👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J SURENDER KUMAR,
రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం, పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని మున్నానూరు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాన్ని స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణతో కలిసి మంగళవారం మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
👉 ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులతో నేరుగా ముఖాముఖి మాట్లాడారు…

వారికి అందుతున్న ఆహారం నాణ్యత, వసతి, తాగునీరు, ఇతర సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో స్వయంగా అడిగి తెలుసుకుంటూ వారి అభిప్రాయాలను శ్రద్ధగా విన్నారు.

అనంతరం విద్యాలయంలోని వంటశాల (కిచెన్), డైనింగ్ హాల్, స్టోర్‌రూమ్, తాగునీటి సౌకర్యాలు, పరిసర ప్రాంతాలను మంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు. కొన్ని చోట్ల అపరిశుభ్ర వాతావరణం కనిపించడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి, పరిశుభ్రత విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ప్రిన్సిపాల్‌కు పలు సూచనలు చేశారు.
👉 సాయంత్రం లోపు సమస్యల పరిష్కరించండి !

ఈసందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్. జాయింట్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) దేవసహాయంకు మంత్రి ఆదేశాలు జారీ చేస్తూ, డైనింగ్ హాల్‌కు సంబంధించిన మరమ్మత్తులు, తాగునీటి సమస్యలు, ఇతర చిన్నచిన్న లోపాలను అత్యవసరంగా సాయంత్రం వరకు పరిష్కరించాలని సూచించారు. సాయంత్రం కల్లా అన్ని సమస్యలను పరిష్కరించి, తీసుకున్న చర్యలపై పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
👉 విద్యార్థులకు నాణ్యమైన భోజనం, పరిశుభ్రమైన వాతావరణం, మెరుగైన వసతి కల్పించడంలో ఎలాంటి రాజీ ఉండదని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల అభివృద్ధికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని, విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. ఈ తనిఖీలో జిల్లా అధికారులు, గురుకుల విద్యాసంస్థల అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
