ఆర్టీసీ కార్మికులపై  సమ్మె లో నమోదైన కేసులు ఎత్తివేస్తాం !

👉 మూడు రోజుల సమ్మె వేతనం చెల్లిస్తాం !

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !


J SURENDER KUMAR,

మూడు రోజుల సమ్మె వేతనం  ఇచ్చేందుకు, సమ్మె కాలంలో నమోదైన కేసుల ఎత్తివేతకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ని, అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ కార్మికుల 3 రోజుల సమ్మె కాలానికి వేతనాలు ఇవ్వాలని, సమ్మె కాలంలో పెట్టిన కేసులు ఎత్తివేయాలని కార్మిక సంఘాల ప్రతినిధుల సీఎంకు చేసిన విజ్ఞప్తిపై సీఎం సానుకూలంగా స్పందించారు.

ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు ముఖ్యమంత్రి ని శుక్రవారం జూబ్లీహిల్స్ నివాసంలో కలిశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చొరవ తీసుకున్నందుకు ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ , ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్ , వేం న‌రేంద‌ర్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఆర్టీసీ ఎండీ తదితరులు పాల్గొన్నారు.

👉 ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి  మాట్లాడుతూ….

గుర్తింపు సంఘం ఎన్నిక‌లు, విలీనంపై ఏవిధంగా ముందుకు పోవాల‌నే దానిపై సంఘాల నాయ‌కులు స‌మావేశ‌మై ప్ర‌భుత్వం ఎదుట ఆప్ష‌న్లు ఉంచాల‌ని సూచించారు. ఒక‌వేళ యూనియ‌న్ల మ‌ధ్య ఏకాభిప్రాయం కుద‌ర‌క‌పోతే ఏ యూనియ‌న్‌కు ఆ యూనియ‌న్ త‌మ ఆప్ష‌న్లు ఇస్తే కామ‌న్‌గా ఉన్న వాటికి ఆమోదం తెలిపి.. భిన్నాభిప్రాయాలు ఉన్న వాటిపై చ‌ర్చిద్దామ‌ని చెప్పారు.

👉 రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ ఆర్టీసీ (TGS RTC) మ‌నుగ‌డ‌, గౌర‌వాన్ని పెంపొందించి ప్ర‌యాణికులకు మెరుగైన సేవ‌లందించేందుకు స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణ‌తో ముందుకు రావాల‌ని కార్మిక సంఘాల ప్ర‌తినిధుల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  సూచించారు. ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నిక‌లు, ప్రభుత్వంలో విలీనంపై అన్ని సంఘాల నాయ‌కులు స‌మావేశ‌మై స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌న్నారు. పీఆర్సీ అంశాన్ని ప‌రిష్క‌రిస్తామ‌ని ముఖ్య‌మంత్రి  హామీ ఇచ్చారు.

👉 ఆర్టీసీ సమస్యలను వంద శాతం పరిష్కరిస్తామని, కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ముఖ్యమంత్రి  స్పష్టం చేశారు. సంస్థలను బలోపేతం చేసుకుని నిలబెట్టుకోవడంలో కార్మికులు సహకరించాలని కోరారు.

👉 కార్మిక సంఘాల ప్రతినిధులతో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి  మాట్లాడుతూ, సంస్థ అభివృద్ధి, మ‌నుగ‌డ‌, గౌర‌వాన్ని పెంపొందించి ప్ర‌జ‌ల‌కు మంచి సేవ‌లు అందించాలన్న కార్య‌చ‌ర‌ణ కోసం ముందుకు వ‌చ్చినందుకు కార్మిక నాయకులకు అభినంద‌న‌లు తెలిపారు.


👉 “నేను వేరు, మీరు వేరు అన్న భావ‌న నాకు ఎప్పుడు లేదు. అంద‌రం క‌లిస్తేనే ప్ర‌భుత్వం. ఆర్టీసీ కార్మికుల పోరాటాల్లో మేం ఉన్నాం. ఆర్టీసీలో బ‌స్సుల‌ను పెంచాం, నియామ‌కాలు పెంచాం, ఆదాయం పెంచాం. ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందించే విష‌యంలో కార్మికులు ప‌ట్టుద‌ల‌తో ప‌నిచేయ‌డం వ‌ల్ల‌నే ఆర్టీసీ దేశంలోనే గొప్ప సంస్థ‌గా నిలిచింది.


👉 గాజుల‌రామారంలో బస్ టెర్మిన‌ల్ కోసం 100 ఎక‌రాలు కేటాయించాం. శంషాబాద్‌లో 150 ఎక‌రాల్లో అంత‌ర్జాతీయ స్థాయి బ‌స్ టెర్మిన‌ల్ నిర్మిస్తాం. 1000 ఈవీ బ‌స్సులు కొనుగోలు చేసి మెట్రోతో అనుసంధానం చేస్తున్నాం. అలాగే, మినీ బ‌స్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అంద‌జేయాల‌నుకుంటున్నాం” అని ముఖ్యమంత్రి  చెప్పారు.


👉 “డీజీల్‌పైన ఆర్టీసీ ప్ర‌తి యేడాది ₹ 2000 కోట్లు ఖ‌ర్చు చేస్తుంది. డీజీల్ ఖ‌ర్చు త‌గ్గించుకోవ‌డానికి ఈవీ బ‌స్సుల‌ను తీసుకురావాలి. ఆదాయం పెర‌గాలంటే ఖ‌ర్చు త‌గ్గించుకోవాలి. దీని కోసం ప‌క్కా ప్ర‌ణాళిక కావాలి. ఆర్టీసీలో బ‌కాయిలు మా హ‌యాంలో పెట్టిన‌వి కావు. కాని వాటిని క్లియ‌ర్ చేయ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నాం. పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామాల‌ను ప్రజా ప్రభుత్వం చేపట్టింది” అని వివరించారు.


👉 “ఆర్టీసీ స‌మ‌స్య‌లు ఏవైనా నా దృష్టికి వ‌స్తే వెంట‌నే ప‌రిష్క‌రించాను. యూనియన్లు, విలీనం లాంటి అంశాల‌పైన ప్ర‌ణాళిక బ‌ద్దంగా కార్మిక సంఘాలే చ‌ర్చించుకుని నిర్ణ‌యం చెప్పాలి. ఆర్థిక అంశాల‌తో కూడా పీఆర్సీ లాంటి వాటిపైన ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంటుంది. శాశ్వ‌త ప‌రిష్కారం కోసం చ‌ర్చించుకుని ప్ర‌భుత్వం ముందు ఆప్ష‌న్స్ పెట్టాలి” అని సూచించారు.


👉 “రాజ‌కీయాల ప్ర‌భావానికి లోనైతే సంస్థ‌కు న‌ష్టం జ‌రుగుతుంది. ఆర్టీసీ అప్పుల పైన ఉన్న వ‌డ్డీ భారాన్ని త‌గ్గించ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాం. సంస్థ‌ల‌ను బ‌లోపేతం చేసుకుని నిల‌బెట్టుకోవ‌డానికి కార్మికులు స‌హ‌క‌రించాలి” అని కోరారు.


👉 “ఆర్టీసీలో ఒక్క డ్రైవ‌ర్‌ను కూడా త‌గ్గించం. మ‌హాల‌క్ష్మీ ప‌థ‌కం పెట్ట‌డం ద్వారా ₹8 వేల కోట్ల రూపాయ‌ల‌ను ఆర్టీసీకి ఇచ్చాం. ఆర్టీసీని బాగు చేసుకునే అవ‌కాశం కార్మికుల‌పైనే ఉంది. కార్మికులు, డిపో మేనేజ‌ర్ల మ‌ధ్య గ్యాప్ రాకుండా అధికారులు చూడాలి.


👉 ఆర్థికంగా ప్రభుత్వానికి ఇబ్బందులు ఉన్న‌ప్ప‌టికి ఉద్యోగుల బ‌కాయిలు తీర్చ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నాం. ఈసారి ఉద్యోగుల‌కు ₹1000 కోట్ల రూపాయల బ‌కాయిలు విడుద‌ల చేశాం” అని చెప్పారు.


👉 “సంస్థ ఆగిపోతే ఊపిరిపోయిన‌ట్లే. సంస్థ‌కు న‌ష్టం జ‌రిగే ప‌నులు చేయొద్దు. కార్మికులు, ఆర్టీసీ యాజ‌మాన్యం మ‌ధ్య ఎప్పుడూ స్నేహా పూర్వ‌క వాతావ‌ర‌ణం ఉండాలి. ప్ర‌భుత్వం ఆర్టీసీ కార్మికుల హ‌క్కుల‌ను కాపాడుతుంది” అని ముఖ్యమంత్రి  స్పష్టంగా చెప్పారు.


👉 ఈ సమావేశంలో స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ వికాస్ రాజ్ , సీఎం ముఖ్య కార్య‌ద‌ర్శి శ్రీనివాస‌రాజు , ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి , ఎమ్మెల్యే లు మ‌క్క‌న్ సింగ్ రాజ్ ఠాకూర్‌ , కుంభం అనిల్ కుమార్ రెడ్డి , కేఆర్ నాగ‌రాజు , వివిధ కార్మిక సంఘాల ప్ర‌తినిధులు ఏ.ఆర్‌.రెడ్డి, థామ‌స్ రెడ్డి (తెలంగాణ మ‌జ్దూర్ యూనియ‌న్‌) , అశ్వ‌త్థామ రెడ్డి, శంక‌ర్ (తెలంగాణ మ‌జ్దూర్ యూనియ‌న్ (రి)), వీరాంజ‌నేయులు, వి.ఎస్‌.రావు (స్టాఫ్ అండ్ వ‌ర్క‌ర్స్ ఫెడ‌రేష‌న్‌), ఎస్‌.బాబు, ఈ.వెంక‌న్న (ఎంప్లాయీస్ యూనియ‌న్‌), పి.క‌మ‌ల్ రెడ్డి, ఎండీ మౌలానా (నేష‌న‌ల్ మ‌జ్దూర్ యూనియ‌న్‌), ఎంకే బోస్‌, బి.యాద‌గిరి (కార్మిక ప‌రిష‌త్‌), జి.అబ్ర‌హం, మొగుళ్ల రాజిరెడ్డి (స్టాఫ్ అండ్ వ‌ర్కర్స్ యూనియ‌న్‌), రాజిరెడ్డి, బి.యాద‌య్య (స్టాఫ్ అండ్ వ‌ర్కర్స్ యూనియ‌న్ (రి)), బి.మునిరాములు, కె.యాద‌య్య (బ‌హుజ‌న కార్మిక యూనియ‌న్‌), కె.స‌త్యనారాయ‌ణ‌, ఎండీ అక్బ‌ర్ అలీ (ఆర్టీసీ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్‌), కె.మ‌నోహ‌ర్‌రావు, ఈ.స్వామి కుమార్ (కార్మిక సంఘ్‌), పున్న హ‌రికిష‌న్‌, గోవింద్ (సామాజిక తెలంగాణ మ‌జ్దూర్ యూనియ‌న్‌), డి.వి.కె.రావు, కె.హ‌నుమంతు ముదిరాజ్ (తెలంగాణ జాతీయ మ‌జ్దూర్ యూనియ‌న్‌), దువ్వాసీ యాద‌య్య‌, సుద్దాల సురేష్ (బ‌హుజ‌న్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్‌) త‌దిత‌రులు పాల్గొన్నారు.

👉  స‌మావేశంలో పాల్గొన్న కార్మిక సంఘాలు:


1. ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్
2. ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ (ఆర్)
3. టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్ & వర్కర్స్ ఫెడరేషన్
4. టీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్
5. టీఎస్‌ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్
6. టీఎస్‌ఆర్టీసీ కార్మిక పరిషత్
7. టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్ & వర్కర్స్ యూనియన్
8. తెలంగాణ ఆర్టీసీ బహుజన కార్మిక యూనియన్
9. తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్
10. టీఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘ్
11. టీఎస్‌ఆర్టీసీ సామాజిక తెలంగాణ మజ్దూర్ యూనియన్‌
12. టీఎస్‌ఆర్టీసీ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్
13. తెలంగాణ స్టేట్ ఆర్టీసీ బహుజన్ వర్కర్స్ యూనియన్