విద్యార్థులకు సమస్యలు లేకుండా పనిచేయాలి !

👉మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !


  J .SURENDER KUMAR ,    

   
విద్యార్థులకు, విద్యా సంస్థలలో సమస్యలు లేకుండా ఉపాధ్యాయులు, సంబంధిత యంత్రాంగం అప్రమత్తంగా  ఉంటూ విద్యార్థుల సంక్షేమం కోసం పనిచేయాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  అన్నారు.

ధర్మపురి నియోజకవర్గ వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లె తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో మంత్రి లక్ష్మణ్ కుమార్  మంగళవారం సందర్శించారు.

గత కొన్ని రోజులుగా విద్యార్థులు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని ఉపాధ్యాయులు  మంత్రి  లక్ష్మణ్ కుమార్ కు తెలిపారు.  వెంటనే స్పందించిన మంత్రి యుద్ధ ప్రాతిపదికన  సమస్య పరిష్కారానికి  బోర్‌వెల్ పనులకు భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.

₹10 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన కిచెన్ షెడ్‌ను ప్రారంభించి విద్యార్థుల అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా విద్యార్థులు తమ పాఠశాలలో క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని మంత్రిని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మంత్రి  విద్యార్థులతో స్నేహపూర్వకంగా మాట్లాడుతూ  వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో అందుతున్న భోజనం నాణ్యత, విద్యా బోధన తదితర అంశాలపై ప్రత్యేకంగా ఆరా తీశారు.

విద్యార్థులకు భోజనం, చదువు విషయంలో ఎలాంటి లోపాలు, ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సౌకర్యాలు కల్పించాలని  ప్రిన్సిపాల్‌కు మంత్రి  ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతుల కల్పనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.