👉 ధర్మపురి ఫారెస్ట్ రేంజ్‌లో భారీ భూదందా జరిగిందా..?
👉 రెవెన్యూ అప్పగించిన భూముల్లో పట్టాదారులు ఎలా వచ్చారు..?
👉 రికార్డులు ఒకలా క్షేత్రస్థితి మరోలా సమగ్ర విచారణకు డిమాండ్ !
J SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా ధర్మపురి అటవీ రేంజ్ పరిధిలో వందలాది ఎకరాల అటవీ భూముల వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. రెవెన్యూ శాఖ అధికారికంగా అటవీశాఖకు అప్పగించిన భూముల్లో ప్రస్తుతం ప్రైవేట్ వ్యక్తుల పేర్లపై పట్టాదారు పాస్ పుస్తకాలు, సాగుభూములు కనిపిస్తుండటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ రికార్డులు, భూ హద్దులు, ధరణి నమోదులు, క్షేత్రస్థాయి పరిస్థితులను సమగ్రంగా పరిశీలిస్తే భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు, ప్రజా సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.
👉 రికార్డులు చెబుతున్న నిజాలు.!
ధర్మపురి మండలం మగ్గిడి గ్రామం పరిధిలో పాత సర్వే నంబర్-11, ప్రస్తుత సర్వే నంబర్-226లో 32.53 హెక్టార్లు (సుమారు 80 ఎకరాలు) భూమిని 2007 జనవరి 29న ధర్మపురి తహసీల్దార్ అధికారికంగా జగిత్యాల ఫారెస్ట్ రేంజ్ అధికారికి అప్పగించారు. ఈ ప్రక్రియలో నాటి అటవీశాఖ సెక్షన్ అధికారి సమక్షంలో సరిహద్దులు, పొడవు–వెడల్పులు, మ్యాప్‌లతో సహా పూర్తి ధ్రువీకరణ జరిగినట్లు అధికారిక రికార్డులు సూచిస్తున్నాయి.

అదే విధంగా గాదేపల్లి గ్రామం పరిధిలోని సర్వే నంబర్ 274/1లో 107.13 హెక్టార్లు (సుమారు 267 ఎకరాలు) ప్రభుత్వ భూమిని 2008 అక్టోబర్ 22న రెవెన్యూ శాఖ అటవీశాఖకు అప్పగించింది. ఈ భూమికి సంబంధించిన అసలు సర్వే మ్యాప్‌లు, ఫీల్డ్ మెజర్‌మెంట్ బుక్స్ (FMB), హద్దుల వివరాలు కూడా అప్పగించినట్లు సమాచారం.
.👉 పట్టాదారులు ఎలా వచ్చారు..?
రెవెన్యూ శాఖ అధికారికంగా అటవీశాఖకు అప్పగించిన ఈ భూముల్లో ప్రస్తుతం కొందరి పేర్లపై పట్టాదారు పాస్‌పుస్తకాలు ఉండటం, సాగు జరుగుతుండటం అనేక సందేహాలకు తావిస్తోంది. అటవీ భూమి ప్రైవేట్ భూమిగా ఎలా మారింది? ఎవరి అనుమతితో ధరణి పోర్టల్‌లో నమోదులు జరిగాయి? అసలు భూముల స్వరూపం మార్చబడిందా? లేక రికార్డుల్లో మార్పులు జరిగాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

👉 ధరణి వ్యవస్థను అడ్డుపెట్టుకుని అక్రమాలా..?
ధరణి పోర్టల్ అమలులోకి వచ్చిన తర్వాత కొందరు అవినీతి అధికారులు ప్రభుత్వ భూములను ప్రైవేట్ భూములుగా నమోదు చేయించి ఉండవచ్చనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ, అటవీశాఖల అసలు రికార్డులు, FMBలు, సర్వే స్కెచ్‌లు, ధరణి నమోదులను పరస్పరం సరిపోల్చితే అసలు వాస్తవాలు బయటపడే అవకాశం ఉందని భూ వ్యవహారాలపై అవగాహన ఉన్నవారు చెబుతున్నారు.
👉 రింగ్ రోడ్డు నష్టపరిహారంగా కేటాయించిన భూములే..!
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో మంథని నియోజకవర్గంలో రింగ్ రోడ్డు నిర్మాణం వల్ల కోల్పోయిన అటవీ విస్తీర్ణానికి ప్రత్యామ్నాయంగా ధర్మపురి మండలంలోని ఈ వందలాది ఎకరాల భూమిని అటవీశాఖకు ప్రభుత్వం కేటాయించినట్లు సమాచారం దీనికి సంబంధించిన SE/R&B/Circle/ KNR/2694 /TS/T1/ MMKK Road/SEK/2008 రికార్డులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
👉 అటవీశాఖ నిర్లక్ష్యమే కారణమా..?
చిన్నచిన్న అభివృద్ధి పనులకు కూడా అటవీ క్లియరెన్స్ తప్పనిసరి అని చెప్పే అటవీశాఖ, తమ శాఖకు చెందిన వందల ఎకరాల భూముల పరిరక్షణలో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భూములపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరిగి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
👉 సమగ్ర విచారణ జరగాల్సిందే..!
ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, ఉన్నత అటవీశాఖ అధికారులు, రెవెన్యూ శాఖ ప్రత్యేక బృందంతో విచారణ జరిపి—అసలు భూముల హద్దులు ఏమిటి ? ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉన్నాయి ? పట్టాదారు పాస్‌పుస్తకాలు ఎలా జారీ అయ్యాయి ?
ప్రభుత్వానికి ఎంత భూమి నష్టం జరిగింది ?
ఇందులో బాధ్యులెవరు ? అనే అంశాలను వెలికితీయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిజంగా అటవీ భూములు అక్రమంగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లి ఉంటే, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని భూములను తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.
