గిరిజన సమగ్రాభివృద్ధికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట !

👉 విద్య–ఉపాధి–మౌలిక వసతుల కలయికతో గిరిజన సంక్షేమానికి కొత్త దిశ !

👉 అచ్చంపేటలో ₹12.70 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణతో కలిసి శ్రీకారం !


J.SURENDER KUMAR,


గిరిజన ప్రాంతాల అభివృద్ధిని కేవలం సంక్షేమ పథకాల అమలుకే పరిమితం చేయకుండా, విద్య, ఉపాధి, మౌలిక వసతులు, ఆర్థిక సాధికారతను సమన్వయం చేస్తూ సమగ్రాభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్న సంకేతాలు అచ్చంపేట పర్యటనలో కనిపించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధిని రాష్ట్ర ప్రగతిలో కీలక భాగంగా భావిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.


మంగళవారం అచ్చంపేట నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణతో కలిసి మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. ఆర్టికల్–273(1) గ్రాంట్‌తో పాటు ప్రధానమంత్రి ధర్తి ఆబా జనజాతి గ్రామ ఉత్కర్ష అభియాన్ (PM DA–JGUA) పథకం కింద సుమారు ₹12.70 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పనులకు శ్రీకారం చుట్టారు.

👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ……..

గతంలో గిరిజన ప్రాంతాలు మౌలిక సదుపాయాల కొరతతో వెనుకబడి ఉండేవని, ప్రస్తుతం ప్రభుత్వం గిరిజన సంక్షేమాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్తోందన్నారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య, సురక్షితమైన వసతి, ఆధునిక మౌలిక వసతులు కల్పించడమే కాకుండా, గిరిజన కుటుంబాలకు స్థిరమైన ఆదాయ వనరులు సృష్టించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు.

👉 మన్ననూర్ పీవీటీజీ బాలుర గురుకుల జూనియర్ కళాశాలలో అదనపు తరగతి గదులు, కిచెన్-కమ్-డైనింగ్ హాల్, టాయిలెట్ బ్లాక్, మన్ననూర్ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ప్రహరీ గోడ, కిచెన్-కమ్-డైనింగ్ హాల్, ఉడిమిల్ల గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో డార్మిటరీ, అదనపు తరగతి గదులు, ప్రహరీ గోడ, స్టోరేజ్ సంప్‌తో పాటు అచ్చంపేట, ఇనోల్, బాణాల, చెంచుగూడెం గిరిజన విద్యాసంస్థల్లో ప్రహరీ గోడల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు.

👉 మన్ననూర్‌లో ట్రైబల్ మల్టీపర్పస్ మార్కెటింగ్ సెంటర్, షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటుతో గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు మధ్యవర్తుల దోపిడీ తగ్గి గిరిజన కుటుంబాల ఆదాయం పెరుగుతుందని మంత్రి తెలిపారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా విస్తరిస్తాయని పేర్కొన్నారు విద్యనే సామాజిక మార్పుకు ప్రధాన సాధనంగా భావిస్తున్న ప్రభుత్వం గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలను ఆధునికీకరిస్తోందని మంత్రి చెప్పారు.

👉 ఈ పనులు పూర్తయిన తర్వాత విద్యార్థులకు మెరుగైన తరగతి గదులు, సురక్షితమైన వసతి, పరిశుభ్రమైన భోజనశాలలు, తాగునీటి, పారిశుధ్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

👉 సమీక్ష సమావేశం లో..

అనంతరం సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, దివ్యాంగుల సంక్షేమ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్న ఈ సమావేశంలో ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు, సిబ్బంది కొరత, బోధన సంబంధిత సమస్యలపై అధికారులను నేరుగా ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.