👉 గురుపౌర్ణమి సందర్భంగా వేద పండితుడు మధు శంకర్ శర్మ దంపతులకు ఘన సన్మానం !
👉 దశాబ్దాలుగా ఉచితంగా వేద విద్య బోధిస్తున్న గురువుకు కృతజ్ఞతాభివందనం !
J.SURENDER KUMAR,
సనాతన ధర్మానికి, వేద సంస్కృతికి చిరునామాగా నిలిచిన జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో బుధవారం గురుపౌర్ణమి సందర్భంగా గురు-శిష్య పరంపరకు ప్రతీకగా నిలిచే అపూర్వ కార్యక్రమం జరిగింది. ప్రముఖ వేద పండితుడు, సంస్కృత విద్వాంసుడు మధు శంకర్ శర్మ దంపతులను ఆయన శిష్యులు వేద ఘోషలు, మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా సన్మానించి గురుభక్తిని చాటుకున్నారు.
చిన్నతనంలో స్వర్గీయ ఇందారపు నరహరి ఘనాపాటి వద్ద వేదాధ్యయనానికి శ్రీకారం చుట్టిన మధు శంకర్ శర్మ, అనంతరం సంస్కృతం, తెలుగులో ఉన్నత విద్యను అభ్యసించారు. ప్రభుత్వ పాఠశాలలో తెలుగు పండితుడిగా సేవలందిస్తూ విద్యార్థుల్లో భాషా పరిజ్ఞానంతో పాటు భారతీయ ఆచారాలు, సంస్కృతి, వినయ విధేయతలు, నైతిక విలువలను పెంపొందించేందుకు విశేష కృషి చేశారు.

ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడే తన ఇంటిలో ఉదయం, సాయంత్రం వేళ వేద విద్యను ఉచితంగా బోధించిన ఆయన, సెలవు రోజుల్లో గోదావరి తీరం వద్దనున్న ప్రాచీన గౌతమేశ్వర ఆలయ ప్రాంగణంలో కూడా శిష్యులకు వేద పాఠాలు చెప్పేవారు.
వేద బోధనతో పాటు ప్రభుత్వ పాఠశాలలో అనేక మంది విద్యార్థుల్లో భాషాపటిమ, ఆచార-సాంప్రదాయాల పట్ల అవగాహన, వినయ విధేయతలు, భక్తి భావన, నైతిక విలువలను పెంపొందించడంలో ఆయన విశిష్ట సేవలు అందించారు.
విద్య అనేది కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాదని, సంస్కారం మరియు సద్గుణాలను పెంపొందించే సాధనమని ఆయన బోధన ద్వారా నిరూపించారు. పదవీ విరమణ అనంతరం పూర్తిస్థాయిలో వేద బోధనకే అంకితమై నిత్యం పదుల సంఖ్యలో విద్యార్థులకు శిక్షణ అందిస్తూ ధర్మపురి వేద సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

మధు శంకర్ శర్మ వద్ద విద్యాభ్యాసం చేసిన అనేక మంది శిష్యులు ప్రస్తుతం దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు అమెరికా సహా విదేశాల్లోనూ పౌరోహిత్యం నిర్వహిస్తూ ప్రముఖ వేద పండితులుగా గుర్తింపు పొందడం ఆయన గురుత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది.
గురుపౌర్ణమి సందర్భంగా శిష్యులు శర్మ దంపతులను వారి నివాసం నుంచి బ్రాహ్మణ సంఘ భవనం వరకు సాంప్రదాయబద్ధంగా ఊరేగింపుగా తీసుకువచ్చారు. వేద మంత్రోచ్చారణ మధ్య జ్యోతి ప్రజ్వలన, గణపతి పూజ, గురుపూజ నిర్వహించిన అనంతరం పాదపూజ చేసి, గజమాల, పట్టు వస్త్రాలు, శాలువాతో ఘనంగా సత్కరించారు. సువర్ణ అంగుళీయకాన్ని, సన్మాన పత్రాన్ని బహుకరిస్తూ గురువుపై తమ కృతజ్ఞతను వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో వేద పండితులు, ఆలయ అర్చకులు, శిష్యులు, అభిమానులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
