వర్షాలు కురిసి రైతులు సంతోషంగా ఉండాలి !

👉 కొండగట్టు ఆంజనేయ స్వామిని ప్రార్థించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !

👉 కొండగట్టు ఆంజనేయ స్వామి గిరిప్రదక్షిణలో పాల్గొన్న మంత్రులు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, ఎస్పీ!


J.SURENDER KUMAR,

రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలు, సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సంతోషంగా సుభిక్షంగా ఉండాలని ఆంజనేయ స్వామిని  మంత్రి లక్ష్మణ్ కుమార్ , ప్రజాప్రతినిధులు ప్రార్థించారు..

గురు వ్యాస పౌర్ణమి సందర్భంగా జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో జరిగిన గిరిప్రదక్షిణలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర  బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ఎస్పీ అశోక్ కుమార్ పాల్గొన్నారు.

బుధవారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తున్నప్పటికీ భక్తులతో కలిసి ప్రజాప్రతినిధులు గిరిప్రదక్షిణ పూర్తి చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజల ఆయురారోగ్యాలు, శాంతి, సుభిక్షం కోసం ప్రార్థించారు.

👉 ఈ సందర్భంగా  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ….

కొండగట్టు ఆంజనేయ స్వామి మహిమ అపారమని, ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు భక్తిశ్రద్ధలతో గిరిప్రదక్షిణలో పాల్గొంటారని అన్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులకు మంచి పంటలు పండాలని, ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు.

👉   మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ…

గురు వ్యాస పౌర్ణమి సందర్భంగా కొండగట్టు గిరిప్రదక్షిణలో పాల్గొనడం ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత పురోగతి సాధించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కల్పించిందన్నారు.

👉 ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ…

తెలంగాణలోని అత్యంత పవిత్రమైన ఆంజనేయ క్షేత్రాల్లో కొండగట్టు ఒకటని అన్నారు. భక్తుల విశ్వాసానికి నిలయమైన ఈ క్షేత్రానికి ప్రభుత్వం అవసరమైన సౌకర్యాలను మరింత మెరుగుపరిచే దిశగా కృషి చేస్తోందన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.

👉 చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ..

ప్రకృతి అనుకూలించి రైతులు పంటలతో సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వేలాదిగా భక్తులు పాల్గొనడం వారి అపారమైన భక్తికి నిదర్శనమన్నారు.


👉 జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ….


గురు వ్యాస పౌర్ణమి గిరిప్రదక్షిణకు విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేసిందన్నారు. తాగునీరు, వైద్య సేవలు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. వర్ష పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అధికారులు నిరంతరం అప్రమత్తంగా పనిచేశారని, భక్తులు సురక్షితంగా దర్శనం చేసుకునేలా అన్ని ఏర్పాట్లు కల్పించినట్లు వెల్లడించారు. భక్తుల సహకారంతో కార్యక్రమం విజయవంతంగా కొనసాగిందని తెలిపారు. ఈ ప్రదక్షిణలో జగిత్యాల ఆర్డీవో మధు సూదన్, స్థానిక ప్రజా ప్రతినిధులు, పూజరులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.