కూరగాయల సాగును ప్రోత్సహించాలి !

👉 సీఎం రేవంత్ రెడ్డి !

J .SURENDER KUMAR,

రాష్ట్రంలో ఆరుతడి పంటలు ప్రధానంగా కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖతో కలిసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  చెప్పారు. ఇందుకు అవసరమైన విత్తనాలను సబ్సిడీపై అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

👉 రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి. చిన్నా రెడ్డి  నేతృత్వంలోని నిపుణుల కమిటీ రూపొందించిన నివేదికను ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి కి అందించారు.


👉 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు కొత్తగా నిర్మిస్తున్న సెంట్రలైజ్డ్ కిచెన్ పరిసర ప్రాంతాల్లో కూరగాయల సాగుపై ఎక్కువ దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  సూచించారు.


👉 ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలు, ఇతర పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. రైతులు పండించిన పంటలను నేరుగా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ శాఖ నుంచి ఎక్స్టెన్షన్ అధికారులను నియమించి, సంబంధిత విభాగాల్లో రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి  చెప్పారు.


👉 ఎల్‌నినో పరిస్థితులు, పంటలపై ప్రభావం, ఈ సీజన్‌లో తగ్గిన సాగు విస్తీర్ణం, వాటి వివరాలు, అత్యవసర కార్యాచరణ ప్రణాళికలను కమిటీ నివేదికలో ప్రస్తావించింది. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని పేర్కొంది. గ్రామాల వారీగా అత్యవసర ప్రణాళికలు రూపొందించి పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాలు, కూరగాయల పంటలను ప్రోత్సహించాలని పేర్కొంది.


👉 75 శాతం సబ్సిడీతో ఈ పంటలకు సంబంధించిన విత్తనాలను అందించాలని, ప్రత్యామ్నాయ పంటలకు కొత్త రుణాలు మంజూరు చేయాలని కమిటీ సూచించింది.


👉 వ్యవసాయ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తల ద్వారా రైతులకు సాంకేతిక సూచనలు అందించాలని, హైదరాబాద్ పరిసర గ్రామాల్లో కూరగాయల సాగును ప్రోత్సహిస్తూ రైతు బజార్లకు రవాణా సౌకర్యం కల్పించాలని నివేదికలో పేర్కొంది.


👉 గ్రామీణ ప్రాంతాల్లో డైరీ యూనిట్లను స్థాపించేందుకు ఆర్థిక సహాయం అందించాలని, అత్యవసర చర్యల అమలును పర్యవేక్షించేందుకు గ్రామస్థాయి బృందాలను ఏర్పాటు చేయాలని తెలిపింది.