👉 ట్రాన్స్‌జెండర్లను జాలితో కాదు – గౌరవంతో చూడాలి !
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ఒక మనిషిని అతని లింగ గుర్తింపుతో కాదు… అతని మనసుతో, మానవత్వంతో చూడగలిగినప్పుడే సమాజం అభివృద్ధి చెందినదిగా చెప్పుకోవచ్చనే సందేశాన్ని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మన సమాజంలో భాగమైన ట్రాన్స్‌జెండర్ల పట్ల అపోహలు, వివక్ష, దూరం కాకుండా ఆదరణ, ఆత్మీయత, సమాన గౌరవం చూపాలని మంత్రి పిలుపునిచ్చారు.
హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఆదివారం జరిగిన “LGBT – A Legal Battle” డాక్యుమెంటరీ 50 రోజుల విజయోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..
ఈ చిత్రం కేవలం ఒక డాక్యుమెంటరీ కాదని, సమాజ మనస్తత్వాన్ని ప్రశ్నించే అద్దమని పేర్కొన్నారు. చిన్ననాటి నుంచి పాఠశాలల్లో వేధింపులు, కళాశాలల్లో వివక్ష, కుటుంబాల నిరాకరణ, సమాజంలో అవమానాలు… విద్య, ఉద్యోగం, వైద్యం, గౌరవప్రదమైన జీవితం కోసం ట్రాన్స్‌జెండర్లు చేసే నిరంతర పోరాటాన్ని ఈ చిత్రం హృద్యంగా ఆవిష్కరించిందని మంత్రి వివరించారు.
👉 ట్రాన్స్‌జెండర్లను అర్థం చేసుకోవడం బదులు దూరం పెట్టే ధోరణి మారాలని, అలాంటి మార్పుకు ఈ తరహా చిత్రాలు సామాజిక చైతన్యానికి దోహదపడతాయని అన్నారు.
వాణిజ్య విజయాన్ని కాకుండా సమాజానికి అవసరమైన అంశాన్ని ఎంచుకుని ఈ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు సునీల్ రెడ్డి, నిర్మాతలు, కళాకారులు, సాంకేతిక బృందాన్ని మంత్రి అభినందించారు.

👉 ప్రతి ప్రేక్షకుడిలో మానవత్వం, సమానత్వం, సానుభూతి కాకుండా గౌరవ భావన పెంపొందించే ప్రయత్నమే ఈ డాక్యుమెంటరీ ప్రత్యేకత అని మంత్రి పేర్కొన్నారు.
👉 ట్రాన్స్‌జెండర్ల సంక్షేమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి వివరించారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ట్రాఫిక్, మెట్రో, HYDRAA హోంగార్డుల విభాగాల్లో ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు. ట్రాన్స్‌వుమన్ బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ శస్త్రచికిత్సకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ₹ 1.5 లక్షల లెటర్ ఆఫ్ క్రెడిట్ మంజూరు చేయడం వారి గౌరవప్రదమైన జీవితం పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు.
👉 విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, ఆరోగ్య సేవలు, సంక్షేమ పథకాలు, 2BHK గృహ పథకం వంటి అవకాశాలు కూడా అర్హులైన ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
👉 “ట్రాన్స్‌జెండర్లు వేరే సమాజం కాదు… మన సమాజంలో భాగమే. వారికి జాలి అవసరం లేదు… గౌరవం అవసరం. వివక్ష కాదు… అవకాశం కావాలి. అపోహలు కాదు… ఆప్యాయత కావాలి. ప్రతి ట్రాన్స్‌జెండర్ వ్యక్తి గౌరవంగా జీవించే సమాజ నిర్మాణం మనందరి బాధ్యత.” అని మంత్రి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు.
