ఓటరుకు ఫారం ఇచ్చి వివరాలు సేకరించాలి!


👉 ఎస్‌.ఐ.ఆర్‌. కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించాలి !


👉 జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే నిర్వహించాలి !


👉 బీఎల్‌వోలకు సమగ్ర శిక్షణ అందించి కార్యక్రమంపై పూర్తి అవగాహన కల్పించాలి !


👉 మ్యాప్డ్, అన్‌మ్యాప్డ్ ఓటర్ల వివరాలు స్పష్టంగా నమోదు చేయాలి !


👉 రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి !


J.SURENDER KUMAR,

ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌.ఐ.ఆర్‌.) కార్యక్రమంలో ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారం అందించి పూర్తి వివరాలు సేకరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

శుక్రవారం హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎస్‌.ఐ.ఆర్‌. కార్యక్రమం అమలు, మ్యాపింగ్ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. జిల్లా సమీకృత కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ పాల్గొన్నారు.

👉 ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ……

తెలంగాణ రాష్ట్రంలో 24 సంవత్సరాల తర్వాత ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2002లో ఎస్‌.ఐ.ఆర్‌. కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు.


👉 అక్టోబర్ 1, 2026ను ప్రమాణిక తేదీగా తీసుకుని అప్పటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా మారిన వారు, డూప్లికేట్ ఓట్ల తొలగింపు కూడా ఈ ప్రక్రియలో భాగమని తెలిపారు.


👉 ప్రస్తుత ఓటర్ల జాబితాను 2002 నాటి ఎస్‌.ఐ.ఆర్‌. ఓటరు జాబితాతో మ్యాపింగ్ చేస్తున్నామని తెలిపారు.
2002 తర్వాత కొత్తగా చేర్చిన ఓటర్లు పాత ఓటర్లతో సంబంధాన్ని లేదా కొత్త నమోదు ఆధారాలను చూపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఓటరు జాబితాలో మ్యాప్డ్, అన్‌మ్యాప్డ్ ఓటర్ల వివరాలు స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు.


👉 జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ లెవల్ అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించి ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారం అందించాలని ఆదేశించారు.

👉 ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి పూర్తి వివరాలు సేకరించాలని, మొదటి దశలో పౌరసత్వానికి సంబంధించిన ఆధారాలు అడగవద్దని స్పష్టం చేశారు.

👉 ప్రతి బీఎల్‌వోకు ఎస్‌.ఐ.ఆర్‌. నిబంధనలు, విధివిధానాలు, ఫీల్డ్ వెరిఫికేషన్, ఫారాల నిర్వహణపై పూర్తి అవగాహన ఉండేలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.


👉 బీఎల్‌వోలు ప్రజలకు సుపరిచితంగా ఉండాలని, వారికి గుర్తింపు కార్డులు అందించాలని ఆదేశించారు. ఎఫ్‌.ఏ.క్యూ. పుస్తకాలను తయారు చేసి ప్రతి బీఎల్‌వోకు అందించాలని సూచించారు.


👉 భారత పౌరసత్వ నిర్ధారణకు అనుమతించే 11 రకాల పత్రాల పై విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారంతో పాటు గుర్తింపు ఆధారాల సేకరణకు అవసరమైన అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి బీఎల్‌వో వద్ద తగినంత సంఖ్యలో ఎన్యూమరేషన్ ఫారాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు.


👉 ఇంటింటి సర్వే సమయంలో బీఎల్‌వోలకు బీఎల్‌ఏలు సహకరించాలని, ప్రజలకు అవగాహన కల్పించి సరైన పత్రాలతో ఫారాలు నింపడంలో సహాయం చేయాలని సూచించారు. మరణించిన ఓటర్లు, డూప్లికేట్ ఓట్లు, రెండు చోట్ల ఓటు ఉన్న వారి వివరాలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.


👉 జూలై 31, 2026న డ్రాఫ్ట్ ఎస్‌.ఐ.ఆర్‌. ఓటరు జాబితాను విడుదల చేస్తామని తెలిపారు. ప్రతి ఓటరు తన పేరు డ్రాఫ్ట్ జాబితాలో ఉందో లేదో పరిశీలించాలని సూచించారు. అభ్యంతరాలు, ఫిర్యాదులు, కొత్త క్లెయిమ్‌లు ఉంటే ఆగస్టు 30లోగా సమర్పించాలని తెలిపారు.


👉 డ్రాఫ్ట్ జాబితా విడుదల అనంతరం మ్యాపింగ్‌లో లోపాలు ఉంటే సంబంధిత ఓటర్లకు నోటీసులు జారీ చేస్తామని పేర్కొన్నారు. భారత పౌరసత్వ నిబంధనల ప్రకారం అవసరమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. జూలై 1, 1987కు ముందు జన్మించిన వారు తమ స్వీయ గుర్తింపు లేదా జనన ఆధార పత్రాలు సమర్పిస్తే సరిపోతుందని, తల్లిదండ్రుల పత్రాలు అవసరం లేదన్నారు.


👉 జూలై 1, 1987 నుంచి డిసెంబర్ 2, 2004 మధ్య జన్మించిన వారు తమ పత్రాలతో పాటు తల్లి లేదా తండ్రి ఎవరి అయినా ఒకరి పత్రం సమర్పించాలని తెలిపారు. డిసెంబర్ 2, 2004 తర్వాత జన్మించిన వారు తమ పత్రాలతో పాటు తల్లిదండ్రుల ఇద్దరి పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని వివరించారు.


👉 జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణ జరుగుతుందని, సెప్టెంబర్ 28 నాటికి వాటి పరిష్కార ప్రక్రియ పూర్తి చేసి అక్టోబర్ 1, 2026న తుది ఎస్‌.ఐ.ఆర్‌. ఓటరు జాబితా విడుదల చేస్తామని తెలిపారు.


👉 ఇల్లు తాళం వేసి ఉంటే బీఎల్‌వోలు మూడు సార్లు సందర్శిస్తారని తెలిపారు. ఓటర్లు www.voter.eci.gov.in వెబ్‌సైట్ ద్వారా కూడా ఎన్యూమరేషన్ ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకుని పూరించవచ్చని చెప్పారు. ఫారం సమర్పించిన ప్రతి ఓటరు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని సూచించారు.


👉 రాజకీయ పార్టీలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని, కార్యక్రమ పురోగతిని వారికి తెలియజేయాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో పూర్తిస్థాయి నిష్పాక్షికత పాటించాలని, ఎస్‌.ఐ.ఆర్‌. కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు.

👉 ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ..

.

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సూచనలను పూర్తిగా అమలు చేస్తామని తెలిపారు. జిల్లాలో రాజకీయ పార్టీలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. బీఎల్‌వోలకు అవసరమైన శిక్షణ కార్యక్రమం శనివారంతో పూర్తవుతుందని తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారాల ముద్రణ మరో రెండు రోజుల్లో పూర్తవుతుందని చెప్పారు. బీఎల్‌వో కిట్ల తయారీ పూర్తిచేసి పంపిణీ చేస్తున్నామని వివరించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ రెవెన్యూ బి.ఎస్ లత ,ఆర్డీవోలు కాన్ఫరెన్స్‌లో సంబంధిత ఎన్నికల శాఖ అధికారులు పాల్గొన్నారు.