👉 ప్రజలపై రూపాయి భారం లేకుండా విద్యుత్ తీగల షిఫ్టింగ్‌కు ₹ 4 కోట్ల నిధులు !
👉 గొల్లపల్లి మండలానికి ₹.2.3 కోట్ల కేటాయింపు !
👉 కుటుంబాల భద్రత, రైతుల ప్రశాంత జీవనానికి ప్రభుత్వం అండ!
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ధర్మపురి నియోజకవర్గంలో ఏళ్ల తరబడి ఇళ్ల మీదుగా, వ్యవసాయ భూముల గుండా వెళ్లే హైటెన్షన్ విద్యుత్ తీగలతో భయభ్రాంతులకు గురవుతూ జీవిస్తున్న ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. కొత్త ఇల్లు నిర్మించుకోవాలన్నా, ఉన్న ఇంటికి మరో అంతస్తు వేయాలన్నా విద్యుత్ తీగల అడ్డంకితో ఎన్నో కుటుంబాలు తమ కలలను వాయిదా వేసుకున్నాయి. రైతులు కూడా తమ పొలాల్లో నిత్యం ప్రమాద భయంతోనే పనులు చేసేవారు.

ఈ సమస్యను గుర్తించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, తెలంగాణ ప్రభుత్వం, ప్రజలపై ఎలాంటి ఆర్థిక భారం మోపకుండా విద్యుత్ తీగల షిఫ్టింగ్‌కు అవసరమైన రుసుమును ప్రభుత్వ ఖజానా నుంచే చెల్లించడానికి నిధులు మంజూరు చేయించారు.
గొల్లపల్లి మండల కేంద్రంలో 11 కేవీ, 33 కేవీ విద్యుత్ తీగల షిఫ్టింగ్ పనులను శనివారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ……

గొల్లపల్లి మండల కేంద్రంలో దాదాపు ₹ 74 లక్షలతో ఈ పనులు చేపడుతున్నామని తెలిపారు. ధర్మపురి నియోజకవర్గంలో విద్యుత్ మౌలిక వసతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం మొత్తం ₹ 4 కోట్లను మంజూరు చేయగా, అందులో దాదాపు ₹ 2.3 కోట్లు గొల్లపల్లి మండలానికే కేటాయించినట్లు మంత్రి అన్నారు.
👉 “ప్రజల ప్రాణ భద్రతకు మించిన అభివృద్ధి లేదు. ప్రమాదాలను తగ్గిస్తూ, ప్రతి కుటుంబం భయంలేకుండా జీవించే వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం” అని మంత్రి పేర్కొన్నారు.
👉 నాణ్యమైన పనులతో నిర్ణీత గడువులోగా షిఫ్టింగ్ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
👉 అభివృద్ధి పనులు నాణ్యతతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, విద్యుత్ శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
