👉 జీ న్యూస్ తెలుగు న్యూస్ చీఫ్ ఎడిటర్ భరత్ కుమార్‌కు ‘ఆటా ‘ ఆహ్వానం !
👉 అమెరికాలో జరిగే 19వ ‘ ఆటా ‘ కాన్ఫరెన్స్‌కు సెమినార్ పార్టిసిపెంట్‌గా ఎంపిక !
J.SURENDER KUMAR,
తెలుగు మీడియా రంగానికి మరో గౌరవం దక్కింది. జీ న్యూస్ తెలుగు న్యూస్ చీఫ్ ఎడిటర్ సంఘనపట్ల భరత్ కుమార్ కు అమెరికాలోని ప్రముఖ తెలుగు సంస్థ అమెరికా తెలుగు అసోసియేషన్ ( American Telugu Association ) ఆటా నుంచి అధికారిక ఆహ్వానం అందింది. ఈ నెల జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం, బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే 19వ ATA బైనియల్ కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్ లో సెమినార్ పార్టిసిపెంట్‌గా పాల్గొనాలని ATA అధ్యక్షుడు జయంత్ చల్లా, కన్వీనర్ శ్రీధర్ బనాలా ఆహ్వానించారు.

ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాష, సంస్కృతి, యువత నాయకత్వం, సామాజిక సేవ, విద్య, వృత్తిపరమైన అభివృద్ధి వంటి అంశాలపై జరిగే ఈ ప్రతిష్ఠాత్మక వేదికలో భరత్ కుమార్ పాల్గొనడం తెలుగు జర్నలిజానికి గర్వకారణంగా భావిస్తున్నారు.
దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగంలో సేవలందిస్తున్న భరత్ కుమార్ తన నిష్పాక్షిక జర్నలిజం, వాస్తవాల ఆధారంగా ప్రశ్నించే ధోరణి, సంపాదకీయ నాయకత్వంతో ప్రత్యేక గుర్తింపు పొందారు. రాజకీయాలు, పాలన, పార్లమెంట్ వ్యవహారాలు, ఎన్నికలు, సామాజిక అంశాలపై లోతైన విశ్లేషణలతో ఆయన తనదైన ముద్ర వేశారు.

సమాజ సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, ప్రజా అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందించడం, బాధ్యతాయుతమైన జర్నలిజంతో ప్రత్యేక గుర్తింపు పొందిన భరత్ కుమార్‌కు ఈ అంతర్జాతీయ ఆహ్వానం రావడం యువ జర్నలిస్టులకు స్ఫూర్తిదాయకమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో పార్లమెంట్ ఉభయ సభలకు శాశ్వత మీడియా పాస్ పొందిన తొలి జర్నలిస్టుగా గుర్తింపు పొందిన భరత్ కుమార్, భారత ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) అక్రిడిటేషన్ పొందిన తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల్లో ఒకరిగా నిలిచారు. 2008–2016 మధ్య సుప్రీంకోర్టు మీడియా పాస్ హోల్డర్‌గా కూడా పనిచేశారు.
దాదాపు ఎనిమిది సంవత్సరాలు న్యూఢిల్లీలో పనిచేస్తూ తెలంగాణ ఉద్యమం, సమైక్య ఆంధ్ర ఉద్యమం, పార్లమెంట్ సమావేశాలు, జాతీయ రాజకీయ పరిణామాలను ప్రత్యక్షంగా కవర్ చేశారు. నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు పలువురు జాతీయ రాజకీయ, సినీ, కార్పొరేట్ ప్రముఖులను ఇంటర్వ్యూ చేశారు.
ఎన్టీవీ, టీవీ9, వీ6 వంటి ప్రముఖ మీడియా సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన, 2021 డిసెంబర్ నుంచి జీ తెలుగు న్యూస్ చీఫ్ ఎడిటర్‌గా కొనసాగుతున్నారు.
సంపాదకీయ వ్యూహం, డిజిటల్ విస్తరణ, ప్రత్యేక కార్యక్రమాల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తూ, జీ తెలుగు న్యూస్‌ను వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలుగు వార్తా వేదికల్లో ఒకటిగా నిలపడంలో తన వంతు కృషి చేశారు.

“ప్రతిభకు సరిహద్దులు ఉండవు… నిబద్ధతతో చేసే జర్నలిజానికి ప్రపంచం గుర్తింపు ఇస్తుంది” అనే సందేశాన్ని ఈ ఆహ్వానం మరోసారి చాటిచెప్పిందని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ ఆహ్వానం వ్యక్తిగత గౌరవమే కాకుండా, తెలుగు జర్నలిజం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నదనడానికి మరో నిదర్శనంగా పలువురు అభిప్రాయపడుతున్నారు. యువ జర్నలిస్టులకు కష్టపడి పనిచేస్తే ప్రపంచ వేదికలపై కూడా గుర్తింపు లభిస్తుందనే స్ఫూర్తినిచ్చే సందర్భంగా భావిస్తున్నారు.
