ఆదాయ సమీకరణపై దృష్టి  పెట్టండి !


👉 అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం !


J.SURENDER KUMAR,


రాష్ట్ర బడ్జెట్‌కు అనుగుణంగా లక్ష్యాలను సాధించడానికి ఆదాయ సమీకరణపై కచ్చితంగా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  అధికారులను ఆదేశించారు. లీకేజీలను అరికట్టి ఆదాయ సమీకరణకు సంబంధించి చేజింగ్ సెల్‌ను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు.

👉 రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ సమీకరణపై ముఖ్యమంత్రి  ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , జూపల్లి కృష్ణారావు గారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు  సలహాదారు కె రామకృష్ణారావు , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


👉  ఈ సందర్భంగా ఆదాయ పెంపు విషయంలో ముఖ్యమంత్రి  అధికారులకు పలు కీలక ఆదేశాలిచ్చారు. హెచ్ఎండీఏ, టీజీఐఐసీ ఆదాయ సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు.


👉 వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, మైనింగ్‌తో పాటు ఇతర శాఖలకు సంబంధించి లీకేజీలను పూర్తిగా అరికట్టాలని ఆదేశించారు. ఆదాయ సమీకరణలో చేజింగ్ సెల్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఆదాయం పెంపు, నిధుల సమీకరణ విషయంలో నిర్లక్ష్యం వీడాల్సిందేనని అధికారులకు స్పష్టం చేశారు.


👉 అనుకున్న స్థాయిలో పనిచేయాలంటే శాఖలవారీగా సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులను, ఇతర పనులను పూర్తి చేసేందుకు అనుగుణంగా శాఖలవారిగా బడ్జెట్‌ను తయారు చేసుకోవాలని చెప్పారు. ప్రాజెక్టులకు సంబంధించి ప్రధానంగా భూసేకరణను మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలని అన్నారు.


👉 ప్రభుత్వం ప్రతిపాదించే బడ్జెట్ ఊహాజనితం కాదన్న విషయం గుర్తుపెట్టుకోవాలని, వాస్తవికత ఆధారంగానే బడ్జెట్ రూపకల్పన జరగాలని స్పష్టం చేశారు. ఆయా శాఖలకు అవసరమైన అన్ని రకాల సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.