రోళ్ల వాగు ప్రాజెక్టు అటవీ అనుమతులు తెస్తాం !

👉 ఈ సీజన్ లో రైతులకు నీరు అందజేస్తాం !

👉 అటవీ శాఖ అనుమతి లేకుండానే ప్రాజెక్టు పనులు మొదలు పెట్టిన  బీఆర్ఎస్ !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J SURENDER KUMAR,

రోళ్ల వాగు ప్రాజెక్టు సంబంధించిన అటవీశాఖ అనుమతులు పూర్తి చేసి ఈ వర్షాకాలం లో రైతాంగానికి సాగు నీటిని అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండలంలోని  రోళ్ళ వాగు ప్రాజెక్టును శుక్రవారం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్,  కలెక్టర్ సత్యప్రసాద్ తోపాటు నీటిపారుదల శాఖ అటవీ శాఖ అధికారులతో కలిసి రోళ్లవాగు ప్రాజెక్టును మంత్రి లక్ష్మణ్ కుమార్ సందర్శించారు.


👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…….

సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం చేసే క్రమంలో డీపీఆర్ పూర్తి అయిన తర్వాత ప్రాజెక్టుల నిర్మాణం చేస్తారని అన్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో రోళ్లవాగు ప్రాజెక్టుకు ఏలాంటి డీపీఆర్ లేకుండానే పనులు ప్రారంభించారని మంత్రి  ఆరోపించారు.

👉 2016లో ఏలాంటి అనుమతులు లేకుండా అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు  పనులు ప్రారంభించారని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ₹ 60 కోట్లతో ప్రారంభించిన రోళ్ల వాగు ప్రాజెక్టు 2023 డిసెంబర్ వరకు ₹ 153 కోట్లకు పెంచారని అన్నారు. అంచనాలు పెంచినప్పటికీ రోళ్ల వాగు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయలేదని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు.


👉 అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ లు పూర్తి చేసుకున్నారని ధర్మపురి నియోజకవర్గ ప్రాజెక్టులను మాత్రం పెండింగ్ లో పెట్టారని మంత్రి లక్ష్మణ్ కుమార్  అన్నారు.


👉 రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోళ్ల వాగు ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించి అన్నదాతలకు సాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం నిర్మాణ సంస్థకు ఇవ్వాల్సిన ₹ 40 కోట్లు చెల్లించడంతో పాటు రెవెన్యూకు సంబంధించిన 800 ఎకరాల భూమిని అప్పగించడం జరిగిందని మంత్రి వివరించారు.


👉 రిజర్వు ఫారెస్ట్ అనుమతుల కోసం ₹ 32 లక్షలు డిపాజిట్ చేయడం జరిగిందని మంత్రి వివరించారు. రిజర్వ్ ఫారెస్ట్ అనుమతులతో పాటు అటవీ శాఖ అనుమతులు సాధించి ఈ వాన కాలంలో సాగునీటిని రైతులకు అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.


👉 15 రోజుల్లో ప్రాజెక్టు కు గేట్లు బిగించి పాయింట్. 25 టీఎంసీల నీటిని నిలువ చేసి రైతులకు వానకాలం సీజన్ లో సాగు నీటిని అందిస్తామని మంత్రి తెలిపారు. రోళ్లవాగు ప్రాజెక్టు కాల్వ లైనింగ్ పనులకు అంచనాలు తయారు చేయాలని మంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.


👉 జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు. యుద్ధ ప్రాతిపాదికన గేట్ల బిగింపు చేపట్టి రైతులకు సాగునీటిని అందించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.