‘సర్’లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

భారత ఎన్నికల సంఘం ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (SIR)లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం జగిత్యాల జిల్లా ఎండపెల్లి మండలంలోని ముంజంపల్లి, మారేడువెల్లి గ్రామాల్లో జరుగుతున్న SIR (సర్)ప్రక్రియను మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఓటరు నమోదు, వివరాల ధృవీకరణ పనులను అధికారులను అడిగి తెలుసుకుని, కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.

అనంతరం మారేడువెల్లి ప్రభుత్వ పాఠశాలలో ₹ 5 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన కిచెన్ షెడ్డును మంత్రి ప్రారంభించి విద్యార్థులతో కలిసి మొక్కను నాటారు.

👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,…..

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రతి పౌరుడికి కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు హక్కు అత్యంత కీలకమని, అందువల్ల ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ వివరాలను సక్రమంగా నమోదు చేయించుకోవాలని కోరారు.

రాష్ట్రంలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. క్షేత్రస్థాయిలో కార్యక్రమం ఎలా కొనసాగుతుందో తెలుసుకునేందుకే తాను స్వయంగా పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు అధికారులకు పూర్తి వివరాలు అందించి సర్ (SIR)ప్రక్రియను విజయవంతం చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎన్నికల సంఘం అధికారులు, సిబ్బందిని మంత్రి అభినందించారు. ప్రతి అర్హులైన ఓటరు తమ వివరాలను నమోదు చేయించుకుని ప్రజాస్వామ్య బలోపేతానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.