సూపర్ ఎల్‌నినో ను కరోనా తరహాలో ఎదుర్కొందాం !

👉 ఆర్థిక సమస్యలుంటే నా దృష్టికి తీసుకురండి… నిర్లక్ష్యం చేసే అధికారులపై కఠిన చర్యలు !


👉 35% వర్షపాతం లోటు… ఆగస్టులోనూ వర్షాలు లేకపోతే తాగునీటికీ ఇబ్బందులు !


👉 కోరుట్ల నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J .SURENDER KUMAR,


సూపర్ ఎల్‌నినో ప్రభావాన్ని కరోనా మహమ్మారి తరహాలో అత్యంత అప్రమత్తతతో ఎదుర్కోవాలని, రైతులు వరి సాగును పూర్తిగా నివారించి తక్కువ నీటి అవసరమున్న ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు.

కోరుట్ల నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి పాల్గొన్నారు.

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ,….

ప్రస్తుతం సూపర్ ఎల్‌నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, అనేక దేశాలు తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. తెలంగాణలో ఇప్పటికే సుమారు 35 శాతం వర్షపాతం లోటు నమోదైందని, భూగర్భ జలాలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయని చెప్పారు. వాతావరణ శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూడా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.


👉 ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచే రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ శాఖ అధికారులు వరి సాగు చేయవద్దని రైతులకు గ్రామ స్థాయిలో విస్తృత అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. రైతులు పరిస్థితిని అర్థం చేసుకుని ప్రభుత్వం సూచిస్తున్న ప్రత్యామ్నాయ పంటల సాగుకు ముందుకు రావాలని కోరారు.


👉 రైతులు చిరు ధాన్యాలు, పొద్దుతిరుగుడు, కందులు, పెసర్లు, మినుములు, ఇతర పప్పుధాన్యాలు, కూరగాయలు, ఉద్యాన పంటలు వంటి తక్కువ నీటి అవసరమున్న పంటలను సాగు చేయాలని సూచించారు. తక్కువ నీటితో సాగయ్యే పంటలను ఎంచుకుంటే నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చని చెప్పారు. ఆయిల్‌పామ్ కూడా తక్కువ నీటి అవసరం ఉన్న పంటగా రైతులు పరిగణించాలని సూచించారు.


👉 రాష్ట్రంలోని అన్ని ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టాలు గణనీయంగా తగ్గిపోయాయని, ఆగస్టులో కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోతే సాగునీటితో పాటు తాగునీటి సమస్య కూడా తీవ్రమయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తాగునీటి రక్షణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అని తెలిపారు.


👉 ప్రస్తుతం ఎదురవుతున్న పరిస్థితి కరోనా సంక్షోభం మాదిరిగానే అత్యంత క్లిష్టమైనదని, అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థలు, ప్రజలు అందరూ సమన్వయంతో మిషన్ మోడ్‌లో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి నీటి బొట్టును వృథా చేయకుండా సమర్థవంతంగా వినియోగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.


👉 ప్రతి 15 రోజులకు ఒకసారి భూగర్భ జలాల పరిస్థితిపై సమగ్ర అధ్యయనం నిర్వహించి, వాస్తవ పరిస్థితిని రైతులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. పరిస్థితిని బట్టి రైతులు సరైన నిర్ణయాలు తీసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.


👉 ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహంలో గానీ, రైతులకు అవసరమైన విత్తనాలు, ఇతర ఏర్పాట్లలో గానీ ఏవైనా ఆర్థిక సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, వాటిని అత్యవసరంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.


👉 ప్రభుత్వ ఆదేశాల అమలులో ఇంజినీర్లు, అధికారులు లేదా సంబంధిత సిబ్బంది నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని, అవసరమైన విత్తనాలు, సాంకేతిక సలహాలు, ప్రభుత్వ సహాయ సహకారాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.


👉 ప్రస్తుతం బోర్లలో నీరు కనిపిస్తున్నప్పటికీ పంట చివరి దశ వరకు అది నిలిచే పరిస్థితి లేదని, రోజురోజుకూ భూగర్భ జలాలు తగ్గుతున్నందున వరి సాగు రైతులకు ప్రమాదకరంగా మారే అవకాశముందని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో వరి సాగును పూర్తిగా నివారించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.


👉 జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ,…


సూపర్ ఎల్‌నినో పరిస్థితుల్లో జిల్లాలో తాగునీటి సరఫరాను నిరంతరంగా కొనసాగించడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని తెలిపారు. ఈ సీజన్‌లో కాలువల ద్వారా సాగునీరు అందించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.

ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవసరమైన విత్తనాలను జిల్లాలో సమృద్ధిగా సిద్ధంగా ఉంచామని, రైతులు తక్కువ నీటి అవసరం ఉన్న పంటలనే ఎంపిక చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రతి దశలో రైతులకు అండగా ఉంటుందని తెలిపారు.


👉 గత ఏడాదితో పోలిస్తే భూగర్భ జలాలు గణనీయంగా తగ్గాయని, ప్రస్తుతం బోర్లలో నీరు ఉన్నప్పటికీ పంట పెరిగే సమయంలో నీటి కొరత ఏర్పడి దిగుబడులు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని కలెక్టర్ పునరుద్ఘాటించారు.


👉 కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ మాట్లాడుతూ…


, కోరుట్ల నియోజకవర్గంలో మెట్ పెల్లి మున్సిపల్ పరిధిలో నీటి ఎద్దడి అధికంగా ఉన్నదని నీటి కొరత తీర్చేందుకు కావాల్సిన ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని అన్నారు.
అదేవిధంగా ప్రజలకు సేవ్ వాటర్ నినాదం తో విస్తృత అవగాహనా కల్పించాలని అన్నారు. గ్రౌండ్ వాటర్ పెంచేవిధంగా ఇంకుడు గుంతల నిర్మాణాలు ప్రతి ఇంటికి నిర్మించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజగౌడ్, మెట్‌పల్లి ఆర్డీవో నరసింహరావు, మున్సిపల్ కమిషనర్లు, ఇరిగేషన్, మిషన్ భగీరథ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓలు), మున్సిపల్ చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.