సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆర్మీ సదరన్ కమాండ్ జనరల్ !

J SURENDER KUMAR,


ఆర్మీ సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్  పలువురు ఆర్మీ ప్రతినిధులతో ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి ని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి  కూడా ఉన్నారు.

👉 భారత ఆర్మీ చేపట్టే వివిధ నియామకాల్లో తెలంగాణ యువతను ప్రోత్సహించే విధంగా కలిసి పనిచేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  భారత ఆర్మీ సదరన్ కమాండ్ అధికారులకు తెలిపారు.


👉 ఆర్మీ నియామకాల్లో స్థానిక యువతకు భారీ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఆసక్తి ఉన్న అనువైన జిల్లా కేంద్రాల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  కోరగా లెఫ్టినెంట్ జనరల్ సుముఖత వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా నిర్వహించే వివిధ ఆర్మీ రిక్రూట్మెంట్లకు ముందస్తుగా తెలంగాణలోని ఆయా జిల్లా కేంద్రాల్లో యువతకు శిక్షణ కేంద్రాల ఏర్పాటు చేస్తామని తెలిపారు.


👉 దేశంలో విపత్తుల సమయంలో ఆర్మీ పోషిస్తున్న పాత్రను ముఖ్యమంత్రి  అభినందించారు. రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్లు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస చర్యల్లో ఆర్మీ యంత్రాంగం మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కోరారు.


👉 తెలంగాణలో విపత్తు పరిస్థితుల్లో ప్రత్యేకంగా చొరవ తీసుకునేలా స్థానిక ఆర్మీ అధికారులను ఆదేశిస్తానని రాజేష్ పుష్కర్  చెప్పారు.


👉 కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా చారిత్రక హైదరాబాద్ నగరానికి పూర్వవైభవాన్ని తేవాలన్న పట్టుదలతో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు చేపట్టడంపై లెఫ్టినెంట్ జనరల్  రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. హైదరాబాద్ నగరాన్ని రక్షించడానికి మూసీ నది ప్రక్షాళన అవసరమని అన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ ఎన్. శ్రీనివాస్ రావు , ఇతర ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.