👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J SURENDER KUMAR,
రాష్ట్రంలో నూతన పారిశ్రామిక వాడలు, హైస్పీడ్ రైల్ కారిడార్లు, ట్రిపుల్ ఆర్ వంటి అభివృద్ధి ప్రాజెక్టులు రానున్న నేపథ్యంలో డిమాండ్‌కు తగిన విద్యుత్ సరఫరాకు అవసరమైన సబ్‌స్టేషన్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి . రేవంత్ రెడ్డి ఆదేశించారు.
👉 విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. ఈ సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి తో పాటు ఇంధన శాఖకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

👉 గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా ప్రాధాన్యక్రమంలో దరఖాస్తులు పెట్టుకున్న వారికి అనుమతులు ఇవ్వాలని అధికారులకు చెప్పారు. భారీ డేటా సెంటర్లకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
👉 సోలార్ పవర్ పైన స్వయం సహాయక సంఘాల మహిళలకు అవగాహన కల్పించాలని చెప్పారు. సోలార్ స్టౌల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచాలని అన్నారు.
👉 విద్యుత్ సబ్‌స్టేషన్ల పక్కనే సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద భూమి అందుబాటులో ఉన్న చోట ఉమ్మడి జిల్లాలో రెండు సబ్ స్టేషన్ల పక్కన ప్రయోగాత్మకంగా సోలార్ పవర్ ప్లాంట్లు నెలకొల్పాలని సూచించారు.
👉 పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టే 18 సోలార్ పవర్ ప్లాంట్లు (హైదరాబాద్ మినహా ఉమ్మడి తొమ్మిది జిల్లాల్లో జిల్లాకు రెండు చొప్పున) నిర్మాణానికి నోడల్ అధికారులను నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
👉 విద్యుత్ శాఖలో సరఫరా లోపాలు, మెరుగైన విద్యుత్ సరఫరాకు ఏఐ సాంకేతికతను వినియోగించుకోవాలని చెప్పారు. తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (Rythu Discom) లో చేరికపై ఉద్యోగులు, సిబ్బందికి ఉన్న అపోహలు తొలగించాలని అధికారులను ఆదేశించారు.
