👉 వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి తక్కువ నీటితో పండే పంటలపై అవగాహన కల్పించాలి !
👉 ఎల్ నినో ప్రభావంపై నల్గొండ జిల్లా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ఇంచార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ప్రస్తుతం పడుతున్న చిరు జల్లులను చూసి రైతులు తొందరపడి ఎక్కువ నీటి అవసరమయ్యే పంటల వైపు వెళ్లవద్దని,రైతులు, ప్రజలను కాపాడుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే ఈ ప్రకృతి విపత్తును సమర్థవంతంగా ఎదుర్కోగలమని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మరియు నల్గొండ జిల్లా ఇంచార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ఎల్ నియో ప్రభావంపై ఉమ్మడి నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో చేపట్టాల్సిన చర్యలు, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం, తాగునీరు, సాగునీటి నిర్వహణతో పాటు ఇతర సంబంధిత అంశాలపై నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సంక్షేమ శాఖ మంత్రి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు రాష్ట్ర మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మూడు జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ, ఉద్యానవన, నీటిపారుదల, పశుసంవర్ధక తదితర శాఖల ఉన్నతాధికారులు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.
👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..

రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలను ఇప్పటికే ప్రారంభించిందన్నారు. గత ఏప్రిల్ నెల నుంచే రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల్లో క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న రైతు నేస్తం కార్యక్రమాలు, గ్రామసభల ద్వారా రైతులకు సూపర్ ఎల్‌నినో పరిస్థితులపై విస్తృత అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రకృతి పరిస్థితులను ముందుగానే రైతులకు వివరించి నష్టాలను తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.
👉 ఎల్-నినో ప్రభావంతో ఏర్పడే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోందని తెలిపారు. రైతులు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకునేలా వ్యవసాయ శాఖ అధికారులు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.

👉 విత్తనాలు, ఎరువులు, సాగునీటి నిర్వహణ, తాగునీటి సరఫరా, పశుగ్రాసం వంటి అంశాలపై ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
👉 ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా పనిచేయాలని, మూడు జిల్లాల అధికారులు పరస్పర సమన్వయంతో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ సూచించారు.
