఆర్ నోరు మెదప లేదని మంత్రి అడ్లూరి అన్నారు. కొండగట్టు బస్సు ప్రమాదంలో 62 మంది మరణిస్తే బాధితులను నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు పరామర్శించలేదని మంత్రి ప్రశ్నించారు.
👉 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి దురదృష్ట సంఘటన జరిగిన ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహాయక చర్యలు అందించడంలో ముందుంటున్నారని మంత్రి తెలిపారు.
👉 కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం మానుకొని కాళేశ్వరం కేసులో సీబీఐ ద్వారా కేసీఆర్ కు నోటీసులు ఇప్పించాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు.
👉 ఎన్నికల ఫలితాలపై మంత్రి లక్ష్మణ్ కుమార్ స్పందిస్తూ, ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని అన్నారు. సినీ నటుడిగా రాణించి పార్టీ ప్రారంభించిన ఎనిమిది నెలల్లోనే ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఎన్టీ రామారావు కు సైతం ఓటమి తప్పలేదని గుర్తు చేశారు. దేశంలో అత్యంత ప్రమాదకరమైన పార్టీ బీజేపీ అని దళితులు, బీసీల రిజర్వేషన్లను ఎత్తివేయడానికి బీజేపీ కుట్ర చేస్తుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. కరీంనగర్ జ్యువెల్లరీ నిందితులను త్వరలోనే పట్టుకొని చట్టపరంగా శిక్షిస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.
