👉 ఆలయ అభివృద్ధికి భక్తులు, గ్రామస్థులు సహకరించాలని విజ్ఞప్తి !
👉 కాళేశ్వరం మాస్టర్ ప్లాన్‌పై కమిషనర్ హనుమంతరావు సమగ్ర వివరణ !
J.SURENDER KUMAR,
కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం ఈఓ కార్యాలయంలో గ్రామస్థులు, భక్తులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆలయ మాస్టర్ ప్లాన్, చేపట్టనున్న అభివృద్ధి పనులపై సమగ్ర వివరాలను వెల్లడించారు.
ఆలయ విస్తరణ పూర్తయిన అనంతరం ఒకేసారి సుమారు 25 వేల మంది భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉండి సౌకర్యవంతంగా దర్శనాలు చేసుకునే విధంగా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.

👉.₹198 కోట్లతో ఆలయ అభివృద్ధి
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధి కోసం ₹ 198 కోట్ల నిధులు మంజూరు చేయగా, అష్ట తీర్థాల అభివృద్ధికి మరో ₹.60 కోట్లను కేటాయించినట్లు తెలిపారు.పక్షి తీర్థం, వ్యాస తీర్థం, జ్ఞాన తీర్థం తదితర తీర్థాలతో పాటు వివిధ ఘాట్ల నిర్మాణం, ఘాట్ నుంచి ఘాట్ వరకు పూర్తి స్థాయి రహదారి నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

👉 మొదటి దశలో గర్భాలయం పరిసరాలు, ప్రాకారాలు, ఉప ఆలయాల అభివృద్ధి !
మొదటి దశలో ఆలయ దక్షిణ భాగం నుంచి పనులు ప్రారంభించి గర్భాలయం పరిసరాలు, చిన్న గోపురాలు, ప్రాకారాలు, కొన్ని ఉప ఆలయాల నిర్మాణ పనులను పూర్తి చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు.
తూర్పు ప్రాకారం మినహా ఇతర పనులను ఈ దశలో పూర్తి చేస్తామని, గోదావరి పుష్కరాలు ముగిసిన అనంతరం మిగిలిన పనులను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. 2027 మే నాటికి తొలి దశ నిర్మాణ పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
👉 నేటి నుంచి బాలాలయంలో స్వామివారి దర్శనాలు !
అభివృద్ధి పనుల నేపథ్యంలో నేటి నుంచి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి దర్శనాలు బాలాలయమైన శ్రీ ఆది ముక్తీశ్వర స్వామి వారి ఆలయంలో కొనసాగుతాయని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు పనులను వేగవంతం చేసేందుకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు చెప్పారు.
👉 గోదావరి పుష్కరాల లోపు ప్రారంభోత్సవానికి కృషి !

అభివృద్ధి పనులు పూర్తయిన అనంతరం శృంగేరి పీఠాధిపతిని కాళేశ్వరానికి ఆహ్వానించి, గోదావరి పుష్కరాల లోపు ఆలయ విస్తరణ పనులకు ప్రారంభోత్సవం నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు హనుమంతరావు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారంతో పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని పేర్కొంటూ, గ్రామస్థులు, భక్తులు అన్ని విధాలుగా సహకరించాలని కోరారు.
ఈసమావేశంలో ధార్మిక సలహాదారు గోవింద హరి, దేవస్థాన ఈఓ ఎస్. మహేష్, స్థపతి నాయక్, గ్రంథాలయ చైర్మన్ రాజబాపు, కాటారం ఆర్డీవో వెంకటేశ్వర్లు, సర్పంచ్ మోహన్ రెడ్డి, ధర్మకర్తలు సత్యనారాయణ, సీతయ్య, శ్యామ్, సీతారాం, దుర్గయ్య, అశోక్,పద్మ, రాజయ్య,ప్రశాంత్ రెడ్డి, శ్రీధర్ రావు, ఎక్స్ ఆఫీషోయో మెంబర్ నాగేష్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
