👉 న్యూఢిల్లీలో కేంద్ర గిరిజన శాఖ మంత్రి జువాల్ ఓరాంను కలిసి విజ్ఞప్తి చేసిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
తెలంగాణ రాష్ట్ర గిరిజనుల సంక్షేమం, విద్యాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పలు కీలక అంశాల తో పాటు పెండింగ్ లో ఉన్న ₹ 522.05 కోట్ల నిధుల లో ₹ 452.05 కోట్ల పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ బకాయిలు, ₹ 70 కోట్ల అదనపు నిధులు, విడుదల చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డితో కలిసి న్యూఢిల్లీలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువాల్ ఓరాంను శుక్రవారం కలిసి సమగ్ర వివరాలతో వినతిపత్రం ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులను తక్షణమే విడుదల చేయాలని, గిరిజన సంక్షేమ పథకాలకు పూర్తి స్థాయిలో సహకారం అందించాలని మంత్రి కేంద్రాన్ని కోరారు.

👉 ప్రతిపాదనలు పంపించండి !
ఈ సందర్భంగా కేంద్రమంత్రి తెలంగాణ రాష్ట్రానికి విడుదల శాఖకు సంబంధించిన పెండింగ్ నిధులను మొత్తం మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు . కేంద్ర ప్రభుత్వం తెలియని ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలైన రోడ్లు ఇతర అవసరాల కోసం కేంద్రం నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉందని ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గిరిజన ప్రాంతాల లో రోడ్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపించాలని కేంద్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ లక్ష్మణ్ తో అన్నారు.
వీలైనంత త్వరగా హైదరాబాదులో గిరిజన సంక్షేమ శాఖ ఉన్నత అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని మంత్రి లక్ష్మణ్ కుమార్ కేంద్రమంత్రి కి వివరించడంతో ఆ సమావేశానికి తప్పకుండా హాజరవుతానని కేంద్రమంత్రి తెలిపారు.
👉 కేంద్ర మంత్రి కి సమర్పించిన వినతిపత్రంలో ప్రధాన అంశాలు !
👉 ఆర్టికల్–275(1) కింద అదనంగా ₹70 కోట్ల నిధులు విడుదల చేయండి!
ఆర్టికల్–275(1) కింద 2024–25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు ₹ 98.37 కోట్లు మంజూరయ్యాయని, అయితే 2025–26లో ₹ 35.26 కోట్లు, 2026–27లో ₹ 32.10 కోట్లు మాత్రమే మంజూరయ్యాయని మంత్రి వివరించారు. గతంతో పోలిస్తే నిధులు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని అదనంగా ₹70 కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు.
👉 ప్రధాన్ మంత్రి ఆది ఆదర్శ గ్రామ యోజన (PMAAGY) నిధుల విడుదల చేయండి !
గిరిజనులు అధికంగా నివసించే 428 గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం అమలవుతున్న PMAAGY పథకం కింద మిగిలిన ₹11.77 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తికావడానికి ఈ నిధులు అత్యంత అవసరమని వివరించారు.
👉 పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు ₹452.05 కోట్ల విడుదల చేయండి !
గిరిజన విద్యార్థుల ఉన్నత విద్యకు ఎలాంటి ఆటంకం కలగకుండా 2024–25, 2025–26 బకాయిలతో పాటు 2026–27 సంవత్సరానికి సంబంధించిన ప్రతిపాదనల మేరకు ₹ 452.05 కోట్ల కేంద్ర వాటాను (Second Mother Sanction) అత్యవసరంగా విడుదల చేయాలని మంత్రి కోరారు. నిధుల విడుదలలో జాప్యం వల్ల వేలాది మంది గిరిజన విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
👉 సంక్షేమానికి ప్రాధాన్యత..

ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, గిరిజన ప్రాంతాల్లో విద్య, మౌలిక సదుపాయాలు, సంక్షేమ కార్యక్రమాల విస్తరణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విస్తృత చర్యలు చేపడుతోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
తెలంగాణ అభివృద్ధికి అవసరమైన కేంద్ర సహాయాన్ని సానుకూలంగా పరిశీలించి పెండింగ్‌లో ఉన్న నిధులను వీలైనంత త్వరగా విడుదల చేయాలని కేంద్ర మంత్రి జువాల్ ఓరాంను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
