రేవంత్ సర్కార్ మరో సంచలన నిర్ణయం !


👉 తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్’కు శ్రీకారం !


👉 ప్రతి కుటుంబానికి ఒకే అధికారిక డిజిటల్ గుర్తింపు !


👉 మీ సేవ ద్వారా రెండు రోజుల్లో ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ !


J.SURENDER KUMAR,


తెలంగాణలో కుటుంబ ఆధారిత పరిపాలనకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఒకే అధికారిక డిజిటల్ రికార్డు అందుబాటులో ఉండేలా ‘తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్’ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

👉 రెవెన్యూ శాఖ ఈనెల 25న విడుదల చేసిన G.O.Ms.No.172 ప్రకారం ఇకపై కుటుంబ సభ్యుల వివరాలను ఒకే రిజిస్టర్‌లో నమోదు చేసి, అవసరమైనప్పుడు మీ సేవ కేంద్రాల ద్వారా ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జారీ చేయనున్నారు.

25న ప్రభుత్వం జారీ చేసిన జీవో (ఫైల్ ఫోటో)

👉 రేషన్ కార్డు డేటాబేస్‌ను ఆధారంగా తీసుకుని కుటుంబ పెద్ద పేరు, సభ్యుల వివరాలు, వారి సంబంధం, జన్మతేదీ, ఆధార్ నంబర్, చిరునామా తదితర సమాచారంతో ఈ రిజిస్టర్ రూపొందుతుంది. దరఖాస్తు చేసిన రెండు పని దినాల్లో తహసీల్దార్ డిజిటల్ సంతకంతో సర్టిఫికెట్ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

👉 ప్రభుత్వ సేవల కోసం ఒకే కుటుంబానికి సంబంధించిన వివరాలను పలుమార్లు సమర్పించాల్సిన అవసరాన్ని తగ్గించడం, అన్ని శాఖల్లో ఒకే ప్రామాణిక కుటుంబ సమాచారాన్ని వినియోగించడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశ్యంగా ప్రభుత్వం పేర్కొంది.


👉 ఈ ఫ్యామిలీ రిజిస్టర్ ఆస్తి హక్కులు, వారసత్వ హక్కులు లేదా ప్రభుత్వ సంక్షేమ పథకాల అర్హతను నిర్ణయించే పత్రం కాదని G.Oలో స్పష్టంగా పేర్కొంది.


👉 రాజకీయంగా  కీలకం.!

రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో ‘కుటుంబం’ను పరిపాలనా యూనిట్‌గా మరింత బలోపేతం చేసే దిశగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు కనిపిస్తోంది. భవిష్యత్తులో కొత్త సంక్షేమ పథకాల అమలు, లబ్ధిదారుల గుర్తింపు, సేవల పంపిణీ వంటి అంశాల్లో ఈ డిజిటల్ ఫ్యామిలీ రిజిస్టర్ కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరిపాలనా సంస్కరణగా మొదలైన ఈ వ్యవస్థ, రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాలనా విధానంలో కీలక మార్పులకు నాంది కావచ్చనే చర్చ అధికార వర్గాల్లో వినిపిస్తోంది.