👉 ధర్మపురి నూతన డిగ్రీ కళాశాలకు ఆమె పేరు పెట్టాలి !
👉 మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం !
👉 మంత్రి లక్ష్మణ్ కుమార్‌కు వినతి !
J.SURENDER KUMAR,
విద్యాభివృద్ధి కోసం దశాబ్దాల క్రితం ధర్మపురి పట్టణం నడిబొడ్డున దాదాపు ఐదు ఎకరాల విలువైన స్థలాన్ని దానం చేసిన శ్రీమతి మద్వాచారి రాధాబాయమ్మ సేవలను చిరస్మరణీయం చేయాలని ధర్మపురి మున్సిపల్ కౌన్సిల్ నిర్ణయించింది. ప్రస్తుతం మార్కెట్‌లో కోట్లాది రూపాయల విలువ చేసే ఆ స్థలాన్ని ప్రభుత్వ విద్యాసంస్థల కోసం అందించిన రాధాబాయమ్మ పేరును ధర్మపురిలో నూతనంగా మంజూరైన ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు పెట్టి ఆమెకు సముచిత గౌరవం కల్పించాలని కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానించింది..
ఈ మేరకు మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు గురువారం ధర్మపురి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను కలిసి తీర్మాన పత్రాన్ని అందజేశారు. నూతన డిగ్రీ కళాశాలకు శ్రీమతి మద్వాచారి రాధాబాయమ్మ డిగ్రీ కళాశాలగా నామకరణం చేయాలని వారు మంత్రిని కోరారు.
👉విద్య కోసం విలువైన స్థలం దానం !
ధర్మపురి ప్రముఖ పుణ్యక్షేత్రంగా, నియోజకవర్గ కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో విద్యాసంస్థల ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని దశాబ్దాల క్రితమే రాధాబాయమ్మ దానం చేయడం విశేషమని మున్సిపల్ చైర్ పర్సన్, కౌన్సిలర్లు పేర్కొన్నారు. నేటి మార్కెట్ విలువ ప్రకారం కోట్లాది రూపాయలు విలువ చేసే దాదాపు ఐదు ఎకరాల స్థలాన్ని విద్యా ప్రయోజనాల కోసం అందించడం ఆమె దూరదృష్టికి, సమాజం పట్ల ఉన్న బాధ్యతకు నిదర్శనమన్నారు.
ఆ స్థలంలో ప్రభుత్వ విద్యాసంస్థల ద్వారా ఎంతోమంది విద్యార్థులకు విద్య అందుతున్న నేపథ్యంలో, రాధాబాయమ్మ సేవలకు శాశ్వత గుర్తింపుగా నూతన డిగ్రీ కళాశాలకు ఆమె పేరు పెట్టాలని గారు మరోసారి మంత్రిని కోరారు.
👉 సేవకు గుర్తింపు.. తరతరాలకు స్ఫూర్తి !
విద్య కోసం ఆస్తిని దానం చేసిన రాధాబాయమ్మ పేరును విద్యాసంస్థకు పెట్టడం ద్వారా ఆమె సేవలను భవిష్యత్ తరాలకు పరిచయం చేసినట్లవుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. విద్య కోసం భూమిని దానం చేసిన దాతలకు గౌరవం లభిస్తే, సమాజ అభివృద్ధి కోసం మరింత మంది దాతలు ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
‘విద్య కోసం ఇచ్చిన భూమి.. తరతరాలకు అందించే వెలుగు’ అనే సందేశాన్ని చాటేలా నూతన డిగ్రీ కళాశాలకు ఆమె పేరు పెట్టాలన్న మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం ధర్మపురిలో ప్రాధాన్యత స్థానిక ప్రజలు ప్రశంసిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా గ్రంథాలయ చైర్మన్ సంగనబట్ల దినేష్, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
