👉దివ్యాంగ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు !
👉 తెలంగాణ డిఫరెంట్లీ ఎబుల్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సేవలను ప్రశంసనీయం !
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
రాష్ట్రంలో సంక్షేమ పాలనను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దివ్యాంగ ఉద్యోగులతో ప్రత్యక్షంగా సమావేశమై వారి సమస్యలు వినడం, పరిష్కారానికి హామీ ఇవ్వడం రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. దివ్యాంగుల సంక్షేమం, సాధికారత విషయంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.
దివ్యాంగ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దివ్యాంగుల హక్కుల పరిరక్షణతో పాటు సమాన అవకాశాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ డిఫరెంట్లీ ఎబుల్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని ప్రకాశం హాల్‌లో నిర్వహించిన దివ్యాంగ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం, కృతజ్ఞత సభకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ….

దివ్యాంగులు అన్ని రంగాల్లో తమ ప్రతిభతో సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ డిఫరెంట్లీ ఎబుల్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.
👉 దివ్యాంగుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. అర్హులైన దివ్యాంగులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు, స్కూటీలు, ట్రైసైకిళ్లు, ల్యాప్‌టాప్‌లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
👉 ఉపాధి, విద్య, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాలను మరింత విస్తరించి, దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేలా అన్ని విధాలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
అనంతరం అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను ఘనంగా సన్మానించి, దివ్యాంగ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించిన వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర నాయకులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన దివ్యాంగ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
