J.SURENDER KUMAR,
అంగరంగ వైభవంగా సాగుతున్న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున జగన్మాతకు బోనం, పట్టువస్త్రాలు సమర్పించారు.
శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల (లష్కర్ బోనాలు) పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ఆది పరాశక్తి, జగజ్జనని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దివ్య కరుణాకటాక్షాలు అందరిపైన ఉండాలని కోరుకున్నారు.

ఈ పవిత్ర బోనాల మహోత్సవం ప్రతి భక్తుని జీవితంలో ఆనందం, ఆధ్యాత్మిక చైతన్యం, శుభసంకల్పాలు నింపాలని కోరుకున్నారు. భక్తిశ్రద్ధలతో సమర్పించే ప్రతి బోనం అమ్మవారికి ప్రీతికరమై, ప్రతి ఇంటిలో ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని సీఎం కోరుకున్నారు.

ముఖ్యమంత్రి తో పాటు మంత్రులు శ్రీమతి కొండా సురేఖ పొన్నం ప్రభాకర్ , శ్రీమతి దనసరి అనసూయ సీతక్క , పలువురు ప్రజాప్రతినిధులు లష్కర్ బోనాల జాతరలో పాల్గొన్నారు.
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల (లష్కర్ బోనాలు) పండుగ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ తన అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన విందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రితో పాటు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ విందులో పాల్గొన్నారు.
