పిఎంఏవై జి కింద 11 లక్షల ఇళ్లను కేటాయించండి !

👉 కేంద్ర మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌ కు ముఖ్య‌మంత్రి .రేవంత్ రెడ్డి విజ్ఞప్తి !


J.SURENDER KUMAR,


తెలంగాణ‌కు ప్ర‌ధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G) కింద 11.56 లక్షల ఇండ్ల‌ను కేటాయించాల‌ని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్య‌వ‌సాయ శాఖ మంత్రి  శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌ కి ముఖ్య‌మంత్రి .రేవంత్ రెడ్డి  విజ్ఞ‌ప్తి చేశారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన త‌ర్వాత పేద‌ల‌కు సొంత ఇల్లు నిర్మించి ఇవ్వ‌డానికి అధిక ప్రాధాన్య‌త ఇస్తున్న‌ విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు.


👉 ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి  పలువురు ఎంపీలతో కలిసి మంగళవారం కృషి భ‌వ‌న్ లో కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణాన్ని వివ‌రించారు. గత ప్రభుత్వం PMAY-G ను వినియోగించుకోక‌పోవ‌డంతో రాష్ట్రంలో గ‌త ప‌దేళ్లు పేద‌లు సొంత ఇండ్లు నిర్మించుకోలేకపోయారని, ఇప్పుడు తీవ్ర డిమాండ్ నెల‌కొంద‌ని తెలిపారు.


👉 కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ రూపొందించిన ఆవాస్ ప్లస్ (Awaas+) యాప్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిర్వ‌హించిన స‌ర్వేలో 11,56,915 అర్హులైన గ్రామీణ కుటుంబాలను గుర్తించిన‌ట్లు ముఖ్యమంత్రి  వివరించారు. సాధ్య‌మైనంత త్వ‌రగా తెలంగాణ‌కు ఇండ్లు కేటాయించాల‌ని కేంద్ర మంత్రిని కోరారు.


👉 ఎల్‌నినో, తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేప‌థ్యంలో విక‌సిత్ భార‌త్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ)లో (వీబీ జీ రామ్ జీ) అద‌న‌పు ప‌నులను చేర్చాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. వ‌ర్షాభావంతో ప‌నులు లేనందున ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులు, రైతు కూలీల‌కు జీవ‌నోపాధులు మెరుగుప‌ర్చేందుకు, పంటల వైవిధ్యీకరణ ప్రోత్సాహానికి అద‌న‌పు ప‌నులను చ‌ట్టంలో చేర్చాల‌ని కోరారు.


👉 రైతులు త‌మ భూముల్లో కూర‌గాయ‌ల పందిళ్లు, ప‌శుగ్రాస ప్లాట్ల అభివృద్ధి, మల్బరీ తోటల సాగు, పట్టు పురుగుల పెంపకం షెడ్లు, ఇళ్ల స‌మీపంలో ఆకు కూర‌లు, కూర‌గాయ‌ల తోట‌లు, వెదురు వ‌నాలు పెంచుకునే ప‌నులను వీబీ జీ రామ్ జీలో చేర్చాల‌ని కేంద్ర మంత్రికి విజ్ఞ‌ప్తి చేశారు.


👉 కొండ ప్రాంతాల‌తో పాటు కొండ వాలుల్లో నీటి నిల్వ చేసుకునే కంద‌కాలు, ఇప్పటికే ఉన్న ప్లాంటేషన్లు, పండ్ల తోటల్లో తేమ ర‌క్ష‌ణ‌కు కంద‌కాల నిర్మాణం, వ‌ర‌ద‌లు, ఇసుక మేట‌ల‌తో దెబ్బ‌తిన్న భూముల పున‌రుద్ధ‌ర‌ణ‌కు అవ‌స‌ర‌మైన ప‌నులు వీబీ జీ రామ్ జీలో చేప‌ట్టాల‌ని కోరారు.


👉 ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు నిర్మాణ స‌మ‌యంలో 90 రోజుల వరకు ప‌నులు చేసే అవ‌కాశం ఉండేద‌ని ముఖ్యమంత్రి  గుర్తుచేశారు. వీబీ జీ రామ్ జీ లోనూ అందుకు అనుమ‌తి ఇప్పించాల‌ని కోరారు. స్థానిక అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించే ఇత‌ర ప‌నుల‌ను వీబీ జీ రామ్ జీలో చేర్చాల‌న్నారు.


👉 ముఖ్య‌మంత్రి వెంట ఎంపీలు ఎం అనిల్ కుమార్ యాదవ్ , వేం నరేందర్ రెడ్డి , డాక్ట‌ర్ మల్లు రవి , పోరిక బలరాం నాయక్ , సురేష్ షేట్కార్, చామ‌ల కిరణ్ కుమార్ రెడ్డి , రామసహాయం రఘురాం రెడ్డి , గడ్డం వంశీ కృష్ణ, ఎక్స్-అఫిషీయో స్పెష‌ల్ సెక్ర‌ట‌రీ రామ‌కృష్ణారావు, సెక్ర‌ట‌రీ కో-ఆర్డినేష‌న్ అద్వైత్ కుమార్ సింగ్ లు ఉన్నారు.