ధర్మపురి గోదాంలో ₹4 కోట్ల ధాన్యం నిల్వలు!

👉 విజిలెన్స్ తనిఖీలతో బయటపడుతున్న కొత్త కోణాలు.
₹87 కోట్ల ధాన్యం మాయం సమగ్ర విచారణ రంగం సిద్ధం ?

👉 కస్టమ్ మిల్లింగ్ ధాన్యం అక్రమాల వెనుక అధికారుల పర్యవేక్షణ వైఫల్యమా ?


J. SURENDER KUMAR,

జగిత్యాల జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ప్రభుత్వానికి అప్పగించాల్సిన ధాన్యం పక్కదారి పట్టిందనే అనుమానాల నేపథ్యంలో విజిలెన్స్, ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.

ధర్మపురి మండలం బొదరగూడెంలోని ప్రభుత్వ గోదాంలో సుమారు 52 వేల ధాన్యం బస్తాలు, దాదాపు ₹4 కోట్ల, విలువైన నిల్వలు గుర్తించినట్లు సమాచారం.( దాదాపు ఒక బస్తా కు 40 కిలోలు లెక్కించిన ప్రభుత్వం చెల్లించే క్వింటాలు ఒక్కంటికి ₹ 2,200/- చొప్పున 4 కోట్ల 57, లక్షల 60 వేల వరకు ఉంటుంది ) ఇదే సమయంలో మూడు రైస్ మిల్లులపై జరిగిన తనిఖీల్లో మొత్తం ₹ 87 కోట్లకు పైగా ప్రభుత్వ ధాన్యం అక్రమాలకు గురైనట్లు ప్రాథమికంగా గుర్తించినట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

విజిలెన్స్ దర్యాప్తు పరిధిలోకి వచ్చిన మూడు రైస్ మిల్లుల్లో రికార్డులు, నిల్వలు, సీఎంఆర్ అప్పగింతల వివరాలను అధికారులు సరిపోల్చి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒక రైస్ మిల్ యజమానితో పాటు మరికొందరిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.

👉 ధాన్యం ఎలా కేటాయించారు ?

ఈ వ్యవహారంలో మరింత కీలకంగా మారుతున్న ప్రశ్న ప్రభుత్వ ధాన్యం డిఫాల్టర్లుగా నమోదైన మిల్లులకు మళ్లీ ధాన్యం కేటాయింపు ఎలా జరిగింది? అన్నదే. గతంలో బకాయిలు, కేసులు, ఇతర చర్యలు ఎదుర్కొన్న మిల్లులకు తిరిగి యాసంగి, వానాకాలం సీజన్లలో ప్రభుత్వ ధాన్యం కేటాయించడంలో ఏ ప్రమాణాలు అనుసరించారన్నది విచారణలో తేలాల్సి ఉంది.

మరోవైపు ప్రభుత్వ గోదాములనే లీజుకు తీసుకుని అక్కడ ప్రభుత్వ ధాన్యం నిల్వ చేసినట్లు విజిలెన్స్ తనిఖీల్లో బయటపడినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో సంబంధిత అధికారుల పర్యవేక్షణ, రికార్డు పరిశీలన, ధాన్యం కేటాయింపు ప్రక్రియపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

👉 ప్రభుత్వ సొమ్ముతో..

ప్రజల పన్నుల సొమ్ముతో కొనుగోలు చేసిన ధాన్యం భద్రత, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ విషయంలో ఎక్కడ లోపాలు జరిగాయి? నిల్వల తేడాలను సకాలంలో ఎందుకు గుర్తించలేదు? డిఫాల్టర్లకు మళ్లీ కేటాయింపులు జరిగి ఉంటే వాటికి ఎవరు బాధ్యత వహిస్తారు? వంటి ప్రశ్నలకు సమగ్ర విచారణ ద్వారానే సమాధానం లభించే అవకాశం ఉంది.

👉 అధికారుల పాత్ర పై…?


ఈ వ్యవహారంలో మిల్లర్ల బాధ్యతతో పాటు, సంబంధిత శాఖల అధికారుల పాత్ర, పర్యవేక్షణలో లోపాలు ఏమైనా ఉన్నాయా ? అనే అంశాలపై కూడా నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, రైతు సంఘాలు కోరుతున్నాయి.  ప్రజా ధనాన్ని కాపాడాలంటే ఈ కేసులో నిజానిజాలు పూర్తిగా వెలికితీయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.