👉 90 మంది దివ్యాంగులకు నియో ఫ్లై బోల్ట్ పవర్ వీల్‌చైర్ల పంపిణీ !
👉 దివ్యాంగుల సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది !
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
దివ్యాంగులను జాలి చూపాల్సిన వారిగా కాకుండా, సమాజంలో సమాన హక్కులు కలిగిన పౌరులుగా గుర్తించి గౌరవించాలని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. దివ్యాంగులకు అవకాశం, ఆత్మవిశ్వాసం, అందుబాటు సౌకర్యాలు కల్పించడమే నిజమైన సామాజిక బాధ్యత అని ఆయన మంత్రి అన్నారు.
హ్యుందాయ్ మొబిస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్‌గూడ మహమూద్ ప్యారడైజ్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన “యాక్సెసిబిలిటీ అండ్ ఫ్రీడమ్” కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన 90 మంది దివ్యాంగులకు నియో ఫ్లై బోల్ట్ పవర్ వీల్‌చైర్లను పంపిణీ చేశారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…….

దివ్యాంగుల సంక్షేమం, విద్య, ఉపాధి, స్వయం ఉపాధి, సామాజిక భద్రత, సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. దివ్యాంగులు సమాజంలో స్వయం సమృద్ధితో, ఆత్మగౌరవంతో జీవించేలా ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.
👉 కార్పొరేట్ సంస్థలు తమ సామాజిక బాధ్యతలో భాగంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని మంత్రి అన్నారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామిక సంస్థలు కూడా దివ్యాంగుల అభివృద్ధికి చేయూతనిస్తే మరింత సమగ్ర సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని చెప్పారు.
👉 దివ్యాంగులకు అత్యంత అవసరమైనది సానుభూతి కాదు… సమానత్వం, గౌరవం, అవకాశాలే. వారిని ప్రత్యేక వ్యక్తులుగా కాకుండా సమాన హక్కులు కలిగిన పౌరులుగా గుర్తించి ప్రోత్సహించినప్పుడే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సోషల్ వర్కర్ చిన్న శ్రీశైలం యాదవ్, జాతీయ దివ్యాంగుల హక్కుల సంఘం అధ్యక్షుడు తుడుం రాజేందర్, దివ్యాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షఫీ అహ్మద్ ఖాన్, ప్రభాంజన్, సీఎస్ఆర్ జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.
