👉 విచారణ అధికారిగా హైదరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ !
👉 బాధ్యులపై క్రిమినల్ కేసుల నమోదు చేసి శిక్షించాలి !
👉 ఇది ప్రభుత్వ నిర్ణయం శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన !
J.SURENDER KUMAR,
శాసనసభ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో చోటుచేసుకున్న కుట్రపూరిత సంఘటనల విషయంలో బాధ్యులైన వారందరిపై సమగ్ర విచారణ జరిపించి, క్రిమినల్ కేసులు నమోదు చేసి దోషులను శిక్షించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో వెల్లడించారు. విచారణ అధికారిగా హైదరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ కు బాధ్యతలు అప్పగించినట్లు సీఎం ప్రకటించారు.
👉 శాసనసభ సమావేశాల తొలిరోజు స్పీకర్ ను ఉద్దేశించి దుర్భాషలాడిన ఉదంతం, దళితులు నడిచిన నేలను శుద్ధి చేసిన సంఘటనలపై యావత్ శాసనసభ ఆందోళన వ్యక్తం చేసింది. సభాపతిని అవమానపరుస్తూ, జరిగిన దురదృష్టకర సంఘటన విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు అసెంబ్లీ అండగా నిలిచింది. ఈ దురదృష్టకర సంఘటనల్లో మానసిక ధైర్యం కోల్పోవద్దని స్పీకర్ కు విజ్ఞప్తి చేసింది.
👉 ఈ అంశాలపై బుధవారం శాసనసభలో జరిగిన సుదీర్ఘ చర్చపై సభా నాయకుడు, ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు.
ఈ విషయంలో స్పీకర్ కు ప్రభుత్వం అండగా నిలబడుతుందని చెప్పారు. సభాపతి మనసును గాయపరిచిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
👉 “ఉన్మాదానికి లోనై ఉసిగొల్పబడిన కొంతమంది ముష్కరులు అధికారులపై దాడులు చేయడమే కాకుండా సభాపతి స్థానాన్ని అవమానించేలా వ్యవహరించారు. శాసన సభాపతి తల్లిని అవమానించారు” అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
👉 దేశంపై దాడికి ప్రయత్నించిన ఉగ్రవాదులు, తీవ్రవాదులకు శాసనసభ ప్రాంగణంలో సభా అధ్యక్షుడిని అవమానిస్తూ మాట్లాడిన మాటలకు ఏమాత్రం తేడా లేదన్నారు. ఒక పథకం ప్రకారం దుర్మార్గమైన ఆలోచనతో జరిగిన దాడిగా ఈ సంఘటనను అభివర్ణించారు.
👉 “మన మాతృస్వామ్య సమాజం. స్త్రీని అపరకాళి, భద్రకాళి, భూమాత, భారతమాత, తెలంగాణ మాత అని పిలుస్తాం. ఏదైనా శక్తిని, గొప్పతనాన్ని ఆపాదించాలని, చర్చించాలని అనుకున్నప్పుడు తల్లితో పోలుస్తాం. మహిళతో పోలుస్తాం. మహిళను పూజించే మన సమాజం ఈ దేశాన్ని భారతమాత అని మహిళతో పోల్చుకుంటాం. రాష్ట్రాన్ని తెలంగాణ తల్లితో పోల్చుకుంటాం. అలాంటి ఈ తెలంగాణ నేల మీద ఒక తల్లిని అవమానించే విధంగా ప్రవర్తించడం దారుణం” అని ఆందోళన వ్యక్తం చేశారు.
👉 సభాపతి కి జరిగిన అవమానం సమాజానికి జరిగినట్టే. దోషులను తెలంగాణ సమాజం ఉపేక్షించదు. రజాకార్లను దిగంతాలకు తరిమి మట్టికరిపించిన చరిత్ర ఈ గడ్డది అని హెచ్చరించారు.
👉 ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలియజేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ సభాపతి మనసుకు గాయం చేయాలన్న ఆలోచన బరితెగించి మాట్లాడారని అన్నారు. సభాపతి గారిని అవమానించిన వారిని చట్టపరంగా శిక్షించే విషయంలో ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరిస్తుందని చెప్పారు.
👉 సెప్టెంబర్ 7వ తేదీ నుంచి శాసనసభ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చించాలని ప్రభుత్వం భావించింది. విద్యారంగానికి సంబంధించిన సమస్యలు, ధరణిలో జరిగిన అక్రమాలు, 22 (ఎ) వంటి అంశాలే కాకుండా ప్రతిపక్షాలు లేవనెత్తిన చాలా అంశాలను చర్చించాలని భావించాం. ప్రజా సమస్యలపై చర్చ జరగకూడదని అడ్డుకున్నారు” అని ముఖ్యమంత్రి అన్నారు.
👉 ఈ సంఘటనలు దళితుల ఆత్మగౌరవంపై, తెలంగాణ సమాజంపై జరిగిన దాడిగా, ఒక నేరంగా సభ ఖండించింది.
బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి, విద్యా రంగంలోని అవకతవకలు, ధరణి మరియు అప్పులు చర్చల ద్వారా బయటపడతాయనే భయంతో, అసెంబ్లీ కార్యకలాపాలకు అంతరాయం కలిగించేందుకు తమ శాసనసభ్యులను రెచ్చగొట్టడానికి బీఆర్ఎస్ ఒక ఫామ్‌హౌస్‌లో కుట్ర పన్నిందని ముఖ్యమంత్రి ఆరోపించారు.
👉 దళిత వర్గాలు సాంప్రదాయకంగా తమ భావాలను వ్యక్తపరిచే సాధనంగా ‘డప్పు’ను ఉపయోగించుకున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. అసెంబ్లీలోని బీఆర్ఎస్ శాసనసభ్యుల ప్రవర్తనకు భిన్నంగా, ఎర్రవెల్లికి వెళ్లిన నిరసనకారులు అలా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. కేసీఆర్‌ను దూషించలేదు, అవమానించలేదు. కులతత్వ వ్యాఖ్యలపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేయడానికి వారు అక్కడికి వెళ్లారు.
👉 ప్రతినిధులను లోపలికి ఆహ్వానించి వారి సమస్యలను పరిష్కరించడానికి బదులుగా, దళితులు నడిచిన మైదానాన్ని ‘శుద్ధి’ చేయమని రావు మద్దతుదారులు ఆదేశించారని, ఇది తీవ్ర అవమానమని సీఎం ఆరోపించారు. “మనం ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నామా లేక రాతియుగం నాటి రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నామా?” అని సీఎం ప్రశ్నించారు.
👉 సామాజిక అశాంతిని సృష్టించి, వర్గాల మధ్య విభేదాలను శత్రుత్వంగా మార్చేందుకు బీఆర్ఎస్ నాయకత్వం ప్రయత్నిస్తోందని సీఎం ఆరోపించారు. “దళితులు నడిచిన భూమిని మీరు పవిత్రం చేస్తే, మీ మనసుల్లో పేరుకుపోయిన అంటరానితనాన్ని ఎలా శుభ్రం చేస్తారు?” అని ఆయన ప్రశ్నించారు.
