ప్ర‌శ్నప‌త్రాల లీకేజీల‌ కారకులను కఠినంగా శిక్షించాలి!

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !


J SURENDER KUMAR,


ప్ర‌శ్న ప‌త్రాల లీకేజీల‌కు కారణమైనవారిని కఠినంగా శిక్షించాల‌ని ముఖ్య‌మంత్రి  రేవంత్ రెడ్డి  అన్నారు. పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించినప్పుడు పెద్దగా సమస్యలు ఉత్పన్నం కాలేదని, ఆఫ్‌లైన్‌లో నిర్వహించినప్పుడే సమస్యలు వస్తున్నాయ‌ని పేర్కొన్నారు.


👉 ఢిల్లీలో కేంద్ర మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌ ను క‌లిసిన అనంత‌రం ముఖ్యమంత్రి  మీడియాతో మాట్లాడారు. అనుమ‌తి లేకుండానే దేశంలో కోచింగ్ కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయ‌ని, అవి ప్రశ్నాపత్రాలు లీక్ కావడానికి వేదికలుగా మారుతున్నాయ‌ని వ్యాఖ్యానించారు.


👉 ఈ విష‌యంలో దేశస్థాయిలో ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరమున్నద‌ని ముఖ్యమంత్రి  అభిప్రాయ‌ప‌డ్డారు. యూనివర్సిటీల మీద ఆధిపత్యం చెలాయించాలనే ప్ర‌య‌త్నాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని సూచించారు.


👉 విద్య‌ను వీలైనంతవరకు రాష్ట్రాల పరిధిలోనే ఉంచితే తప్పిదాలకు అవకాశం త‌క్కువ‌గా ఉంటుంద‌ని, ఈ అంశంపై పార్ల‌మెంట్‌లో చర్చ జరగాల్సి ఉంద‌న్నారు.


👉 యూపీఎస్సీ విధానంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేసి నియామకాలు చేపట్టడంతోనే తాము పారదర్శకంగా పరీక్షలను నిర్వహించామ‌ని తెలిపారు. విద్యార్థులకు నష్టం వాటిల్ల‌కుండా, వారికి నమ్మకం, విశ్వాసం కలిగించేలా పార‌ద‌ర్శ‌కంగా పరీక్షలు నిర్వహిస్తున్న‌ట్లు చెప్పారు.


👉 గ్లోబరీనా వంటి సంస్థలు నాడు అక్రమాలకు పాల్పడినా చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంతో వాళ్లు సీబీఎస్ఈ పరీక్ష‌ల వ‌ర‌కు విస్త‌రించి, వాటిని గంద‌ర‌గోళం చేశార‌ని విమ‌ర్శించారు. ఇలాంటి సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంద‌న్నారు.


👉 ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన అంశంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ సాగుతోంద‌ని తెలిపారు. గత ప్రభుత్వం బకాయిలే భారంగా మారాయ‌ని, అయినా అన్ని స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని చెప్పారు. భవిష్యత్తులో ఏ సంవత్సరానికి సంబంధించిన ఫీజుల మొత్తం అదే సంవత్సరంలో పూర్తిగా చెల్లిస్తామ‌ని, ముందస్తుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు.


👉 రాష్ట్రంలో ప్రతి ఏటా ₹ 2,200 కోట్ల నుంచి ₹ 2,400 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అవసరమవుతాయ‌ని చెప్పారు. క్ర‌మం త‌ప్ప‌కుండా వాటిని చెల్లించేందుకు ప్ర‌భుత్వం ప్రణాళికలు రచించుకుంద‌ని, భవిష్యత్తులో ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్య రాష్ట్రంలో ఉండద‌ని స్ప‌ష్టం చేశారు.


👉 హైడ్రా (HYDRAA) కారాచరణపైనా, నిర్వహిస్తున్న బాధ్యతలపైనా ప్రభుత్వానికి స్పష్టత ఉంద‌ని ముఖ్యమంత్రి  తెలిపారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఇంకా పరిశీలించలేద‌ని, ప్రభుత్వపరంగా సమీక్షిస్తామ‌ని ఒక ప్ర‌శ్న‌కు బ‌దులిచ్చారు. కోర్టు ఆదేశాలను, న్యాయస్థానాన్ని గౌరవిస్తామ‌ని, అదేవిధంగా హైడ్రా కొనసాగిస్తున్న పనులను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.