ఇళ్ల పట్టాలు ఇచ్చారు..ఆన్‌లైన్  మరిచారు.!

👉 ఇళ్లు ఖాళీ చేయాలంటూ అధికారుల హెచ్చరికలు !

👉 అధికారుల నిర్లక్ష్యంతో అర్హులైన పేదలకు అవస్థలు !

👉 61 మంది లబ్ధిదారుల ఇళ్లను వెంటనే ఆన్‌లైన్ చేయాలి!

👉 ఖాళీ ఇళ్ల గుర్తింపుపై జరుగుతున్న ప్రచారంపైనా విచారణ చేయాలి !.

👉 అసలైన లబ్ధిదారులకే ఇళ్లు కేటాయించాలి !

👉 మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ .,!

J.SURENDER KUMAR,

నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇళ్ల విషయంలో అధికారుల నిర్లక్ష్యం పేదలకు శాపంగా మారిందని జగిత్యాల మున్సిపల్ మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ ప్రజావాణిలో కలెక్టర్ సత్యప్రసాద్ ఫిర్యాదు చేశారు.  పట్టాలు అందజేసిన 61 మంది అర్హుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడంతో ఇప్పుడు తమ ఇళ్లను ఖాళీ చేయాల్సి వస్తుందేమోనన్న భయాందోళనలో లబ్ధిదారులు ఉన్నారని ఆమె అందులోపేర్కొన్నారు.

👉 61 పట్టాలు రద్దు.. కొత్త లబ్ధిదారుల ఎంపిక..!

జగిత్యాల పట్టణంలో మొత్తం 4,560 డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టగా, 3,722 ఇళ్లను పూర్తిచేసి 03-10-2023న పట్టాలు పంపిణీ చేశారని పేర్కొన్నారు అయితే అప్పట్లో ఔట్‌సోర్సింగ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్ల ద్వారా ఇతర ప్రాంతాల్లో నివసించే 61 మందికి పట్టాలు వెళ్లినట్లు గుర్తించి వాటిని రద్దు చేశారని వివరించారు. అనంతరం అర్హులైన నిరుపేదలను విచారించి అదే తేదీతో 61 మందికి పట్టాలు అందజేశారని తెలిపారు.

👉 పట్టాలు ఇచ్చారు.. ఆన్‌లైన్ మాత్రం చేయలేదు!

కొత్తగా ఎంపికైన 61 మంది లబ్ధిదారుల పట్టాలను అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడంతో సమస్య తలెత్తిందని జయశ్రీ అన్నారు. సెప్టెంబర్‌ 4న హౌసింగ్‌ అధికారులు విచారణకు వెళ్లి.. పట్టాలు ఆన్‌లైన్‌లో లేవని, ఇళ్లు ఖాళీ చేయాలని చెప్పడంతో లబ్ధిదారులు ఆందోళనకు గురయ్యారని తెలిపారు. సెప్టెంబర్‌ 7న ప్రజావాణిలో ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు.

👉 ఇంటి నంబర్లు బహిర్గతం చేయాలి.!

61 మంది లబ్ధిదారులకు కేటాయించిన ఇంటి నంబర్లను అధికారులు బహిర్గతం చేసి ప్రజల్లో నెలకొన్న అనుమానాలు, భయాందోళనలను తొలగించాలని ఆమె డిమాండ్‌ చేశారు. తాళం వేసి ఉన్న ఇళ్లపై రెడ్‌ కలర్‌తో ‘X’ మార్క్‌ వేయడం, ఇళ్లు తొలగిస్తున్నారనే ప్రచారంతో పేదలు పనులకు వెళ్లకుండా ఇళ్ల వద్ద ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు.!

👉  L2 పేర్ల విషయంలో పారదర్శకత ఏదీ ?

ఇటీవల వార్డుల్లో ఎల్‌2 కింద ప్రతి కౌన్సిలర్‌ 5 నుంచి 6 మంది పేర్లు ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోందని జయశ్రీ తెలిపారు. ఇప్పటికే ప్రజావాణిలో దరఖాస్తులు చేసుకున్న అసలైన లబ్ధిదారులను పక్కనపెట్టి, కొందరు తమకు అనుకూలమైన వారి పేర్లను ప్రతిపాదించే అవకాశం ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి పారదర్శకత పాటించాలని కోరారు.

👉 ఖాళీ ఇళ్ల గుర్తింపుపై విచారణ జరపాలి..!

కలెక్టర్కు చేసిన ఫిర్యాదు పత్రం ( ఫైల్ ఫోటో)

నూకపల్లి డబుల్‌ బెడ్రూం ఇళ్ల వద్ద గత వారం, పది రోజులుగా కొందరు ఖాళీగా ఉన్న ఇళ్లను గుర్తిస్తున్నారని, వివరాలు అడిగితే ఖాళీ ఇళ్లను గుర్తించి చెబితే వాటిలో ఉండేందుకు పట్టాలు ఇస్తామని అధికారులు చెప్పినట్లు కొందరు చెబుతున్నారని జయశ్రీ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కూడా పూర్తిస్థాయి విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని కోరారు.

👉 డ్రా ద్వారా మాత్రమే కేటాయింపులు జరపాలి..!

గతంలో అనుసరించిన విధానంలోనే ఉన్నతాధికారుల సమక్షంలో పారదర్శకంగా డ్రా నిర్వహించి, కేవలం అసలైన అర్హులైన లబ్ధిదారులకే డబుల్‌ బెడ్రూం ఇళ్ల పట్టాలు కేటాయించాలని జయశ్రీ డిమాండ్‌ చేశారు. 61 మంది లబ్ధిదారుల పట్టాలను తక్షణమే ఆన్‌లైన్‌ చేసి వారి సమస్యకు పరిష్కారం చూపాలని, మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదు పత్రంలో పేర్కొన్నారు.