👉 లక్షలాది భక్తుల ఆకలి తీర్చే అక్షయ పాత్ర..!
👉 శ్రీవారి సన్నిధిలో నిత్య అన్నదాన మహాయజ్ఞం.!
J.SURENDER KUMAR,
“వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన.. వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి” అనే స్తోత్రానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే తిరుమల క్షేత్రం.. భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించడమే కాదు.. ఆకలితో వచ్చిన ప్రతి భక్తుడి కడుపు నింపే అన్నపూర్ణ నిలయంగా కూడా విరాజిల్లుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు టీటీడీ అందిస్తున్న నిత్య ఉచిత అన్నప్రసాద సేవ అక్షయపాత్రలా కొనసాగుతోంది.
రోజుకు లక్షలాది మంది భక్తులకు ఉచితంగా ఆహారం అందించడం ఒక సాధారణ సేవ కాదు.. అన్నదానం మహాదానం అనే సనాతన భారతీయ సంస్కృతికి తిరుమలలో ప్రతిరోజూ జరుగుతున్న మహోత్సవం. భక్తుల ఆకలి తీర్చడాన్ని స్వామివారి సేవగానే భావిస్తూ టీటీడీ అన్నప్రసాద విభాగం 24 గంటలూ నిరంతరం సేవలందిస్తోంది.
👉 మూడు లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం..!
సాధారణ రోజుల్లోనే తిరుమలలో సుమారు 1.80 లక్షల నుంచి 1.90 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తుండగా.. వారాంతాలు, పర్వదినాలు, రద్దీ రోజుల్లో ఈ సంఖ్య 3 లక్షలకు పైగా చేరుతోంది. అల్పాహారం, పానీయాలు, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం కలిపి రోజుకు దాదాపు 3 లక్షల సర్వింగ్స్ భక్తులకు అందుతున్నాయి. భక్తుడు ఎక్కడ ఉన్నా.. ఎప్పుడు ఆకలి వేసినా.. అన్నప్రసాదం అందేలా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్న భక్తుల నుంచి వసతి సముదాయాల్లో ఉన్న యాత్రికుల వరకు అన్నప్రసాదం చేరుతోంది.
👉 1985లో మొదలై.. నేడు మహాయజ్ఞంగా..!
స్వర్గీయ నందమూరి తారక రామారావు సంకల్పంతో 1985 ఏప్రిల్ 6న తిరుమలలో శ్రీ వేంకటేశ్వర నిత్యాన్నదాన పథకం ప్రారంభమైంది. అనంతరం 1994 ఏప్రిల్ 1న ఈ పథకాన్ని ట్రస్టుగా మార్చారు. నాటి చిన్న సంకల్పం.. నేడు కోట్లాది భక్తుల ఆకలి తీర్చే మహత్తర సేవగా విస్తరించింది. శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుమలతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లోనూ అన్నప్రసాద సేవ విస్తరిస్తోంది.
👉 మూడు వంటశాలలు.. 24 గంటల సేవ.!

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, శ్రీ అక్షయ వంటశాల, వకుళమాత వంటశాలలు నిరంతరం పనిచేస్తున్నాయి.
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో రోజుకు 80 వేల మందికి పైగా భక్తులకు అన్నప్రసాదం అందుతోంది. ఉదయం ఉప్మా, పొంగలి, చట్నీ, సాంబార్ నుంచి మధ్యాహ్నం, రాత్రి భోజనం వరకు అనేక రకాల పదార్థాలను భక్తులకు వడ్డిస్తున్నారు.
శ్రీ అక్షయ వంటశాలలో ఉప్మా, పొంగలి, సాంబారన్నం, పెరుగన్నం, టమోటా రైస్, పాలు, టీ, కాఫీ తదితరాలను సిద్ధం చేస్తున్నారు. రద్దీ రోజుల్లో మజ్జిగ, బాదం పాలు, బిస్కెట్లు, జ్యూస్ ప్యాకెట్లను సైతం పంపిణీ చేస్తున్నారు. వకుళమాత వంటశాల ద్వారా యాత్రికుల వసతి సముదాయాలు, అతిథి గృహాలు, ఇతర ప్రాంతాల్లోని భక్తులకు అన్నప్రసాదం చేరుతోంది.
👉 క్యూలో ఉన్న భక్తుడికీ.. కడుపు నిండేలా..!
శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో గంటల తరబడి వేచి ఉండే భక్తులు ఆకలితో ఇబ్బంది పడకుండా టీటీడీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు, క్యూ లైన్ల వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాలు, PAC అన్నప్రసాద భవనాలు, వసతి సముదాయాల్లోని భోజనశాలల ద్వారా ఆహారం, పానీయాలు అందిస్తున్నారు. భక్తుడి ఆకలి తీరితేనే.. అతని శ్రీవారి దర్శనం సంపూర్ణమవుతుందన్న భావనతో ఈ సేవ కొనసాగుతోంది.
👉 రోజుకు 15.8 టన్నుల బియ్యం..!
లక్షలాది మంది భక్తులకు ఆహారం అందించేందుకు తిరుమలలో ప్రతిరోజూ భారీగా ముడి పదార్థాలు వినియోగిస్తున్నారు.
రోజుకు సుమారు 15,788 కిలోల బియ్యం, 3,110 కిలోల సన్‌ఫ్లవర్ ఆయిల్, 2,861 కిలోల కందిపప్పు, 2,832 కిలోల సుజీ రవ్వ, 2,825 కిలోల గోధుమ రవ్వ, 1,729 కిలోల మినప్పప్పు వినియోగిస్తున్నారు. ఇవే కాకుండా ఉప్పు, బెల్లం, చింతపండు, కొబ్బరికాయలు, చక్కెర, ఎండు మిర్చి, ధనియాలు తదితర ముడి పదార్థాలను కూడా భారీగా వినియోగిస్తున్నారు.
👉 తొమ్మిది నెలల్లోనే 9 కోట్లకు పైగా సర్వింగ్స్..!
2026 జనవరి 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు తిరుమలలోని వివిధ అన్నప్రసాద కేంద్రాల ద్వారా 9 కోట్లకు పైగా సర్వింగ్స్ భక్తులకు అందించారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తాజా, నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని సిద్ధం చేసి అందిస్తున్నారు.
👉 ₹ 2,900 కోట్లకు పైగా.. భక్తుల భక్తి కానుక.!
తిరుమల అన్నప్రసాద సేవకు భక్తుల విరాళాలే ప్రధాన ఆధారం. శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ వద్ద రూ.2,900 కోట్లకు పైగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయని టీటీడీ వెల్లడించింది.
ఈ నిధులపై వచ్చే ఆదాయంతో లక్షలాది మంది భక్తులకు నిత్యం ఉచితంగా అన్నప్రసాదం అందుతోంది.
అంటే.. ఒక భక్తుడు సమర్పించిన భక్తి కానుక.. మరో భక్తుడి ఆకలి తీర్చే అన్నప్రసాదంగా మారుతోంది. భక్తుడి చేతి నుంచి వచ్చిన విరాళం.. శ్రీవారి సన్నిధిలో మరో భక్తుడి కడుపు నింపుతున్న పవిత్ర సేవగా మారుతోంది.
👉 ఆధునిక సాంకేతికతతో.. మరింత విస్తరణ..!
అన్నప్రసాద సేవను మరింత విస్తరించేందుకు టీటీడీ ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. 2024లో వకుళమాత సెంట్రలైజ్డ్ కిచెన్‌ను ప్రారంభించి అదనంగా 28 ప్రాంతాలకు ఆహార పంపిణీని విస్తరించింది.
PAC-5లో ఒకేసారి సుమారు 1,500 మంది భోజనం చేసే సామర్థ్యం కల్పించారు. రోజుకు 2 లక్షల మంది భక్తులకు ఆహారం తయారు చేయగల సామర్థ్యంతో కొత్త శాటిలైట్ ఆటోమేటెడ్ కిచెన్ ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయి
👉 వెయ్యి మంది సిబ్బంది.. మరో వెయ్యి మంది శ్రీవారి సేవకులు.!
ఈ మహత్తర అన్నదాన యజ్ఞం వెనుక సుమారు వెయ్యి మందికి పైగా అన్నప్రసాద విభాగం సిబ్బంది, మరో వెయ్యి మందికి పైగా శ్రీవారి సేవకులు నిరంతరం శ్రమిస్తున్నారు.
వంట చేయడం నుంచి భక్తులకు వడ్డించడం వరకు.. క్యూలైన్లలో ఆహారం అందించడం నుంచి వసతి సముదాయాలకు తరలించడం వరకు.. ప్రతి దశలోనూ సమన్వయంతో సేవలు కొనసాగుతున్నాయి.
👉 అన్నం పెట్టే చేతుల్లో.. శ్రీవారి సేవ..!
తిరుమలలో అన్నప్రసాదం అంటే కేవలం ఆకలి తీర్చే ఆహారం కాదు.. అది ఒక ఆధ్యాత్మిక అనుభూతి.
శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తుడికి కడుపు నింపి.. మనసు నింపి.. తృప్తిగా స్వామివారి సన్నిధికి పంపించడం వెనుక ఒక మహత్తరమైన సేవా సంకల్పం ఉంది. “అన్నదానం మహాదానం” అనే సనాతన ధర్మ సందేశాన్ని ఆచరణలో చూపిస్తూ.. ప్రతిరోజూ లక్షలాది మంది భక్తుల ఆకలి తీర్చే తిరుమల.. నిజంగానే “అన్నపూర్ణ నిలయం”గా వెలుగొందుతోంది.
