ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది జీతాలు విడుదల !


J.SURENDER KUMAR,


ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, విశ్వవిద్యాలయాలు, ఇతర ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ సిబ్బందికి ఆర్థిక శాఖ బుధవారం ఈ నెల మొదటి తేదీనే జీతాలు విడుదల చేసింది.

👉 జీతాల చెల్లింపులో ఆలస్యం వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని రెగ్యులర్‌ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, గౌరవ వేతనం ప్రాతిపదికన పనిచేస్తున్న సిబ్బందికి కూడా జీతాలు జాప్యం చేయకుండా అందాలని ఇటీవల అధికారులను ఆదేశించారు.

👉 ముఖ్యమంత్రి  ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ఇటీవల అన్ని శాఖలు, విభాగాలకు సర్క్యులర్‌ జారీ చేసింది. జీతాల బిల్లుల సమర్పణ, పరిశీలన, ఆడిట్‌, ఆథరైజేషన్‌లో జాప్యం జరక్కుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సర్క్యులర్‌లో పేర్కొంది.

👉 ప్రతి నెల 25వ తేదీలోగా జీతాలు, రెమ్యునరేషన్‌ బిల్లులను ట్రెజరీ, పే అండ్‌ అకౌంట్స్‌, అకౌంట్స్‌ విభాగాలకు సమర్పించాలని ఆదేశించింది. నెల చివరి పని దినానికల్లా పరిశీలన, ఆడిట్‌, ఆథరైజేషన్‌ ప్రక్రియ పూర్తిచేయాలని స్పష్టం చేసింది.

👉 ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ సిబ్బందికి జీతాల చెల్లింపుల వివరాలపై ముఖ్యమంత్రి  బుధవారం ఆర్థిక శాఖ అధికారులను ఆరా తీశారు. ఈ నెల బిల్లులు అందిన అన్ని విభాగాల ఉద్యోగులకు జీతాలు జమ చేసినట్లు ఆర్థిక శాఖ అధికారులు నివేదించారు.