👉 డిసెంబర్ 15 నాటికి నిర్మాణ పనులు పూర్తి చేస్తాం !
👉 మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిల హామీతో.. సమ్మె విరమణ !
J . SURENDER KUMAR,
జగిత్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులు, వైద్యులు చేపట్టిన సమ్మెను గురువారం విరమించారు. వైద్య విద్యార్థుల సమస్యలపై రాష్ట్ర మంత్రులు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరియు ఉన్నతాధికారులతో జరిగిన చర్చలు సానుకూలంగా సాగడంతో విద్యార్థులు సమ్మె విరమించేందుకు అంగీకరించారు.
డిసెంబర్ 15వ తేదీ నాటికి మెడికల్ కాలేజీ భవనం, హాస్టల్ భవనాలు, ప్లేగ్రౌండ్, మెస్ తదితర మౌలిక వసతుల నిర్మాణ పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు.

డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME), వైద్య శాఖకు చెందిన అధికారులు విద్యార్థులతో నేరుగా సమావేశమై వారి సమస్యలను తెలుసుకుని చర్చించారు.
రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆర్ & బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫోన్ ద్వారా విద్యార్థులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి వారు హామీ ఇచ్చారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీలపై సంతృప్తి వ్యక్తం చేసిన వైద్య విద్యార్థులు, వైద్యులు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. రేపటి నుంచి మెడికల్ కాలేజీలో తరగతులు, వైద్యుల విధులు యథావిధిగా కొనసాగనున్నాయి.

నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, మెడికల్ కాలేజీ విద్యార్థుల ప్రతినిధులతో రేపు ఉదయం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. పనుల పురోగతిని వేగవంతం చేసేందుకు అవసరమైన అదనపు కార్మికులను సమీకరించి, రాబోయే రెండు నెలల్లో నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
విద్యార్థులకు అవసరమైన విద్యా, వసతి, క్రీడా, భోజన తదితర మౌలిక వసతులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అధికారులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు బి. రాజ గౌడ్, అదనపు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమాదేవి, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ సుభాష్ కుమార్ వైద్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
