👉 ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో..!
👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో చేపట్టిన సాగు, తాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో 26 లక్షల ఎకరాలకు నీరందించి జిల్లాను సస్యశ్యామలం చేయడానికి చిత్తశుద్ధితో పనిచేస్తామని స్పష్టం చేశారు.
👉 ఉమ్మడి పాలమూరు జిల్లాలోని గత రెండు రోజులుగా ప్రధాన నీటి పారుదల ప్రాజెక్టుల్లో కొనసాగుతున్న పనులను ముఖ్యమంత్రి మంత్రులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిశీలించారు. అనంతరం ఆయన కొత్తూరు కరివెన రిజర్వాయర్ వద్ద మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి , జూపల్లి కృష్ణారావు , వాకిటి శ్రీహరి తో కలిసి ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు.
👉 ఉమ్మడి జిల్లాకు 90 టీఎంసీల నీటిని అందించగలిగితే అత్యంత కీలకమైన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గత ప్రభుత్వ హయాంలో పూర్తి నిర్లక్ష్యానికి గురైందని అన్నారు. జిల్లాకు చెందిన పాలమూరుతో పాటు కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, జూరాల, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేస్తే 26 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉండేదని వివరించారు.
👉 “ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రధానమైన భూసేకరణ చేయకుండా గత ప్రభుత్వ హయాంలో నిధులను పంపులు, లిఫ్ట్‌లకే ఖర్చు చేశారు. గత ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ₹. 84,503 కోట్ల అప్పు చేస్తే ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 30 నెలల్లో అసలు, వడ్డీ కలిపి ₹. 52,121 కోట్లు చెల్లించా” చెప్పారు.
👉 అప్పులు, వడ్డీ పోగా కొత్తగా ప్రాజెక్టుల కోసం ₹. 22 వేల కోట్లు ఖర్చు చేయగా అందులో ₹ 8 వేల కోట్లు ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టామని, ఈ లెక్కన జిల్లాలోని ప్రాజెక్టులకు ఎక్కువ ఖర్చు చేసినట్టా తక్కువ ఖర్చు చేసినట్టా అని ప్రశ్నించారు.

👉 రాబోయే రెండేండ్లలో గరిష్టస్థాయిలో ప్రాజెక్టుల పనులన్నీ పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేసి ఇకనుంచి విడతల వారిగా ఒక ప్రణాళికా బద్ధంగా పనులను పూర్తి చేయాలన్న ఆలోచనతో ఉన్నాం.
👉 భూ సేకరణ పూర్తి కాకుండా ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయని ప్రశ్నించారు. జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ప్రధానంగా మరో 4 వేల ఎకరాల భూ సేకరణ జరగాల్సి ఉందని పేర్కొంటూ అవసరమైన నిధులను విడుదల చేస్తామన్నారు. రైతులు అడుగుతున్న ధరలో కొంత ఎక్కువైనప్పటికీ భూసేకరణ పనులను పూర్తి చేస్తామని చెప్పారు.
👉 “ఇప్పుడు పనులు పూర్తి చేయకపోతే చరిత్ర క్షమించదు. జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి నీళ్లు నింపడానికి రిజర్వాయర్లు కూడా పూర్తి కావాలి. రిజర్వాయర్లకు సంబంధించి ఆగిపోయిన పనులను కూడా పునరుద్ధరించాల్సి ఉంది. రాబోయే రోజుల్లో ఎక్కడికక్కడ నీళ్లు నిలువ చేయడానికి అవసరమైన పనులను పూర్తి చేస్తాం” అని తెలిపారు.
👉 కర్నాటక రాష్ట్ర సరిహద్దు వద్ద బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ కట్టుకుంటే భూగర్భ జలాలు పెరుగుతాయని చెబుతున్నారని, ఈ విషయంలో తొందర్లోనే సాంకేతిక నిపుణులతో చర్చించి కర్నాటక ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ముందుకు వెళతామని అన్నారు.
👉 “పెండింగ్ పనులకు సంబంధించి క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను అంచనా వేసుకుని వాటిని పూర్తి చేయడానికి అవసరమైన కార్యాచరణ రూపొందిస్తాం. జిల్లాను అభివృద్ధి చేసుకుందాం. ఆలోచనా విధానంలో వేర్వేరు దృక్పథాలు ఉండొచ్చు. కానీ జిల్లా అభివృద్ధి విషయంలో అంతా ఒక్కటిగా ఉండాలి” అని కోరారు.
👉 “పాలమూరు – రంగారెడ్డి నుంచి ఉద్దండాపూర్ వరకు ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ రావాలి. ఇప్పుడున్న పంపులు, లిఫ్ట్‌లు, కెనాళ్లు పూర్తి స్థాయిలో 2027 నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నాం. అక్కడి నుంచి లక్ష్మిదేవిపూర్ వరకు నీటిని తరలించే విషయంపై వచ్చే 6 నెలల్లో మరోసారి సమీక్షిస్తాం” అని పేర్కొన్నారు.
👉 “పాలమూరు ప్రాజెక్టుల పనులను పూర్తి చేయడానికి మా చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు. నేను ప్రత్యేకించి ఈ ప్రాంతం వాడిని. నా బాధ్యతను మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తా. గడిచిన 20 ఏండ్ల చరిత్రలో ఎప్పుడూ చిన్న విషయంలో కూడా లాలూచీ పడిన సందర్భం లేదు” అని వ్యాఖ్యానించారు.
👉 రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ అనేక అవాంతరాలను అధిగమిస్తూ 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా ముఖ్యమంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కేవలం మద్దతు ధర ప్రకటించి వడ్లు కొనుగోలు చేయకపోవడం సరికాదన్నారు.
👉 రాష్ట్రంలో రైతాంగానికి అవసరమైన యూరియా కేటాయించాలని కోరారు. రాష్ట్రంలోని రామగుండం ఫెర్టిలైజర్స్ నుంచి ఉత్పత్తి అవుతున్న యూరియా బయటి రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారని, ఈ రాష్ట్ర అవసరాలకు కేటాయించాలని కోరారు.
👉 రాష్ట్రానికి చెందిన నీటి హక్కులపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గోదావరి జలాల్లో 968 టీఎంసీల నికర జలాల కేటాయింపులు ఉన్నాయని, ఈ జలాల విషయంలో చుక్క నీటి విషయంలో కూడా రాజీ పడే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు. తెలంగాణకు జరిగిన కేటాయింపులు కచ్చితంగా రావలసిందేనని, 968 నికర జలాల లెక్క తేలిన తర్వాత సముద్రంలో కలుస్తున్న మిగులు జలాలపై చర్చిస్తామని అన్నారు.
👉 “వచ్చే డిసెంబర్ నాటికి కృష్ణా జలాలపై ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తాం. పరిష్కారం కోసం ఆఖరు నిమిషం వరకు పోరాడుతాం” అని స్పష్టం చేశారు.
👉 “పక్క రాష్ట్రాలతో పంచాయతీలు కోరుకోవడం లేదని, పంచాయతీ కావాలా, పరిష్కారం కావాలా అంటే నాకు పరిష్కారమే కావాలని చెబుతాను. గోదావరి, కృష్ణా జలాల్లో చుక్క నీరు వదులుకోం. చిల్లర పంచాయతీలు మాట్లాడం. వ్యూహాత్మకంగా ప్రతి చుక్క కాపాడుకునే ప్రయత్నం చేస్తాం” అని నొక్కి చెప్పారు.
👉 తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు చేపట్టడానికి మహారాష్ట్రతో సంప్రదింపుల ప్రయత్నాలు చేస్తున్నామని, ఈ విషయంపై చర్చించడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి కి లేఖ రాశామని మరోసారి గుర్తుచేశారు.
