👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J SURENDER KUMAR,
ఎలాంటి ఆటంకాలు ఎదురైనా అధిగమించి మూసీ నది ప్రక్షాళన పూర్తి చేసి తీరుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. “మూసీ నది ప్రక్షాళన చేయాలన్నది నా కల. ఒట్టేసి చెబుతున్నా మూసీ ప్రక్షాళన చేసి తీరుతా” అని స్పష్టం చేశారు.
నల్గొండ జిల్లా కనగల్ మార్కెట్ యార్డులో హ్యామ్ రోడ్ల నిర్మాణానికి ఆదివారం పైలాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి ఆ తర్వాత నల్గొండ పట్టణానికి చేరుకుని తెలంగాణ పట్టణ ఆర్థిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ TUFIDC ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్‌లో ₹ 83 కోట్లతో చేపట్టనున్న తాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారు.

👉 ఈ శంకుస్థాపన కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
👉 ఈ సందర్భంగా ఎన్‌జీ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
నల్గొండ జిల్లా అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నివేదించిన ప్రతి పనినీ చేయడానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల నాటికి ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును నూటికి నూరు శాతం పూర్తి చేసి నల్గొండ నేలమీద కృష్ణా నది జలాలను పారిస్తానని ప్రకటించారు. ఎస్ఎల్‌బీసీ పూర్తి చేయడంతో పాటు డిండి ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకారాన్ని అందిస్తానని స్పష్టం చేశారు.

.
👉 “మూసీ కాలుష్యం కారణంగా ఇబ్రహీంపట్నం, భువనగిరి, మునుగోడు, నల్గొండ ప్రజల పరిస్థితి దారుణంగా ఉంది. ప్రక్షాళన చేస్తామంటే కొందరు కడుపులో విషయం పెట్టుకుని మాట్లాడుతున్నారు. ఎవరు అడ్డుకున్నా మూసీ ప్రక్షాళన చేసి దేశానికే తలమానికంగా తీర్చిదిద్దుతాం. నల్గొండ జిల్లా ప్రజలకు విముక్తి కల్పిస్తా” అని చెప్పారు.
👉 గత 30 నెలల ప్రజా ప్రభుత్వ పాలనలో ఏం సాధించామన్న అంశంలో అసెంబ్లీ వేదికగా చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. తెలంగాణలో పదేండ్లలో వందేళ్ల విధ్వంసం జరిగిందని విమర్శించారు.
👉 “గతంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వకపోగా ప్రజా ప్రభుత్వం లక్షలాది రేషన్ కార్డులు జారీ చేసింది. రాష్ట్రంలో 3.28 కోట్ల మందికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం. పేదవారికి ఇందిరమ్మ ఇండ్ల కోసం ₹ 5 లక్షల చొప్పున అందిస్తున్నాం. భూమి లేని నిరుపేదలను ఆదుకోవడానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. ₹. 500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం.
👉 రైతుల సంక్షేమం కోసం 30 నెలల్లో ₹ 1.56 లక్షల కోట్లను ఖర్చు చేసింది. 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రికార్డు సృష్టించాం. వందేళ్లుగా అపరిష్కృత ఎస్సీ వర్గీకరణకు శాశ్వత పరిష్కారం చూపించాం. కులగణన చేపట్టాం. 30 నెలల్లో 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి యువకుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాం. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదు.

👉 ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ప్రవేశపెట్టాం. బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్ అందించే కార్యక్రమం చేపట్టాం. ఆరుట్లలో తెలంగాణ మోడల్ స్కూల్‌ను అద్భుతంగా తీర్చిదిద్దాం. నాణ్యమైన విద్యను అందించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల నుంచి వందలాది మంది అంబేద్కర్లుగా తయారై రాష్ట్రాన్ని పాలించాలి. పిల్లల్లో నైపుణ్యాలను పెంచాలని స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు, ఐటీఐలను ఏటీసీలుగా మార్పు చేశాం” అని ముఖ్యమంత్రి ఒక్కొక్కటిగా సంక్షేమ అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు.
👉 “ఇవన్ని చేశామంటే.. అది ప్రజా ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత. రికార్డు. ఇవి ప్రజా ప్రభుత్వం సాధించిన విజయాలు కాదా. ప్రజలు ఆలోచన చేయాలి” అని ముఖ్యమంత్రి కోరారు.
