అంతర్జాతీయ స్థాయిలో పండ్ల మార్కెట్‌ నిర్మిస్తున్నాము !

👉ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !


J SURENDER KUMAR,

హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపలి ప్రాంతంలో  1.34 కోట్ల జనాభాతో వేగంగా విస్తరించిన నేపథ్యంలో ఈ ప్రాంత అవసరాలకు అనుగుణంగా అంతర్జాతీయ స్థాయిలో సమీకృత పండ్ల మార్కెట్‌ను నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  అన్నారు.

👉 రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్, కోహెడలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్‌ను ముఖ్యమంత్రి  శనివారం శంకుస్థాపన చేశారు. మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు గారు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు , పొంగులేటి శ్రీనివాస రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

👉 పండ్ల మార్కెట్‌తో పాటు సమీకృత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల భవన సముదాయానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి  మాట్లాడారు.

👉 “రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలకు ఏం కావాలన్నా ఇక్కడికి వస్తే అన్నీ అందుబాటులో ఉండే విధంగా 240 ఎకరాల్లో ₹ 2,300 కోట్లతో అత్యాధునిక వసతులతో మార్కెట్‌ను నిర్మిస్తున్నామని చెప్పారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత ఈ మార్కెట్‌కు అంతర్జాతీయ గుర్తింపు వస్తుంది” అని విశ్వాసం వ్యక్తం చేశారు.

👉 30, 40 ఏండ్ల కిందట పండ్లు, కూరగాయల పంటల సాగుతో రంగారెడ్డి జిల్లా కళకళలాడిందని గుర్తుచేశారు. రంగారెడ్డి జిల్లా రైతులు కష్టపడి హైదరాబాద్ ప్రజలకు పండ్లు, కూరగాయలు, పాలు సరఫరా చేసేవారని, రియల్ ఎస్టేట్ విస్తరణతో వ్యవసాయం కుంటుపడిందని చెప్పారు.

👉 ఈ ప్రాంత ప్రజలు ఏది కొనాలన్నా పక్క రాష్ట్రం నుంచి దిగుమతి చేసుకోవలసిన పరిస్థితులు వస్తున్నాయని అన్నారు. రైతులు వరి, మొక్కజొన్న, జొన్న, పత్తి వంటి కేవలం నాలుగైదు పంటలను మాత్రమే పండించడం వల్ల ప్రజలపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతోందని చెప్పారు.

👉 కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటున్నాయని, అందుకు ప్రత్యామ్నాయంగా ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ప్రత్యామ్నాయ పంటలను పండించాలని కోరారు.

👉 స్థానిక ప్రజల సహకారంతో ప్రభుత్వం ధైర్యంగా ఈ పండ్ల మార్కెట్‌ను ప్రారంభించింది. వచ్చే రెండేళ్లలో దీన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తాం. ఈ మార్కెట్ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి నిధుల కొరత లేకుండా గ్రీన్ చానెల్‌లో విడుదల చేస్తాం. వచ్చే డిసెంబర్‌లో పనులు ప్రారంభించే విధంగా శ్రమించాలి అని మంత్రులకు సూచించారు.

👉 భారత్ ఫ్యూచర్ సిటీలో కాలుష్య కారక పరిశ్రమలు తెస్తామంటే, ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతింటాయని, అందుకే ఆ ప్రాంతంలో ఒక మహానగరాన్ని నిర్మించి ప్రపంచంలోనే గుర్తింపు పొందిన ఫార్చూన్ 500 కంపెనీలను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.

👉“రిజిస్ట్రేషన్ శాఖ ప్రభుత్వానికి ఏటా 15 నుంచి 16 వేల కోట్ల ఆదాయం సమకూర్చుతున్నప్పటికీ ఎవరైనా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళితే కూర్చోవడానికి కనీసం కుర్చీ కూడా ఉండదు. ఇలాంటి దుస్థితి ఉండకూడదన్న ఉద్దేశంతోనే అత్యాధునిక వసతులతో ఈ పక్కనే సమీకృత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల భవన సముదాయానికి కూడా శంకుస్థాపన చేశాం” అని ముఖ్యమంత్రి  చెప్పారు.

👉 హైదరాబాద్ నగరంలో 39 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉంటే వాటిని 12 క్లస్టర్లుగా అత్యంత అధునాతన సదుపాయాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించుకుంటున్నామని తెలిపారు.

👉 “అంతర్జాతీయ నగరమని మనకు మనం గొప్పులు చెప్పుకుంటే సరిపోదు. అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసుకున్నప్పుడే ఆ గుర్తింపు వస్తుంది. అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా భారత్ ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల నిర్మాణం, మెట్రో విస్తరణ వంటి పనులను పూర్తి చేస్తాం” అని స్పష్టం చేశారు.

👉 కోహెడ పండ్ల మార్కెట్ నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి జరిగిందంటే రాష్ట్రంలో అభివృద్ధి జరిగినట్టేనని, రైతును రాజును చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు.