👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J SURENDER KUMAR,
ఉస్మానియా ఆసుపత్రి, వరంగల్ సూపర్ స్పెషాలిటీ, ఎల్బీ నగర్, అల్వాల్ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ఆసుపత్రులకు సంబంధించి వైద్యులు, ఇతర సిబ్బంది అవసరాలను గుర్తించి నియామక ప్రక్రియను కూడా మొదలుపెట్టాలని చెప్పారు.
👉 రాష్ట్రంలో విద్య, వైద్యానికి సంబంధించిన క్షేత్రస్థాయి పరిస్థితులపై ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ నివాసంలో సీఎంవో అధికారులతో జరిగిన సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రధాన ఆసుపత్రుల నిర్మాణం, వాటి పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
👉 ఆసుపత్రుల నిర్మాణం పూర్తయ్యే నాటికి సిబ్బంది కొరత లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. నిర్మాణాలు పూర్తయ్యేనాటికి ఆసుపత్రుల్లో అవసరమైన అత్యాధునిక పరికరాలను కొనుగోలు చేసి అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని చెప్పారు.
👉 జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించేలా చూడాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో పాటు అధికారులు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, ఆసుపత్రులను విధిగా సందర్శించాలని స్పష్టం చేశారు.
👉 జిల్లా స్థాయిలో ప్రతి వారం వీటిపై సమీక్ష నిర్వహించాలన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాఠశాలల్లో అవసరమైన చోట మరమ్మతు పనులను చేపట్టాలని తెలిపారు.
👉 డిసెంబరులో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించ తలపెట్టిన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపైనా సమావేశంలో చర్చించారు. సమ్మిట్ ఏర్పాట్లు, అతిథులు, పెట్టుబడుల విషయంలో పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. త్వరలోనే ఏర్పాట్లను పరిశీలిస్తానని స్పష్టం చేశారు.
👉 ఈ సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి , ప్రభుత్వ సలహాదారు కె రామకృష్ణారావు , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు , రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ తో పాటు సీఎంవో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
