ప్రగతి ప్రణాళిక అమలులో జగిత్యాల జైత్రయాత్ర !

👉 ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం మార్చి 6 నుంచి జూన్ 12 వరకు !
👉 సంక్షేమం ఇంటింటికీ… అభివృద్ధి ప్రతి గ్రామానికీ..!


👉 1.78 లక్షల మంది రైతులకు రూ.131 కోట్ల రైతు భరోసా జమ !


👉 38,417 కొత్త రేషన్ కార్డులు.. 1.71 లక్షల కుటుంబాలకు గృహజ్యోతి !


👉 7,680 ఇందిరమ్మ ఇళ్లకు అనుమతులు.. 1,146 ఇళ్ల నిర్మాణం పూర్తి !


👉 మూడు నియోజకవర్గాల్లో ఏ.టీ.సీ.లు, యంగ్ ఇండియా పాఠశాలల ఏర్పాటుకు వేగం !


👉 పరిశుభ్రత, మహిళా సంక్షేమం, విద్య, పర్యావరణ !

J.SURENDER KUMAR,


జగిత్యాల జిల్లా గత 99 రోజులుగా అభివృద్ధి, సంక్షేమం, ప్రజా చైతన్య కార్యక్రమాలకు వేదికగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం మార్చి 6 నుంచి జూన్ 12 వరకు జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి శాసనసభ నియోజకవర్గాల్లో విజయవంతంగా అమలై ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పును తీసుకువచ్చింది.


రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచనలు, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పర్యవేక్షణలో గ్రామ, మండల, మున్సిపల్, నియోజకవర్గ, జిల్లా స్థాయిలలో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేసింది.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మున్సిపల్ ప్రజా ప్రతినిధులు, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, అధికారులు, స్వయం సహాయక సంఘాలు, రైతు సంఘాలు, యువజన సంఘాలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను ప్రజా ఉద్యమంగా మార్చారు.

👉 రైతు సంక్షేమానికి పెద్ద పీట !

వ్యవసాయమే జగిత్యాల జిల్లా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ఫలాలు 99 రోజుల కార్యక్రమంలో విస్తృతంగా ప్రజలకు చేరాయి.

జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కలిపి 1,78,489 మంది రైతులకు రైతు భరోసా కింద రూ.131 కోట్లకు పైగా పెట్టుబడి సాయం అందించారు. 275 రైతు బీమా క్లెయిమ్‌లను పరిష్కరించి ₹.13.01 కోట్ల ఆర్థిక సహాయాన్ని రైతు కుటుంబాలకు అందజేశారు.

రైతు వారోత్సవాల్లో భాగంగా రైతు వేదికల్లో ఆధునిక వ్యవసాయం, సేంద్రియ సాగు, పంటల వైవిధ్యీకరణ, నీటి యాజమాన్యం, మట్టి పరీక్షలు, వ్యవసాయ యాంత్రీకరణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

👉 సంక్షేమ పథకాలతో లక్షలాది కుటుంబాలకు భరోసా!

జిల్లాలో 38,417 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసి వేలాది కుటుంబాలకు ఆహార భద్రత కల్పించారు. మహాలక్ష్మి పథకం కింద 1,61,896 మంది మహిళలు అర్హులుగా గుర్తించబడ్డారు. 55,65,913 గ్యాస్ సిలిండర్లకు ₹ 22.42 కోట్ల సబ్సిడీ అందించారు.


ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 7,680 ఇళ్లకు అనుమతులు మంజూరు చేయగా, 6,370 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇప్పటికే 1,146 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి.
గృహజ్యోతి పథకం కింద 1,71,437 కుటుంబాలకు ₹.147.49 కోట్ల ప్రయోజనం అందింది.

👉 యువత భవిష్యత్తుకు బలమైన పునాది !

నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చింది. జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాల్లో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల (ATCs) ఏర్పాటుకు చర్యలు వేగవంతమయ్యాయి.

జగిత్యాల ఏటీసీలో సీఎన్‌సీ లాథ్ మెషిన్ ఆపరేషన్, ప్రోగ్రామింగ్, ఆటోమేషన్, రోబోటిక్ వెల్డింగ్, ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ, Auto CAD డిజైనింగ్ వంటి కోర్సులను ప్రారంభించి యువతకు ఆధునిక నైపుణ్యాలు అందిస్తున్నారు.

జిల్లాలో రెండు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జగిత్యాలలో ₹.200 కోట్ల వ్యయంతో పాఠశాల పనులు పురోగతిలో ఉండగా, ధర్మపురిలో మరో పాఠశాలకు పరిపాలనా అనుమతులు లభించాయి.

👉 పరిశ్రమలు.. ఉపాధి అవకాశాలు !

జిల్లాలో 14 పరిశ్రమల స్థాపనకు ప్రతిపాదనలు నమోదయ్యాయి. వాటి ద్వారా ₹.9.59 కోట్ల పెట్టుబడులు, 129మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

👉 పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం !

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో పరిశుభ్రత కార్యక్రమాలు ప్రజల్లో విశేష స్పందన పొందాయి.
గ్రామాలు, పట్టణాల్లో శ్రమదానం కార్యక్రమాలు నిర్వహించి కాలువలు, రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. ప్లాస్టిక్ నిర్మూలన, వ్యర్థాల నిర్వహణ, పారిశుధ్య నిర్వహణ, కార్యాలయ నిర్వహణ, పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు స్వయంగా శ్రమదానంలో పాల్గొనడం విశేషంగా నిలిచింది.

👉 హరిత జగిత్యాల దిశగా !

పర్యావరణ వారోత్సవాల్లో భాగంగా భారీ స్థాయిలో మొక్కలు నాటారు. నీటి వనరుల పరిరక్షణ, వర్షపు నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన 5K రన్ కార్యక్రమాలు వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో విశేష చైతన్యాన్ని తీసుకువచ్చాయి.

👉 మహిళా సాధికారతకు కొత్త బలం !

మహిళా సంక్షేమ వారోత్సవాల్లో స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆర్థిక స్వావలంబన, బ్యాంకు లింకేజీలు, సూక్ష్మ వ్యాపారాలు, డిజిటల్ లావాదేవీలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు.

“సేఫ్ మదర్స్ డే” కార్యక్రమాల ద్వారా గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య పరీక్షలు, వైద్య సలహాలు, పోషకాహార మార్గదర్శకాలు అందించారు.
ధర్మపురి నియోజకవర్గంలో అర్హత గల మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ చేపట్టారు.

👉 విద్య, యువత, సామాజిక చైతన్యానికి ప్రత్యేక కార్యక్రమాలు !


విద్యా వారోత్సవాల్లో సైన్స్ ప్రదర్శనలు, క్విజ్ పోటీలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలు నిర్వహించారు. ధర్మపురి నియోజకవర్గంలో పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు.
రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు, హెల్మెట్ వినియోగం,
సీటు బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలు, సైబర్ భద్రత, ఓటరు చైతన్యం, బాల్య వివాహాల నిరోధం, మత్తు పదార్థాల నిర్మూలనపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

👉 99 రోజుల ప్రగతి… జగిత్యాల జిల్లాకు కొత్త గుర్తింపు !

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల గడప దాకా చేరాయి. రైతు సంక్షేమం, మహిళా సాధికారత, విద్యా వికాసం, యువత నైపుణ్యాభివృద్ధి, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, సామాజిక చైతన్యం వంటి అనేక రంగాల్లో జిల్లా ముందడుగు వేసింది.

మంత్రి నుంచి గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్ వరకు, ప్రజా ప్రతినిధుల నుంచి సాధారణ ప్రజల వరకు, అధికారుల నుంచి స్వచ్ఛంద సంస్థల వరకు అందరి భాగస్వామ్యంతో సాగిన ఈ 99 రోజుల ప్రణాళిక జగిత్యాల జిల్లాలో ప్రజా భాగస్వామ్య పాలనకు చిరస్మరణీయ ఉదాహరణగా నిలిచింది.

👉 సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్…!

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలును వేగవంతం చేసిందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రైతు భరోసా, రైతు బీమా, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, మహాలక్ష్మి వంటి సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజల, అధికారుల భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రభుత్వ సేవలు మరింత పారదర్శకంగా ప్రజలకు అందుతున్నాయని పేర్కొన్నారు. యువత నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత, విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. తెలంగాణను సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లడంలో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కీలక పాత్ర పోషించిందని మంత్రి అన్నారు.

👉 జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్…!

జగిత్యాల నియోజకవర్గంలో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హ కుటుంబానికి చేరేలా విస్తృత చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తెలిపారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు యువత భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయని అన్నారు.

రైతులకు ఆర్థిక భరోసా, మహిళలకు సంక్షేమ పథకాలు, పేదలకు గృహాల నిర్మాణం వంటి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. అభివృద్ధి ఫలాలు ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి చేరేలా ప్రజాప్రతినిధులు మరియు అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు.

👉 జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ !

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను జగిత్యాల జిల్లాలో విజయవంతంగా అమలు చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేశారని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక, అవగాహన కార్యక్రమాలు, అభివృద్ధి పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ లక్ష్యాల సాధనకు కృషి చేశామని చెప్పారు.

జిల్లాలో రైతు భరోసా, రైతు బీమా, మహాలక్ష్మి,గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు తదితర పథకాల అమలులో గణనీయమైన పురోగతి సాధించామని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉంటుందని, అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని కలెక్టర్ తెలిపారు.